Morning Walk Vs Evening Walk: మార్నింగ్ వాక్.. ఈవినింగ్ వాక్.. ఈ రెండిట్లో ఏది ఎంచుకోవాలంటే..
ABN , Publish Date - Dec 31 , 2024 | 09:16 AM
ఉదయం వేళ నడక, సాయంత్రం వేళ నడకతో కొన్ని భిన్నమైన ప్రయోజనాలు చేకూరుతాయి. వీటిపై అవగాహన పెంచుకుని వ్యక్తులు తమకు అనువైన సమయంలో వాకింగ్ చేస్తే అన్ని ప్రయోజనాలు చేకూరుతాయి.
ఇంటర్నెట్ డెస్క్: అన్ని రకాల వయసుల వారు సులభంగా చేయగలిగిన ఎక్సర్‌సైజు నడక మాత్రమే. పైసా ఖర్చు చేయకుండా, ఎటువంటి ప్రత్యేక పరికరాలు వినియోగించకుండానే నడకతో బోలెడన్న ఆరోగ్య ప్రయోజనాలు పొందొచ్చు. నడకతో గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. బరువు అదుపులో ఉంటుంది. మానసిక ఆరోగ్యం కూడా బాగుపడుతుంది. అయితే, ఉదయం వేళ వాకింగ్ మంచిదా లేక ఈ సాయంత్రాలు వాకింగ్ మంచిదా అని చాలా మందికి కలిగే సందేహం. మరి దీనికి సమాధానాన్ని ఈ కథనంలో తెలుసుకుందాం (Morning Walk Vs Evening Walk).
నిపుణులు చెప్పేదాని ప్రకారం, తెల్లవారుతున్న వేళ నడకతో రోజును ఓ సానుకూల దృక్పథంతో మొదలుపెట్టొచ్చు. ఉదయం నడకతో మానసిక ఆరోగ్యం మెరగవడంతో పాటు పేరిగే ఎనర్జీ లెవెల్స్‌తో రోజంతా ఉత్సాహంగా ఉండచ్చు.
Health: వాకింగ్, జాగింగ్, సైక్లింగ్.. వీటిల్లో ఎవరు దేన్ని ఎంచుకోవాలంటే..
ఉదయ నడక జీవక్రియలపై మంచి ప్రభావం చూపిస్తుంది. వేగవంతమైన మార్నింగ్ నడకతో జీవక్రియలు వేగవంతమవుతాయి. రోజంతా ఈ ఉత్సాహం కొనసాగి కొవ్వు కరిగిపోతుంది. బరువు అదుపులో ఉంటుంది. ఇక ఉదయం వేళ సూర్యరశ్మితో విటమిన్ డీ శరీరానికి సమృద్ధిగా అంది ఎముకలు, రోగనిరోధక శక్తి బలోపేతం అవుతాయి. ఉదయం నడకతో రాత్రివేళ నిద్రపై కూడా సానుకూల ప్రభావం ఉంటుంది. రాత్రి కంటినిండా నిద్రపట్టి ఆరోగ్యం మెరుగుతుంది.
ఇక సాయంత్రం వేళ నడకతో కూడా కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రోజంతా పని చేశాక రిలాక్స్ అయ్యేందుకు సాయంత్రం నడక ఎంతో ఉపయోగపడుతుంది. మనసు కుదుటపడి రాత్రిళ్లు కంటి నిండా నిద్రపోగలుగుతారు. పరిశోధనల ప్రకారం, సాయంత్రం వేళ కండరాల పనితీరు పతాకస్థాయిలో ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో శరీరానికి పూర్తిస్థాయి కసరత్తు లభిస్తుంది. ఈ సమయంలో కండరాలు కసరత్తుకు బాగా స్పందిస్తాయి. ఫలితంగా నడకతో సానుకూల ప్రభావం ఇనుమడిస్తుంది.
High Cholesterol: అధిక కొలెస్టెరాల్! ముఖం, కళ్లల్లో ఈ మార్పులు కనిపిస్తే డేంజరే!
ఇక సాయంత్రం వేళ స్నేహితులు, బంధువులు, ఇరుగుపొరుగు వారితో కలిసి నడిస్తే సామాజిక బంధాలు కూడా బలపడతాయి. ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇక రాత్రి సమయాల్లో కాలుష్యం కొంత తక్కువగటా ఉంటుంది కాబట్టి ఈ సమయాల్లో నడక ఊపిరి తిత్తుల ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుంది.
రెండిట్లో ఏది బెటర్?
ఉదయం పూట నడకతో మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని, జీవక్రియలు వేగవంతమవుతాయి. క్రమశిక్షణ కూడా అలవడుతుంది. పరగడుపున నడిస్తే కొవ్వు కూడా చాలా త్వరగా కరిగిపోతుంది. ఇక సాయంత్రం నడకతో స్ట్రెస్ తగ్గి మనసు రిలాక్స్ అయ్యే అవకాశాలు ఎక్కువ. కాబట్టి, నడకతో ఏ ప్రయోజనం ఆశిస్తున్నామనే దాన్ని బట్టి వ్యక్తులు తమకు నచ్చిన సమయంలో వాకింగ్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.