వీసా మోసాల కేసులో నేరం ఒప్పుకొన్న ముగ్గురు ఎన్‌ఆర్‌ఐలు
ABN, Publish Date - Nov 10 , 2024 | 04:39 AM
ఉద్యోగాలు కల్పిస్తామని ఆశ చూపి, తప్పుడు మార్గాల్లో వీసాలు ఇప్పించామని ముగ్గురు భారత సంతతి వ్యక్తులు నేరాన్ని అంగీకరించారు.
శిక్షలు విధించనున్న ఆమెరికా కోర్టు
కాలిఫోర్నియా, నవంబరు 9: ఉద్యోగాలు కల్పిస్తామని ఆశ చూపి, తప్పుడు మార్గాల్లో వీసాలు ఇప్పించామని ముగ్గురు భారత సంతతి వ్యక్తులు నేరాన్ని అంగీకరించారు. ఈ విషయాన్ని నార్తరన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కాలిఫోర్నియాలోని అటార్నీ కార్యాలయం బుధవారం ఓ ప్రకటన ద్వారా తెలిపింది. కాలిఫోర్నియోలో నివసించే కిశోర్ దత్తపురం (55), కుమార్ అశ్వపతి (55), సంతోష్ గిరి (48)లపై కేసు నమోదయింది. నానోసెమాంటిక్స్ పేరుతో నైపుణ్యంగల కార్మికులను సరఫరా చేసే కంపెనీని కిశోర్, అశ్వపతిలు నిర్వహిస్తున్నారు. న్యాయ సహాయం అందించేందుకు లెక్స్‌గిరి పేరుతో సంతోష్ గిరి సొంతంగా మరో సంస్థను నడుపుతున్నాడు. విదేశీయులు తాత్కాలిక ప్రాతిపదికన అమెరికాలో ఉద్యోగాలు చేసేందుకు ఉద్దేశించిన హెచ్-1బీ వీసాల్లో వీరు అక్రమాలకు పాల్పడినట్టు అమెరికా పోలీసులు గుర్తించారు. అశ్వపతికి విధించే శిక్షఫై ఈ నెల 25న విచారణ జరగనుంది. కిశోర్, సంతోషగిరిలకు విధించే శిక్షపై ఫిబ్రవరి 24న విచారణ జరగనుంది. వీరికి పదేళ్ల జైలు శిక్ష, 2.50లక్షల డాలర్ల(సుమారు రూ.2కోట్లు) ఫైన్ విధించే అవకాశం ఉంది.
Updated Date - Nov 10 , 2024 | 04:39 AM