Tamil Nadu: నేను మంత్రిని కాకపోతే ప్రధాని మోదీని ముక్కలు చేసేవాడ్ని.. డీఎంకే మంత్రి బెదిరింపులు
ABN, Publish Date - Mar 13 , 2024 | 09:05 PM
ప్రధాని నరేంద్ర మోదీని (PM Narendra Modi) ఉద్దేశిస్తూ తమిళనాడు మంత్రి అన్బరసన్ (DMK Minister Anbarasan) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను మంత్రిని కాకపోయి ఉంటే, ప్రధానిని ముక్కలు ముక్కలుగా నరికేవాడినంటూ కుండబద్దలు కొట్టారు. ఎంతోమంది ప్రధానమంత్రుల్ని చూశానని, కానీ మోదీలా దిగజారుడు మాటలు మాట్లాడే పీఎంని చూడలేదని పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీని (PM Narendra Modi) ఉద్దేశిస్తూ తమిళనాడు మంత్రి అన్బరసన్ (DMK Minister Anbarasan) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను మంత్రిని కాకపోయి ఉంటే, ప్రధానిని ముక్కలు ముక్కలుగా నరికేవాడినంటూ కుండబద్దలు కొట్టారు. ఎంతోమంది ప్రధానమంత్రుల్ని చూశానని, కానీ మోదీలా దిగజారుడు మాటలు మాట్లాడే పీఎంని చూడలేదని పేర్కొన్నారు. దీంతో బీజేపీ (BJP) ఆ మంత్రిపై, అధికార డీఎంకే పార్టీపై విరుచుకుపడుతోంది. ఇందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసి.. అన్బరసన్‌ను వెంటనే మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తోంది.
తమిళనాడులోని తిరుప్పూర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ వారం రోజుల క్రితం రోడ్ షో నిర్వహించగా.. దానిపై నాలుగు రోజుల క్రితం మంత్రి అన్బరసన్ తీవ్రంగా స్పందించారు. ‘‘మేము చాలామంది ప్రధానమంత్రుల్ని చూశాం. కానీ, ఇంతలా దిగజారుడు మాటలు మాట్లాడే ప్రధానిని ఎప్పుడూ చూడలేదు. మనల్ని నిర్మూలిస్తానని మోదీ అంటున్నాడు. అయితే నేను వాళ్లకు (బీజేపీ) ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. డీఎంకే అనేది ఒక సాధారణ సంస్థ కాదు. ఈ సంస్థ కోసం ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేశారు. రక్తం కూడా చిందించారు. గతంలో డీఎంకేని నాశనం చేస్తామని చెప్పిన వాళ్లు చనిపోయారు. ఈ సంస్థ ఎప్పటికీ ఉన్నతంగా నిలుస్తుందనే విషయం గుర్తుంచుకోండి. మీ బెదిరింపులు ఇక్కడ చెల్లవు’’ అని మంత్రి ఆ వీడియోలో చెప్పుకొచ్చారు. అంతటితో ఆగలేదు.. ‘‘నేను మంత్రిగా ఉన్నందున సున్నితంగా మాట్లాడుతున్నాను. ఒకవేళ మంత్రిని కాకపోయి ఉంటే, ఆయన్ను ముక్కలుగా చేసి ఉండేవాడిని’’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ విధంగా అన్బరసన్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. ప్రధాని మోదీని బెదిరించినందుకు గాను ఆయన్ను మంత్రివర్గం నుంచి తొలగించాలని సీఎం స్టాలిన్‌ని (CM Stalin) డిమాండ్ చేసింది. ‘‘విభజన రాజకీయాలు, అవినీతి స్వభావం, అంతర్జాతీయ డ్రగ్ పెడ్లర్లతో అనుబంధం, గూండాయిజం, దుష్పరిపాలన వంటి వారి నిరంతర ప్రేలాపనలతో డీఎంకే త్వరలో రాజకీయ రంగం నుంచి కనుమరుగవుతుందని’’ అని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కే అన్నామలై (K Annamalai) ధ్వజమెత్తారు. తమిళనాడు బీజేపీ అధికార ప్రతినిధి నారాయణన్ తిరుపతి (Narayan Tirupati) మాట్లాడుతూ.. డీఎంకేలో కొందరు మంత్రులు రౌడీల జాబితాలో ఉండాల్సిన వారు ఉన్నారని ఆరోపించారు. తమిళనాడులో ప్రధాని మోదీ పర్యటనతో వారు భయపడి ఉండొచ్చని, ఆ భయమే వారితో ఇలా హీనంగా మాట్లాడిస్తోందని దుయ్యబట్టారు.
Updated Date - Mar 13 , 2024 | 09:05 PM