Bengaluru : చిక్కుల్లో సిద్దూ
ABN, Publish Date - Aug 18 , 2024 | 04:49 AM
మైసూరు నగరాభివృద్ధి ప్రాధికార(ముడా) కుంభకోణం కీలక మలుపు తిరిగింది. ఈ అంశంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై క్రిమినల్ కేసు నమోదు చేసేందుకు (ప్రాసిక్యూషన్) గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ శనివారం అనుమతులు ఇచ్చారు.
కర్ణాటక సీఎంపై విచారణకు గవర్నర్ అనుమతి
‘ముడా’ ఇంటి స్థలాల అక్రమాలపై ఫిర్యాదులు
ప్రజా ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు భారీ కుట్ర
బీజేపీ, జేడీఎస్ రాష్ట్ర నాయకులే సూత్రధారులు
గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధం, చట్టవ్యతిరేకం
ప్రాసిక్యూషన్ అనుమతులపై న్యాయపోరాటం: సీఎం
తప్పుడు ఫిర్యాదుతో సీఎంను ఇరికించే కుట్ర: డీకే
అండగా ఉంటామని కాంగ్రెస్ అధిష్ఠానం భరోసా
మైసూరు, బెంగళూరు సహా రాష్ట్రమంతా నిరసనలు
బెంగళూరు, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): మైసూరు నగరాభివృద్ధి ప్రాధికార(ముడా) కుంభకోణం కీలక మలుపు తిరిగింది. ఈ అంశంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై క్రిమినల్ కేసు నమోదు చేసేందుకు (ప్రాసిక్యూషన్) గవర్నర్ థావర్‌చంద్ గహ్లోత్ శనివారం అనుమతులు ఇచ్చారు.
ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. ముడాలో 14 ఇంటి స్థలాలను తన సతీమణి పార్వతి పేరిట అక్రమంగా తీసుకున్నారని సిద్దరామయ్య ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సీఎం ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతించడంతో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. జిల్లాల పర్యటనలో ఉన్న మంత్రులంతా హుటాహుటిన బెంగళూరుకు బయల్దేరారు. సీఎం సిద్దరామయ్యపై ప్రాసిక్యూషన్‌కు అనుమతులు ఇచ్చిన పత్రాలు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాలిని రజనీశ్, సీఎం కార్యదర్శి, అదనపు ముఖ్య కార్యదర్శి ఎల్‌కే అతీక్‌కు రాజ్‌భవన్ నుంచి అందాయి.
కేంద్ర ప్రభుత్వం చేతిలో గవర్నర్ కీలుబొమ్మగా మారారని, ప్రాసిక్యూషన్ అనుమతులు ఇవ్వడం ప్రజాప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర అని, బీజేపీ, జేడీఎ్‌సకు చెందిన రాష్ట్ర నాయకులు కొందరు ఈ కుట్రకు సూత్రధారులని సీఎం సిద్దరామయ్య మండిపడ్డారు. రాజీనామా చేసేంత తప్పు తానేమీ చేయలేదని స్పష్టం చేశారు. శనివారం బెంగళూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉత్తరాఖండ్, జార్ఖండ్, ఢిల్లీలో చేసిన తరహాలోనే కర్ణాటకలోనూ కుట్ర పన్నారని ఆరోపించారు.
ప్రాథమికంగా తనపై ఎటువంటి ఆరోపణలు లేవన్నారు. గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని, చట్ట వ్యతిరేకమని దుయ్యబట్టారు, ప్రాసిక్యూషన్ అనుమతులపై న్యాయ పోరాటం చేస్తానని అన్నారు. ఫిర్యాదు వచ్చిన ఒక్కరోజులోనే షోకాజ్ నోటీసులు ఇచ్చారని, గవర్నర్ నుంచి ఈ విధమైన ప్రక్రియ ఊహించలేదని అన్నారు. రాజకీయ వేధింపుల్లో భాగంగానే ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతులు ఇచ్చారని అన్నారు.
తన రాజీనామా కోరే నైతికత బీజేపీకి లేదన్నారు. కేంద్రమంత్రి కుమారస్వామి, మాజీ మంత్రులు మురుగేశ్ నిరాణి, శశికళ జొల్లె, జనార్దన్‌రెడ్డిపై రాజ్‌భవన్‌కు ఫిర్యాదులు అందినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవని గుర్తుచేశారు. కుమారస్వామి గనుల యజమానులకు అనుకూల అనుమతులు ఇచ్చారని, దీనిపై విచారణ జరిపించాలని లోకాయుక్త సూచించినా ఎటువంటి చర్యలు లేవని సిద్దరామయ్య విమర్శించారు.
