వాన్స్ తెలుగింటి అల్లుడే!
ABN , Publish Date - Nov 07 , 2024 | 05:14 AM
అమెరికా ఉపాధ్యక్ష పదవిని చేపట్టబోతున్న జేడీ వాన్స్‌కు తెలుగు నేలకు మధ్య ప్రత్యేక సంబంధం ఉంది. ఆయన ఆంధ్రప్రదేశ్ అల్లుడు. వాన్స్ భార్య ఉష చిలుకూరి ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా, నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఉండ్రాజవరం
అమెరికా ఉపాధ్యక్షుడి సతీమణి తూర్పు గోదావరి అమ్మాయే
వాషింగ్టన్, నవంబరు 6: అమెరికా ఉపాధ్యక్ష పదవిని చేపట్టబోతున్న జేడీ వాన్స్‌కు తెలుగు నేలకు మధ్య ప్రత్యేక సంబంధం ఉంది. ఆయన ఆంధ్రప్రదేశ్ అల్లుడు. వాన్స్ భార్య ఉష చిలుకూరి ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా, నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఉండ్రాజవరం మండలం వడ్లూరు. ఉషను వాన్స్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఉష భర్త అమెరికా ఉపాధ్యక్షుడు కాబోతుండడంతోపాటు ఉష సెకండ్ లేడీ ఆఫ్ అమెరికా కాబోతున్న నేపథ్యంలో వడ్లూరు ప్రజలు సంబరాలు చేసుకున్నారు. కాగా, అమెరికా ‘సెకండ్ లేడీ’గా వ్యవహరించనున్న తొలి భారత సంతతి మహిళ కూడా ఉషే కావడం విశేషం. ఉష తాతముత్తాతల స్వగ్రామం వడ్లూరు. అయితే, తర్వాత కాలంలో వారు ఉపాధి, ఉద్యోగాల నిమిత్తం పలు ప్రాంతాలకు వలస వెళ్లారు. ఈ క్రమంలో ఉష తల్లిదండ్రులు కృష్ణాజిల్లాలోని ఉయ్యూరు సమీపంలో ఉన్న సాయిపురంలో ఉండేవారు. ఆ తర్వాత వారు అమెరికా వెళ్లి అక్కడే స్థిర పడ్డారు. ఉష అక్కడే జన్మించారు. ఆమె బాల్యం అంతా శాన్‌ఫ్రాన్సిస్కోలోనే గడిచింది. యేల్ యూనివర్సిటీ నుంచి హిస్టరీలో బ్యాచిలర్ డిగ్రీ పట్టాపుచ్చుకున్న ఆమె.. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ఎంఫిల్ పూర్తిచేశారు. తర్వాత లా కెరీర్ ప్రారంభించారు. సుప్రీం కోర్టు జడ్జీలు జాన్ రాబర్ట్స్, బ్రెట్ కవనాగ్ వద్ద సహాయకురాలిగా పనిచేసి మంచి పేరు సంపాదించారు. యేల్ లా స్కూల్‌లో ఉన్నప్పుడే వాన్స్‌తో ఉషకు పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. 2014లో వారు హిందు సంప్రదాయంలో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇవాన్, వివేక్ అనే ఇద్దరు అబ్బాయిలు, మిరాబెల్ అనే అమ్మాయి ఉన్నారు. కాగా, వాన్స్ బాల్యం అంతా కష్టాల మధ్య గడిచింది. బేవర్లీ కరోల్, డొనాల్డ్ రే బౌమాన్ దంపతులకు 1984, ఆగస్టు 2న వాన్స్ ఓహియోలో జన్మించారు. ఆయన చిన్నప్పుడే తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడంతో కష్టాలు మొదలయ్యాయి. వాన్స్ 17వ ఏట క్యాషియర్‌గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు. అయితే 2003లో గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత యూఎస్ మెరైన్ కార్ప్స్‌లో చేరి నాలుగేళ్ల పాటు సేవలు అందించారు. ఆ తర్వాత యేల్ లా స్కూల్‌లో చేరారు.
వాన్స్ గెలుస్తారని ముందే అనుకున్నా!
విశాఖపట్నం, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): తన మనువరాలి భర్త జేడీ వాన్స్ అమెరికాకు ఉపాధ్యక్షుడు కావ డం పట్ల విశాఖపట్నంలో ఉండే ఉష సమీప బంధువు శాంతమ్మ సంతోషం వ్యక్తం చేశారు. ఆయన విజయాన్ని ముందే ఊహించానని చెప్పారు. ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధితో శాంతమ్మ అనేక విషయాలు పంచుకున్నారు. ‘‘ఉదయం నుంచి గెలుపు ఖరారయ్యే వరకు టీవీ చూస్తూనే ఉన్నాను. ఇప్పటివరకూ ఉషతో, ఆమె భర్తతో మాట్లాడలేదు. విజయోత్సవాలు ముగిసిన తర్వాత మాట్లాడతాను భారత్, అమెరికా మధ్య సత్సంబంధాలు బలోపేతం చేసేలా చూడాలని వాన్స్‌ను కోరతాను’’ అని ఆమె అన్నారు.
మా ఊరికి గర్వకారణం
నిడదవోలు నియోజకవర్గం, వడ్లూరు గ్రామానికి చెందిన చిలుకూరి వారి ఆడపడుచు ఉష అమెరికా రెండో మహిళ కావడం ఆనందంగా ఉంది. మా గ్రామానికి ఒక్కసారిగా ప్రపంచ గుర్తింపు రావడం సంతోషంగా ఉంది. ఉష తాతముత్తాతలు ఉన్న గ్రా మంలో వారికి చెందిన ఇంటిస్థలం నేడు ప్రజలకు ఉపయోగ పడేలా తీర్చిదిద్దాం. ఉష కుటుంబం మూ లాలు ఇక్కడ ఉండటం మా ఊరికి గర్వకారణం.
- పెన్మత్స శ్రీనివాసరాజు, మాజీ సర్పంచ్, వడ్లూరు