కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌పై కేసు
ABN, Publish Date - Sep 29 , 2024 | 04:16 AM
న్నికల బాండ్ల పేరిట అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
బెంగళూరు, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): ఎన్నికల బాండ్ల పేరిట అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ అంశంపై జనాధికార సంఘర్ష పరిషత్ ఉపాధ్యక్షుడు ఆదర్శ్ అయ్యర్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ శుక్రవారం 42వ ప్రజాప్రతినిధుల కోర్టుకు బదిలీ అయింది. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన కోర్టు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని బెంగళూరులోని తిలక్‌నగర్ పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబరు 10కి వాయిదా వేసింది.
దీంతో పోలీసులు శనివారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్(ఏ1), ఈడీ (ఏ2), బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(ఏ3), మాజీ ఎంపీ నళిన్‌కుమార్(ఏ4), బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర(ఏ5), రాష్ట్ర బీజేపీ నేతల(ఏ6)పై ఐపీసీ 384, 120 బీ, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎలక్టోరల్ బాండ్ల ముసుగులో వివిధ కార్పొరేట్ కంపెనీల ఎండీలు, సీఈవోలను బెదిరించి రూ.8వేల కోట్లు దోపిడీ చేశారని ఆదర్శ్ అయ్యర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కర్ణాటక సీఎం సిద్దరామయ్య స్పందించారు. ‘‘ఎఫ్‌ఐఆర్ నమోదైనందున కేంద్ర మంత్రి నిర్మల తన పదవికి రాజీనామా చేస్తారా’’ అని ప్రశ్నించారు.
Updated Date - Sep 29 , 2024 | 04:16 AM