ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Attack On Trump: తుపాకీ సంస్కృతి కొత్తేమీ కాదు!

ABN, Publish Date - Jul 15 , 2024 | 05:13 AM

మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై హత్యాయత్నంతో అగ్రరాజ్యం అమెరికా ఉలిక్కిపడింది. ఈ రాజకీయ దాడి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, అధ్యక్ష అభ్యర్థులపై ....

  • అమెరికాలో పదవిలో ఉండగానే నలుగురు అధ్యక్షుల కాల్చివేత

(సెంట్రల్‌ డెస్క్‌)

మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై హత్యాయత్నంతో అగ్రరాజ్యం అమెరికా ఉలిక్కిపడింది. ఈ రాజకీయ దాడి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వాస్తవానికి అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, అధ్యక్ష అభ్యర్థులపై ఇలాంటి దాడులు అమెరికాకు కొత్తేమీ కాదు. 1776లో అమెరికాకు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఇలాంటి అనేక సంఘటనలు చోటుచేసుకున్నాయి. 2008లో ప్రచురితమైన కాంగ్రెస్‌ నివేదిక ప్రకారం 1865 నుంచి 2005 మధ్యకాలంలో అమెరికాలో అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, అధ్యక్ష అభ్యర్థులపై 15 ప్రత్యక్ష దాడులు జరిగాయి. చివరిసారిగా 2011లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా లక్ష్యంగా దాడి జరిగింది. అప్పుడు నేరుగా ఒబామాపై దాడి చేయలేదు కానీ, దుండగులు వైట్‌హౌ్‌సపై కాల్పులు జరిపినట్టు అధికారులు గుర్తించారు. అలాగే 2018లో అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్‌ కోసం పంపిన బాంబును భద్రతా సిబ్బంది ముందే పసిగట్టారు. ఇప్పుడు కూడా మరోసారి ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. ఈ నేపథ్యంలో గతంలో అమెరికా అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, అధ్యక్ష అభ్యర్థులపై జరిగిన కొన్ని దాడుల్లో కొన్ని ఘటనలు ఇవి..

జార్జి డబ్ల్యూ బుష్‌: 2005లో అప్పటి అధ్యక్షుడు జార్జి బుష్‌ జార్జియాలో నిర్వహించిన ఓ ర్యాలీలో అరుట్యునియన్‌ అనే వ్యక్తి గ్రెనేడ్‌ విసిరాడు. అది పేలకపోవడంతో ప్రమాదం తప్పింది. ఆ బాంబు బుష్‌కు కేవలం 61 అడుగుల దూరంలోనే పడింది. బుష్‌ను చంపాలనే గ్రెనేడ్‌ విసిరినట్టు ఆ వ్యక్తి అంగీకరించాడు.


రొనాల్డ్‌ రీగన్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు రొనాల్డ్‌ రీగన్‌ 1981లో వాషింగ్టన్‌ డీసీలోని హిల్టన్‌ హోటల్‌ నుంచి బయటకు వస్తుండగా జాన్‌ హింక్లీ జూనియర్‌ అనే వ్యక్తి .22 క్యాలిబర్‌ రివాల్వర్‌తో ఆయనపై కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ఆయనకు గాయాలైనప్పటికీ ప్రాణాలతో బయటపడ్డారు.

జెరాల్డ్‌ ఫోర్డ్‌: అమెరికా దేశ చరిత్రలో రెండు హత్యాయత్నాల నుంచి బయటపడిన ఏకైక అధ్యక్షుడు జెరాల్డ్‌ ఫోర్డ్‌. 1975 సెప్టెంబరు 5న ఆయన లినెట్‌ ఆలిస్‌ ఫ్రోమ్‌ అనే వ్యక్తి జరిపిన తుపాకీ కాల్పుల నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఈ సంఘటన జరిగిన 17 రోజుల తర్వాత సారా జేన్‌ మూర్‌ అనే మహిళ కూడా ఫోర్డ్‌ను తుపాకీతో కాల్చి చంపాలని ప్రయత్నించింది. తొలి గన్‌ షాట్‌ గురితప్పింది. రెండో షాట్‌కు ప్రయత్నించగా ఓ వ్యక్తి తుపాకీ పట్టుకోవడంతో ఆమె ప్రయత్నం విఫలమైంది.