అధిష్ఠానం అండగా ఉంటుంది : ఏఐసీసీ
సిద్దరామయ్యకు అధిష్టానం అండగా ఉంటుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ కర్ణాటక వ్యవహారాల ఇన్‌చార్జ్ సుర్జేవాలా అన్నారు. ఢిల్లీ నుంచి సీఎంకు ఫోన్ చేసిన ఆయన.. ఎటువంటి ఆందోళన అవసరం లేదని, పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఓ లేఖను కూడా పంపారు. కర్ణాటక ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా ఇచ్చిన తీర్పును కాలరాసే విధంగా పీఎంవో, హోంశాఖ వ్యవహరించాయన్నారు. మరోవైపు, మంత్రులు, న్యాయనిపుణులతో సిద్దరామయ్య సాయంత్రం 5గంటలకు అత్యవసరంగా భేటీ అయ్యారు. సీఎంపై విచారణకు గవర్నర్ ఆదేశాలతో పార్టీ అగ్రనేతలు అప్రమత్తమయ్యారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వీ బెంగళూరుకు రానున్నారు. వారు ఆదివారం బెంగళూరులో సీఎంతో చర్చలు జరపనున్నారు.
న్యాయపోరాటానికి క్యాబినెట్ నిర్ణయం
సీఎం సిద్దరామయ్య ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతించిన నేపథ్యంలో శనివారం రాత్రి కర్ణాటక క్యాబినెట్ అత్యవసరంగా సమావేశమైంది. గవర్నర్ ప్రాసిక్యూషన్ అనుమతి నిర్ణయాన్ని క్యాబినెట్ ఖండించింది. సీఎంకు మద్దతుగా ఉండాలని, న్యాయపోరాటం చేయాలని తీర్మానించింది. గవర్నర్ నిర్ణయం రాజ్యాంగ, చట్ట వ్యతిరేకమని క్యాబినెట్‌లో తీర్మానించినట్లు సిద్దరామయ్య చెప్పారు. గవర్నర్ల ద్వారా ప్రజాస్వామ్య ప్రభుత్వాలను అస్థిరం చేసే కుట్రలు చేయడం కేంద్రానికి సరికాదన్నారు.
ఫిర్యాదుదారు కేవియట్ దాఖలు
సిద్దరామయ్యపై ఫిర్యాదుదారుల్లో ఒకరైన ప్రదీ్‌పకుమార్ హైకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ప్రదీప్ మాట్లాడుతూ గవర్నర్ నేరుగా సీఎం ప్రాసిక్యూషన్‌కు అనుమతులు ఇచ్చారని, కోర్టు ద్వారా స్టే పొందే అవకాశం ఉంటుందని అన్నారు. అందుకే ముందుగానే కేవియట్ దాఖలు చేశానని తెలిపారు.
తప్పుడు ఫిర్యాదుతో కుట్ర: డీకే
రాజ్‌భవన్ వేదికగా తప్పుడు ఫిర్యాదుతో సీఎం సిద్దరామయ్యను ఇరికించాలనే కుట్ర సాగిందని, ముఖ్యమంత్రికి అండగా ఉంటామని ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. ముడా ఆరోపణలపై ప్రాసిక్యూషన్‌కు అనుమతులు ఇచ్చిన వెంటనే పలువురు సహచర మంత్రులతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. సిద్దరామయ్య తమ ముఖ్యమంత్రి అని, ఆయన అదే హోదాలోనే ఉంటారని, ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గేది ఉండదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదని, ‘ఇండియా’ కూటమి మొత్తం ముఖ్యమంత్రికి అండగా ఉంటుందని అన్నారు. రాజ్‌భవన్‌ను బీజేపీ ఆఫీ్‌సగా మార్చుకున్నారని, దానిపై పోరాటం చేస్తామని చెప్పారు. బీసీ నేత ఒకరు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారని, ఆయన ఎదుగుదలను ఓర్వలేకనే బీజేపీ భారీ కుట్ర పన్నిందని మండిపడ్డారు. ప్రాథమిక విచారణలు జరపకుండానే ప్రాసిక్యూషన్‌కు అనుమతులు ఇవ్వడం సరికాదన్నారు.
రాష్ట్రమంతటా భారీ బందోబస్తు
గవర్నర్ విచారణకు అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్రమంతటా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బెంగళూరులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ‘చలో రాజ్‌భవన్‌కు సిద్ధం కాగా.. పోలీసులు అడ్డుకున్నారు. మైసూరులో కాంగ్రెస్ కార్యకర్తలు, సిద్దరామయ్య అభిమానులు ద్విచక్రవాహనానికి నిప్పుపెట్టి ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలో ముడా కార్యాలయంతో పాటు వివిధ ప్రాంతాల్లో సాయుధ బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
Updated Date - Aug 18 , 2024 | 04:49 AM