Joe Biden: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు కరోనా
ABN, Publish Date - Jul 19 , 2024 | 05:29 AM
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార పర్వం కీలక దశలో ఉండగా.. ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్(81) కరోనా బారిన పడ్డారు. కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఎన్నికల ప్రచారానికి తాత్కాలికంగా దూరమయ్యారు.
వాషింగ్టన్, జూలై 18: అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార పర్వం కీలక దశలో ఉండగా.. ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్(81) కరోనా బారిన పడ్డారు. కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఎన్నికల ప్రచారానికి తాత్కాలికంగా దూరమయ్యారు. అధ్యక్షుడు జో బైడెన్ కరోనా పాజిటివ్‌గా తేలడంతో టీకా తీసుకున్నారని, తన స్వగృహంలో ఐసోలేషన్‌లో ఉన్నారని వైట్ హౌస్ వర్గాలు బుధవారం ప్రకటించాయి. బైడెన్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తారని పేర్కొన్నాయి. తాను అనారోగ్యానికి గురయ్యాయని బైడెన్ కూడా ఎక్స్(ట్విటర్)లో పోస్ట్ చేశారు.
కరోనా పాజిటివ్‌గా తేలడంతో లాస్‌వెగా్‌సలో బుధవారం తలపెట్టిన ప్రచార కార్యక్రమాన్ని బైడెన్ చివరి నిమిషంలో రద్దు చేసుకున్నారు. లాస్‌వెగాస్ నుంచి తిరుగు ప్రయాణమైనప్పుడు తన అధికారిక విమానం ఎయిర్ ఫోర్స్ వన్ వద్ద విలేకరులతో మాట్లాడిన బైడెన్.. తాను ఆరోగ్యంగానే ఉన్నానని పేర్కొన్నారు. కాగా బుధవారం ఓ ఇంటర్వ్యూలో బైడెన్ మాట్లాడుతూ.. తనకు తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తితే వైద్యుల సూచన మేరకు అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకోవడంపై ఆలోచిస్తానని చెప్పారు. ఆ ప్రకటన చేసిన కాసేపటికే ఆయన కరోనా బారిన పడ్డారు.
Updated Date - Jul 19 , 2024 | 05:29 AM