కశ్మీర్‌లో ఎదురు కాల్పుల్లో ఆర్మీ అధికారి వీరమరణం
ABN, Publish Date - Nov 11 , 2024 | 04:47 AM
జమ్మూ-కశ్మీర్‌లోని కిష్టావర్ జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఆర్మీ అధికారి ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు జవాన్లు గాయపడ్డారు.
శ్రీనగర్, నవంబరు 10: జమ్మూ-కశ్మీర్‌లోని కిష్టావర్ జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఆర్మీ అధికారి ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. అడవిలో ఉగ్రవాదుల ఆచూకీ కోసం గాలింపు కొనసాగుతుండగా ఉదయం 11 గంటల ప్రాంతంలో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 16 కార్ప్ప్‌కు చెందిన జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ నాయబ్ సుబేదార్ రాకేష్ కుమార్ మరణించారు. గురువారం సాయంత్రం నజీర్ అహ్మద్, కుల్దీప్ కుమార్ అనే విలేజ్ డిఫెన్స్ గార్డులను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి, హత్య చేశారు. దాంతో ఉగ్రవాదుల కోసం కుంట్వారా, కేశ్వాన్ అడవుల్లో ఆర్మీ, పోలీసు విభాగాలు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. శనివారం నుంచి కిష్టావర్‌లోని భార్త్ రిడ్జ్ వద్ద సంయుక్త ఆపరేషన్ మొదలయింది. ఆదివారం అడవిలో ఉగ్రవాదులు, జవాన్లు ఎదురుపడడంతో కాల్పులు చోటుచేసుకున్నాయి.
Updated Date - Nov 11 , 2024 | 04:47 AM