Winter Care Tips: చలికాలంలో బీ కేర్ ఫుల్.. ఇలా సేఫ్ గా ఉండండి..
ABN, Publish Date - Dec 01 , 2024 | 04:23 PM
చలి రోజు రోజుకూ పెరుగుతోంది. వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, బాలింతలు మరింత జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చలికాలంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యంగా ఉండాలని సూచిస్తున్నారు.
చలి రోజు రోజుకూ పెరుగుతోంది. చలికాలంలో వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, బాలింతలు మరింత జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. పెరుగుతున్న చలి తీవ్రతతో శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకావం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. చలికాలంలో వృద్ధులు, చిన్నారులు బయట తిరగకపోవడం చాలా మంచిదని చెబుతున్నారు. తప్పనిసరైతే తలకు మఫ్లర్ లేదా మంకీ టోపీలు, ముఖానికి మాస్కులు ధరంచి బయటకు వెళ్లడం మంచిదంటున్నారు.
రోగనిరోధక శక్తి..
చలికాలంలో రోగనిరోధక శక్తి తగ్గితే సీజనల్, ఇతర వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. రోగనిరోధక వ్యవస్థను మెరుగు పర్చే విటమిన్లు, ఖనిజాలను అందించే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, సిట్రస్ పండ్లు తినడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. చలికాలంలో వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు చెక్ పెట్టాలంటే శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. పాలకూరతో చేసే కూరలు తింటే రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. పసుపు కలిపిన పాలు తాగితే రోగనిరోధక శక్తిని పెరగడమే కాకుండా శరీరం వెచ్చగా ఉంటుంది. మనిషిలో వ్యాధి నిరోధక శక్తి తక్కవగా ఉన్న వారికి ఎక్కువగా జబ్బుల బారినపడే అవకాశం ఉంటుంది. కాబట్టి పౌష్టికాహారం తింటూ రోగనిరోధక శక్తిని పెంచే ఫుడ్స్ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయాలంటే తగినంత నిద్ర కూడా అవసరం.
వ్యాయామం
చలికాలంలో వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. ఇలా చేయడం ద్వారా మానసిక స్థితి, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. చలికాలంలో ఔట్ డోర్ వర్కవుట్స్ చేయడం సాధ్యం కాకపోతే జిమ్ లో వ్యాయామం చేయడం మంచిది. ఒకవేళ బయట వ్యాయామం చేస్తే వెచ్చగా ఉండేలా తగిన దుస్తులు ధరించి చేయాలి.
పరిశుభ్రత..
చలికాలంలో వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల శుభ్రత ఎంతో ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. పరిసరాలు శుభ్రంగా లేకపోతే దోమలు వ్యాప్తి చెంది టైఫాయిడ్, డెంగీ విషజ్వరాల బారిన పడే ప్రమాదం ఉంటుందన్నారు. తాగునీటి విషయంలో కూడా ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. చలికాలంలో చేతుల పరిశుభ్రత కూడా చాలా ముఖ్యం. కాళ్లు, చేతులు గోరు వెచ్చని నీటితో కడుక్కున్న తర్వాత వ్యాస్‌లెన్, స్కిన్‌లోషన్ వంటివి రాసుకుంటే మంచిది.
వాహనం నడపకపోవడం మంచిది..
శీతల పానియాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా చిన్నారులకు వాటిని ఇవ్వడం మంచిది కాదు. చిన్నారులకు స్వెటర్లు వేయకుండా బయట తిరగనివ్వద్దు. రాత్రివేళల్లో వాహనాన్ని నడపక పోవడం చాలా మంచిది. ముఖ్యంగా ద్విచక్రవాహనంపై బయటకు వెళ్లే వారు హెల్మెట్, కాళ్లకు షూ, చేతులకు గౌజులు వేసుకోవడం బెటర్.
(Note:పై సమాచారం ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఇవ్వబడింది. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ABN దీనిని ధృవీకరించ లేదు. ఆరోగ్యానికి సంబంధించి ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించండి.)
Updated Date - Dec 01 , 2024 | 06:11 PM