Kejriwal: మా నిజాయితీపై మోదీ దాడి!
ABN, Publish Date - Sep 23 , 2024 | 03:19 AM
ప్రధాని మోదీ కుట్రతో తన నిజాయితీపై దాడి చేస్తున్నారని, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలను జైలుకు పంపుతున్నారని ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఆరోపించారు.
కుట్రతో ఆప్ నేతలను జైలుకు పంపుతున్నారు.. నాకు సొంత ఇల్లు కూడా లేదు.. డబ్బు సంపాదించలేదు
తోలుమందం నేతలపై అవినీతి ఆరోపణలు ప్రభావం చూపవు
నాపై ప్రభావం చూపుతాయి.. అందుకే రాజీనామా చేశా: కేజ్రీ
న్యూఢిల్లీ, సెప్టెంబరు 22: ప్రధాని మోదీ కుట్రతో తన నిజాయితీపై దాడి చేస్తున్నారని, ఆమ్ ఆద్మీ పార్టీ నేతలను జైలుకు పంపుతున్నారని ఆ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీ సీఎం పదవి నుంచి వైదొలగిన తర్వాత తొలిసారిగా ఆయన ప్రజల ముందుకు వచ్చారు. ఆదివారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిర్వహించిన సభలో కేజ్రీవాల్ మాట్లాడుతూ ‘గత పదేళ్లుగా మేం ప్రభుత్వాన్ని నిజాయితీగా నడుపుతున్నాం. దీంతో మాపై గెలవాలంటే మా నిజాయితీపైనే దాడి చేయాలని మోదీ భావించారు. అందుకే కేజ్రీవాల్, సిసోడియా, ఇతర ఆప్ నేతలను అవినీతిపరులుగా నిరూపించేందుకు, వారందరినీ జైల్లో పెట్టేందుకు మోదీ కుట్ర పన్నారు. గత పదేళ్ల పాలనలో నేను డబ్బు సంపాదించలేదు.
గౌరవాన్ని, ప్రజల ప్రేమను మాత్రమే సంపాదించాను. దేశ రాజకీయాలను మార్చడానికి, భారత మాత కోసం నేను రాజకీయాల్లోకి వచ్చాను. డబ్బు సంపాదించాలనుకుంటే.. ఐటీశాఖ ఉద్యోగంలో ఉన్నప్పుడే ఆ పని చేసేవాడిని. తోలుమందం నేతలు(ఇతర పార్టీల నాయకులు) అవినీతి ఆరోపణలను పట్టించుకోరు. కానీ, నేను పట్టించుకుంటాను. బీజేపీ నేతలు దొంగ, అవినీతిపరుడు అనడం నా హృదయాన్ని గాయపరిచింది. అందుకే బాధతో రాజీనామా చేశాను. నాకు సొంత ఇల్లు కూడా లేదు. తమ ఇల్లు తీసుకోవాలని ప్రజల నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి. దసరా నవరాత్రులు మొదలైనప్పుడు సీఎం బంగ్లాను ఖాళీ చేసి, వారి(ఢిల్లీ ప్రజలు)లో ఒకరి ఇంటికి వెళ్లి నివసిస్తాను’ అన్నారు. త్వరలో జరుగనున్న ఢిల్లీ ఎన్నికలు తనకు అగ్ని పరీక్ష అని వ్యాఖ్యానించారు.
బీజేపీలో చేరకపోతే చంపేస్తామన్నారు
బీజేపీలో చేరకపోతే జైలులోనే చంపేస్తామంటూ తనకు బెదిరింపులు వచ్చాయని ఆప్ నేత సిసోడియా చెప్పారు. ‘‘జర్నలిస్టుగా ఉన్నప్పుడు 2002లో రూ.5 లక్షలతో ఫ్లాట్ కొన్నా. దాన్ని తీసేసుకున్నారు. నా బ్యాంకులోని రూ.10లక్షలను స్తంభింపజేశారు. కుమారుడి కాలేజీ ఫీజుల కోసం అడుక్కునేలా చేశారు’’ అంటూ ఆవేదన చెందారు. గత 26 ఏళ్లుగా అరవింద్ కేజ్రీవాల్‌ను అన్నగా భావిస్తున్నానని, ఈ రామ లక్ష్మణులను ఏ రావణుడూ విడదీయలేరని అన్నారు. ప్రజల తీర్పు పొందిన తరువాతే పదవులు చేపడుతామని చెప్పారు.
ఆడ్వాణీకి వర్తించిన రూల్ మోదీకి వర్తించదా?
ప్రతిపక్ష పార్టీలను విచ్ఛిన్నం చేయడం, అవినీతిపరులైన రాజకీయ నాయకులకు ఆశ్రయం కల్పించడం ద్వారా మోదీ అనుసరిస్తున్న విధానంపై ఆర్‌ఎ్‌సఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు ఈ సందర్భంగా కేజ్రీవాల్ ఐదు ప్రశ్నలు సంధించారు. అత్యధిక మంది అవినీతి నేతలను మోదీ తన పార్టీలో చేర్చుకున్నారని, ఆయనే ఒకప్పుడు వారందరినీ అవినీతిపరులన్నారని కేజ్రీవాల్ గుర్తుచేశారు. ఇలాంటి రాజకీయాలను ఆర్‌ఎ్‌సఎస్ ఆమోదిస్తుందా? అని కేజ్రీవాల్ ప్రశ్నించారు.
అలాగే, బీజేపీలో రిటైర్‌మెంట్ వయసు(75 ఏళ్లు) నిబంధన ఎల్‌కే ఆడ్వాణీకి వర్తించినట్టే, మోదీకీ వర్తిస్తుందా? అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. మోదీకి ఆ నిబంధన వర్తించదని అమిత్‌షా అంటున్నారని కేజ్రీవాల్ చెప్పారు. బీజేపీకి సైద్ధాంతిక గురువు అయిన ఆర్‌్‌సఎస్ అవసరం తమ పార్టీకి లేదని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా వ్యాఖ్యానించినప్పుడు భగవత్‌కు ఏమనిపించింది? అని కేజ్రీవాల్ ప్రశ్నించారు. బీజేపీ ప్రస్తుత రాజకీయాల పట్ల భగవత్ సంతృప్తి చెందుతున్నారా? అని కూడా కేజ్రీవాల్ ప్రశ్నించారు.
Updated Date - Sep 23 , 2024 | 03:19 AM