ఉక్రెయిన్‌పై రష్యా భారీ దాడి
ABN, Publish Date - Nov 18 , 2024 | 02:18 AM
ఉక్రెయిన్‌పై రష్యా భారీ స్థాయిలో విరుచుకుపడింది. ఆదివారం తెల్లవారుజామున పలు నగరాల్లోని ఇంధన మౌలిక వనరులను లక్ష్యంగా పెద్దఎత్తున క్షిపణులు, డ్రోన్లతో దాడికి తెగబడింది.
120 క్షిపణులు, 90 డ్రోన్లతో విధ్వంసం
కీవ్, నవంబరు 17: ఉక్రెయిన్‌పై రష్యా భారీ స్థాయిలో విరుచుకుపడింది. ఆదివారం తెల్లవారుజామున పలు నగరాల్లోని ఇంధన మౌలిక వనరులను లక్ష్యంగా పెద్దఎత్తున క్షిపణులు, డ్రోన్లతో దాడికి తెగబడింది. ఫలితంగా ఇంధన వనరులకు తీవ్ర నష్టం సంభవించింది. ఆగస్టు తర్వాత ఉక్రెయిన్‌పై రష్యా భారీ క్షిపణి దాడి ఇదే. ప్రధానంగా ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు నగరాలు పేలుళ్లతో అట్టుడికాయి. రష్యా మొత్తంగా 120క్షిపణులు, 90డ్రోన్లతో ‘తీవ్రమైన దాడికి’ పాల్పడటం ద్వారా ఇంధన మౌలిక వనరులను విచ్ఛిన్నం చేసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌వ్యాప్తంగా విద్యుదుత్పాదన, సరఫరా వ్యవస్థపై శత్రుదేశం దాడికి తెగబడిందని ఫేస్‌బుక్‌లో ఉక్రెయిన్ విద్యుత్తు శాఖ మంత్రి జర్మన్ గాలుస్కో పేర్కొన్నారు. రష్యా దాడులతో కీవ్ సహా పలు నగరాల్లో అధికారులు విద్యుత్తు సరఫరాను నిలిపివేశారు. డ్రోన్ దాడి కారణంగా ఉక్రెయిన్‌లోని వోలిన్ ప్రాంతంలో ఇద్దరు సాధారణ పౌరులు మృతి చెందారు. జర్మన్ చాన్స్‌లర్ ఒలఫ్ స్కోల్జ్ 2022 తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో శుక్రవారం మాట్లాడారు. దీన్ని ఉక్రెయిన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఆండ్రిజ్ సైబిహా పరోక్షంగా ఉటంకిస్తూ రష్యా తెగబడిన దాడికి పుతిన్‌తో చర్చించిన నేతలే ‘‘నిజమైన బాధ్యులు’’అని అన్నారు. రష్యా దాడితో ఉక్రెయిన్‌కు పశ్చిమాన ఉన్న నాటో సభ్యదేశం పొలెండ్ అలెర్ట్ అయింది. తమ గగనతలంలో ఎయిర్‌ఫోర్స్‌ను అప్రమత్తం చేసింది.
Updated Date - Nov 18 , 2024 | 02:18 AM