జార్జి సి వాలెస్‌: 1972 మే 15న మేరీల్యాండ్‌లో నిర్వహించిన ర్యాలీలో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి, అప్పటి అలబామా గవర్నర్‌ జార్జి సి వాలె్‌సపై ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఐదు రౌండ్లు కాల్చగా బుల్లెట్‌ వాలెస్‌ నడుములోకి దూసుకెళ్లింది. దీంతో ఆయన పక్షవాతానికి గురయ్యారు.

రాబర్ట్‌ ఎఫ్‌ కెన్నెడీ: 1968 జూన్‌ 5న కాలిఫోర్నియాలోని డెమోక్రటిక్‌ ప్రైమరీలో గెలిచిన అనంతరం.. అంబాసిడర్‌ హోటల్‌లో రాబర్ట్‌ ఎఫ్‌ కెన్నెడీ నడుచుకుంటూ వెళ్తుండగా.. సిరాన్‌ అనే వ్యక్తి ఆయనను తుపాకీతో కాల్చాడు. తీవ్రంగా గాయపడిన కెన్నెడీ ఆ మరుసటి రోజు ఆస్పత్రిలో ప్రాణాలు విడిచారు.

హ్యారీ ట్రూమన్‌: 1950లో ఆస్కార్‌ కొలాజో, గ్రెసీలియో టొర్రెసోలా అనే వ్యక్తులు వైట్‌ హౌస్‌పై కాల్పులు జరిపారు. ఈ దాడిలో అప్పటి అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. కానీ ఒక పోలీస్‌ అధికారి మరణించారు.


ఫ్రాంక్లిన్‌ డి రూజ్‌వెల్ట్‌: ఫ్రాంక్లిన్‌ డి రూజ్‌వెల్ట్‌ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి మూడు వారాల మందు జిసిప్పె జంగారా అనే వ్యక్తి రూజ్‌వెల్ట్‌ లక్ష్యంగా తుపాకీతో కాల్పులు జరిపాడు. గురితప్పిన బుల్లెట్లు.. పక్కనే ఉన్న చికాగో మేయర్‌ ఆంటోనీ సెర్మాక్‌కు తగలడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు.

థియోడోర్‌ రూజ్‌వెల్ట్‌: 1901 నుంచి 1909 వరకూ అధ్యక్షుడిగా పనిచేసిన థియోడర్‌ రూజ్‌వెల్ట్‌ 1912 అక్టోబరు 14న డిన్నర్‌కు వెళ్తుండగా జాన్‌ ష్రాంక్‌ అనే వ్యక్తి తన .38 క్యాలిబర్‌ కోల్ట్‌ రివాల్వర్‌తో కాల్చాడు. ఈ దాడిలో ఆయన ప్రాణాలతో బయటపడ్డారు.

తుపాకీ చట్టాలపై మళ్లీ చర్చ..!

అమెరికాలో అధ్యక్షుడు, మాజీ అధ్యక్షులకు అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. అయినప్పటికీ మాజీ అధ్యక్షుడు ట్రంప్‌పై హత్యాయత్నం జరిగింది. ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన వ్యక్తులు సైతం సురక్షితంగా లేరని చెప్పడానికి ఈ సంఘటన ఒక ఉదాహరణ. ఆసక్తికర విషయం ఏమిటంటే అమెరికాలో అధ్యక్షులు, మాజీ అధ్యక్షులపై జరిగిన దాడులన్నీ దాదాపు తుపాకీతో జరినవే. ఈ నేపథ్యంలో అమెరికాలో కఠినమైన తుపాకీ చట్టాలపై చర్చ మరోసారి తెరపైకి వచ్చింది.

హత్యకు గురైన నలుగురు అధ్యక్షులు

అబ్రహాం లింకన్‌ : 1865 ఏప్రిల్‌ 14

జేమ్స్‌ గార్ఫీల్డ్‌ : 1881 జూలై 2

విలియం మెకిన్లీ : 1901 సెప్టెంబరు 6

జాన్‌ ఎఫ్‌ కెన్నెడీ : 1963 నవంబరు 22

Updated Date - Jul 15 , 2024 | 08:53 AM

Advertising
Advertising
<