Kiev : ఉక్రెయిన్‌పై భీకర దాడులు
ABN, Publish Date - Aug 27 , 2024 | 04:35 AM
ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడింది. తమదేశంలోకి చొచ్చుకువస్తున్న ఉక్రెయిన్‌కు చెక్ పెడుతూ.. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు 200కు పైగా క్షిపణులు, 100కు పైగా డ్రోన్లు, రాకెట్లతో దాడులు జరిపింది.
200కు పైగా క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించిన రష్యా
బ్రిటన్ జర్నలిస్టు సహా 13 మంది దుర్మరణం
కీవ్, ఆగస్టు 26: ఉక్రెయిన్‌పై రష్యా విరుచుకుపడింది. తమదేశంలోకి చొచ్చుకువస్తున్న ఉక్రెయిన్‌కు చెక్ పెడుతూ.. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు 200కు పైగా క్షిపణులు, 100కు పైగా డ్రోన్లు, రాకెట్లతో దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఉక్రెయిన్ వ్యాప్తంగా కీలక నగరాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. రాజధాని కీవ్ నగరంలో తాగునీటి సరఫరా, విద్యుత్తు వ్యవస్థలు అతలాకుతలమయ్యాయి. ఇంధన కేంద్రాలే లక్ష్యంగా రష్యా దాడులకు పాల్పడడంతో..
చాలా చోట్ల విద్యుత్తు అంతరాయాలేర్పడ్డాయి. ఈ దాడుల్లో 13 మంది మృతిచెందగా.. డజన్ల కొద్దీ పౌరులు గాయపడ్డారు.
మృతుల్లో బ్రిటన్ జర్నలిస్టు(రాయిటర్స్) కూడా ఉన్నారు. ఆదివారం అర్ధరాత్రి దాటాక రష్యా దాడులు ప్రారంభమైనట్లు ఉక్రెయిన్ వర్గాలు తెలిపాయి. సోమవారం ఉదయం వరకు కొనసాగిన బాంబింగ్.. రష్యా దురాక్రమణ తర్వాత అతిపెద్ద దాడులని పేర్కొన్నాయి. 127 బాలిస్టిక్, 102 క్రూయిజ్ క్షిపణులతోపాటు..
109 డ్రోన్లతో రష్యా దాడులకు పాల్పడినట్లు ఉక్రెయిన్ అధికారిక వార్తా సంస్థ ‘ఉక్రిఇన్ఫాం’ తెలిపింది. ఉక్రెయిన్ వైమానిక దళం 99 రష్యన్ డ్రోన్లను కూల్చివేసినట్లు తెలిపింది. రష్యా దాడుల్లో వేర్వేరు ప్రాంతాల్లో మొత్తం 13 మరణాలు నమోదయ్యాయని, డజన్ల కొద్దీ పౌరులు గాయపడ్డారని అధికారులు వివరించారు.
తూర్పు ఉక్రెయిన్‌లోని డోనెట్‌స్క్ ప్రాంతంలో.. ఓ హోటల్‌పై జరిగిన క్షిపణి దాడిలో.. బ్రిటిష్ జర్నలిస్టుల బృందం(రాయిటర్స్)లోని ఓ సభ్యుడు మరణించాడని, మరో ఐదుగురు పాత్రికేయులు గాయపడ్డారని వెల్లడించారు. ఇదే హోటల్‌లో మరో 7 మరణాలు నమోదైనట్లు తెలిపారు. ఈ దాడి అత్యంత హేయమైనదని, రష్యాకు తప్పక గుణపాఠం చెప్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ హెచ్చరించారు.
రష్యాలో 38 అంతస్తుల భవనంపై 9/11 తరహాలో ఉక్రెయిన్ డ్రోన్ దాడి
దాదాపు 23 ఏళ్ల క్రితం.. 2001 సెప్టెంబరు 11న న్యూయార్క్‌లోని జంట హర్మ్యాలను అల్‌ఖాయిదా ఉగ్రవాదులు విమానాలతో ఢీకొట్టారు గుర్తుందా? అచ్చం అలాగే.. ఉక్రెయిన్ డ్రోన్ ఒకటి సోమవారం రష్యాలోని సారటోవ్‌లో 38 అంతస్తుల నివాసభవనాన్ని ఢీకొట్టింది.
ఈ దాడిలో ఒక మహిళ సహా నలుగురికి గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆ మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. కాగా.. ఉక్రెయిన్ డ్రోన్ దాడి వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యింది. ఉక్రెయిన్ డ్రోన్ దాడుల నేపథ్యంలో సారటోవ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించారు.
Updated Date - Aug 27 , 2024 | 04:42 AM