Manipur: ఆందోళనకు దిగిన బీజేపీ ఎమ్మెల్యేలు
ABN, Publish Date - Dec 11 , 2024 | 08:27 AM
మణిపూర్‌కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలు దేశ రాజధాని న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టారు. మణిపూర్ విషయంలో జోక్యం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీని వారు డిమాండ్ చేశారు.
న్యూఢిల్లీ, డిసెంబర్11: ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో జాతుల మధ్య హింస కారణంగా.. దాదాపు ఏడాదిన్నరగా ఘర్షణలు చెలరేగుతోన్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై జోక్యం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి కూకీ జో తెగకు చెందిన ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు. ఆ క్రమంలో దేశ రాజధాని న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద10 మంది ఎమ్మెల్యేలు మంగళవారం ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో చెలరేగిన హింసను పరిష్కరించేందుకు.. మణిపూర్‌లో కూకీలు నివసించే ప్రాంతాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా చేయడం ఒకటే మార్గమని ఈ సందర్భంగా వారు అభిప్రాయపడ్డారు.
యనైటెడ్ పీపుల్స్ ఫ్రంట్, కుకీ నేషనల్ ఆర్గనైజేషన్స్ సంస్థలను ఒకే చోటకు చేర్చి... ఆయా సంస్థలతో కుకీ జో తిరుగుబాటుదారులు సంప్రదింపులు జరపడంలో తీవ్ర జాప్యం చేయడంపై సదరు ఎమ్మెల్యేలు విమర్శలు గుప్పించారు. ఎంపిక చేసిన సాయుధ సమూహాలతో తమ ప్రజలలో విభజన సృష్టించేందుకు చేసే ప్రయత్నాలను తాము ఖండిస్తున్నామని వారు తెలిపారు. ఈ చర్యలను నిలిపివేయాలని ఈ సందర్భంగా వారు కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
చాలా కాలంగా మెయితీ వర్గం అత్యధిక ప్రాబల్యమున్న జిల్లాల్లో గత ప్రభుత్వాలన్నీ అభివృద్ధి పరిచాయని ఈ సందర్బంగా వారు ఉంటంకించారు. అంతేకాకుండా.. అవి తీవ్ర వివక్ష పాటించాయని గుర్తు చేశారు. ఇది సుదీర్ఘ కాలంగా కొనసాగిందని వారు స్పష్టం చేశారు. ఇక గత 19 నెలలుగా రాష్ట్రంలోని పరిస్థితులు మరింత సంక్షోభంలోకి నెట్టాయని వారు వివరించారు.
అయితే రాష్ట్రాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకు రావడంలో.. మణిపూర్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. ఈ నేపథ్యంలో కుకి-జో గిరిజనులు అత్యధికంగా నివసించే జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు నేరుగా నిధులు ఇవ్వాలని ఆందోళనకు దిగిన ఎమ్మెల్యేలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక ఈ ఆందోళన చేపట్టిన కుకీ జో తెగకు చెందిన ఎమ్మెల్యేల్లో ఏడుగురు బీజేపీ ఎమ్మెల్యేలు సైతం ఉన్నారు.
గతేడాది.. అంటే 2023 మేలో మేయితి, కుకీ జో తెగల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణల్లో దాదాపు 250 మందికి పైగా మరణించారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. నాటి నుంచి అడపా దడపా ఘర్షణలు చెలరేగుతూనే ఉన్నాయి. అయితే గత నవంబర్‌లో ఆరుగురు వ్యక్తులు అదృశ్యమయ్యారు. వారిలో ముగ్గురు మహిళలు, మరో ముగ్గురు చిన్నారులున్నారు. వారి మృతదేహాలు సమీపంలోని నది వద్ద స్థానికులు గుర్తించారు. దీంతో మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మొబైల్, ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. వాటిని తాజాగా అంటే.. కొన్ని గంటల క్రితమే ప్రభుత్వం ఆయా సేవలను పునరుద్దరించింది.
For National News And Telugu News
Updated Date - Dec 11 , 2024 | 08:33 AM