Weather Report: ఈ నెలంతా వానలు?
ABN, Publish Date - Sep 01 , 2024 | 04:01 AM
దేశంలో ఆగస్టు నెలలో సాధారణం కంటే 16ు అధిక వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. వాయవ్య భారతంలో 253.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని..
పంటలకు అతివృష్టితో చేటు
పశ్చిమానికి రుతుపవనాలు
సెప్టెంబరు చివరి వరకూ కొనసాగే అవకాశం
చేతికందే పంటకు అతివృష్టితో చేటు: ఐఎండీ
న్యూఢిల్లీ, ఆగస్టు 31: దేశంలో ఆగస్టు నెలలో సాధారణం కంటే 16ు అధిక వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. వాయవ్య భారతంలో 253.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని.. 2001 నుంచి ఇదే అత్యధికమని వివరించింది. వర్చువల్‌గా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర ఈ వివరాలను వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఆగస్టు నెలలో సాధారణ వర్షపాతం 248.1 మిల్లీమీటర్లు కాగా.. ఈసారి 287.1 మిల్లీమీటర్ల మేర నమోదైనట్లు ఆయన వివరించారు.
‘‘జూన్ 1వ తేదీన దేశంలో రుతుపవనాలు ప్రవేశించినప్పటి నుంచి 749 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నిజానికి దేశ సాధారణ వర్షపాతం 701 మిల్లీమీటర్లే. హిమాలయాలకు దిగువనున్న అనేక జిల్లాలతోపాటు.. ఈశాన్య రాష్ట్రాల్లో అల్పపీడన ప్రభావం పడడంతో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. ఒక్క ఆగస్టులోనే ఆరు అల్పపీడనాలు ఏర్పడ్డాయి. వాటిలో రెండు మాత్రమే రుతుపవనాల అల్పపీడనాలు’’ అని ఆయన తెలిపారు.
సెప్టెంబరు నెలలో కూడా సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నట్లు తెలిపారు. వాయవ్య భారతంలో ఎక్కువ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు పేర్కొన్నారు. ఉత్తర భారతంలోని బిహార్, ఈశాన్య ఉత్తరప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే సూచనలున్నట్లు వెల్లడించారు. సెప్టెంబరులో సాధారణ వర్షపాతం 167.9 మిల్లీమీటర్లుగా ఉంటుందని, ఈ సారి మాత్రం 109 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నాయని చెప్పారు.
పంటలకు చేటు..
రుతుపవనాలు సెప్టెంబరు చివరి వరకూ కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. దీనికి అప్పపీడనాలు తోడవ్వడంతో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతోందని.. అయితే.. ఇది రైతులకు చేటు అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వరి, పత్తి, సోయాబీన్, మొక్కజొన్న, పప్పుధాన్యాలు చేతికొచ్చే సమయంలో అసాధారణ వర్షాలు నష్టాన్ని కలిగించే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.
పశ్చిమ దిశగా..
పశ్చిమ రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నా.. ఇది రుతుపవనాల దిశాత్మక మార్పునకు సంకేతమని విశ్లేషకులు చెబుతున్నారు. గుజరాత్‌లో లోతట్టు ప్రాంతాలు జలమయమవ్వడం.. రాజస్థాన్‌లో కూడా భారీ వర్షాలతో ఇలాంటి పరిస్థితే నెలకొనడాన్ని బట్టి.. రుతుపవనాల తీరు మారుతోందనే ఆందోళనలు పెరుగుతున్నాయని స్పష్టం చేస్తున్నారు.
Updated Date - Sep 01 , 2024 | 04:01 AM