Arvind Kejriwal: అదొక బీజేపీ కుట్ర.. ఈడీ వద్ద ఎలాంటి ఆధారాలు లేవు
ABN, Publish Date - Jun 21 , 2024 | 07:39 AM
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ లభించిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ లీగల్ టీమ్ ఘాటుగా స్పందించింది. తమ పార్టీ నాయకుడికి వ్యతిరేకంగా..
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో (Delhi Excise Policy) సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు (Arvind Kejriwal) బెయిల్ లభించిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Admi Party) లీగల్ టీమ్ ఘాటుగా స్పందించింది. తమ పార్టీ నాయకుడికి వ్యతిరేకంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వద్ద ఎలాంటి సాక్ష్యాలు లేవని, ఈ కేసు బీజేపీ కుట్ర అని ఆరోపించింది. ఒకరి ఒత్తిడి మేరకే ఈడీ పని చేస్తోందని కుండబద్దలు కొట్టింది. ఈ మేరకు ఆప్ లీగల్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు సంజీవ్ నాసియార్ (Sanjeev Nasiar) వ్యాఖ్యలు చేశారు.
‘‘ఎట్టకేలకు ఇన్ని రోజుల తర్వాత నిజం గెలిచింది. అసలు ఈ కేసు అనేది పెద్ద అబద్ధం. ఇది భారతీయ జనతా పార్టీ కుట్ర. కేజ్రీవాల్‌కు బెయిల్ దొరకడం అనేది కేవలం పార్టీ విజయం మాత్రమే కాదు.. మనందరిది, ఈ దేశానిది. మా పార్టీ నాయకులకు వ్యతిరేకంగా ఈడీ వద్ద ఎలాంటి రుజువులు లేవు. ఈడీ అధికారులందరూ ఒకరి ఒత్తిడి మేరకే పని చేస్తున్నారు. అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలని ప్రయత్నించారు కానీ, ఇందులో వారు విఫలమయ్యారు’’ అని సంజీవ్ నాసియార్ పేర్కొన్నారు. అటు.. కేజ్రీవాల్ రూ.1 లక్ష పూచీకత్తుతో బెయిల్ మంజూరైందని, ఇది ఆప్ నాయకులతో పాటు దేశ ప్రజలకు గొప్ప విజయమని ఆప్ న్యాయ బృందంలో భాగమైన న్యాయవాది రిషికేష్ కుమార్ అన్నారు.
ఇంకా ఎవరెవరు ఎలా స్పందించారంటే?
ప్రియాంక కక్కర్ (ఆప్ జాతీయ అధికార ప్రతినిధి): ఈ కేసు పూర్తిగా ఫేక్. మొత్తం బీజేపీ కార్యాలయంలోనే ఈ కేసు రాశారు. చారిత్రాత్మక తీర్పు ఇచ్చినందుకు కోర్టుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. పీఎంఎల్‌ఏ కేసులో సాధారణ బెయిల్ దొరకడం అనేది.. నిర్దోషిగా విడుదల కావడం కంటే తక్కువేమీ కాదు.
సౌరభ్ భరద్వాజ్ (ఢిల్లీ మంత్రి, ఆప్ లీడర్): దేశంలోని ఈడీ, సీబీఐ వంటి సంస్థలన్నీ స్వాధీనం చేయబడ్డాయి. ప్రజలు విశ్వసించే న్యాయవ్యవస్థ మాత్రమే మిగిలి ఉంది. పిఎంఎల్‌ఎలో చాలామందికి కేవలం సుప్రీంకోర్టు నుంచే ఉపశమనం లభిస్తుంది. దిగువ కోర్టులు ఎప్పుడూ ఉపశమనం ఇవ్వవు. ఇప్పుడు దిగవ కోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వడాన్ని బట్టి చూస్తే.. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వం వద్ద ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టమైపోయింది.
హర్భజన్ సింగ్ (పంజాబ్ విద్యుత్ శాఖ మంత్రి): ఈరోజు రాజ్యాంగం గెలిచింది.. ఎన్నికలకు ముందు ఒక నాయకుడిని అరెస్టు చేశారు. ఇప్పుడు అతని విడుదల ప్రజాస్వామ్యాన్ని గెలిపించింది. ప్రజలకు కోర్టుపై విశ్వాసం మరింత బలపడింది.
Read Latest National News and Telugu News
Updated Date - Jun 21 , 2024 | 07:39 AM