బద్లాపూర్ స్కూల్ పిల్లలపై రేప్ కేసు నిందితుడు సోమవారం ఎన్‌కౌంటర్‌లో మృతి
ABN, Publish Date - Sep 24 , 2024 | 04:09 AM
మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన బద్లాపూర్ పాఠశాలలో జరిగిన అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న అక్షయ్ షిండే సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించాడు.
ముంబై, సెప్టెంబరు 23: మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన బద్లాపూర్ పాఠశాలలో జరిగిన అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న అక్షయ్ షిండే సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. బద్లాపూర్‌లోని ప్రైవేటు పాఠశాలలో క్లీనర్‌గా పనిచేసే అతడు ఆగస్టు 12న నాలుగు, అయిదేళ్ల వయసు ఉన్న ఇద్దరు బాలికలను మరుగుదొడ్ల వద్దకు తీసుకువెళ్లి అత్యాచారం చేసినట్టు కేసు నమోదయింది. దీనిపై ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. విచారణ నిమిత్తం సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో బద్లాపూర్ నుంచి తాలోజా జైలుకు పోలీసు వాహనంలో తీసుకొని వెళ్తుండగా ఎన్‌కౌంటర్ జరిగింది.
నిందితుడు అక్షయ్ షిండే ఆకస్మికంగా ఓ అధికారి చేతిలో ఉండే తుపాకీని లాక్కొని కాల్పులు జరిపినట్టు పోలీసులు తెలిపారు. వెంటనే ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురు కాల్పులు జరపగా అతడు తీవ్రంగా గాయపడ్డట్టు చెప్పారు. అనంతరం ఆస్పత్రికి తరలించగా అక్కడ ప్రాణాలు కోల్పోయినట్టు వివరించారు ఈ సంఘటనలో ఏఎ్‌సఐ నీలేష్ మోరే, ఇన్‌స్పెక్టర్ సంజయ్ షిండేలు గాయపడ్డారు.
సంజయ్ షిండే జరిపిన కాల్పుల్లోనే నిందితుడు అక్షయ్ షిండే ప్రాణాలు కోల్పోయాడు. ఇన్‌స్పెక్టర్ షిండే గతంలో దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్ అరెస్టులో కీలకంగా వ్యవహరించారు. ఈ ఎన్‌కౌంటర్‌పై రాజకీయ దుమారం చెలరేగింది. ఇది కట్టుకథ అని శివసేన(ఠాక్రే) నేత ప్రియాంక చతుర్వేది ఆరోపించారు. ఈ కేసులో పాఠశాల చైర్మన్, కార్యదర్శి సహ నిందితులుగా ఉన్నారని, వారు బీజేపీ నాయకులని తెలిపారు. వారిపై పోక్సో కేసు నమోదైనా తప్పించుకు తిరుగుతున్నారన్నారు.
Updated Date - Sep 24 , 2024 | 04:09 AM