Raghunandan Rao : జంతర్ మంతర్‌కు రండి!
ABN, Publish Date - Jul 27 , 2024 | 02:53 AM
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నిధులివ్వలేదంటూ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నేత కేటీఆర్...
తెలంగాణకు కేంద్రం నిధులిచ్చినట్టు తేలితే ముక్కు నేలకు రాయాలి
రేవంత్, కేటీఆర్‌కు రఘునందన్ సవాల్
కేంద్ర పన్నుల్లో వాటా, గ్రాంట్లు కలిపి
50 వేల కోట్లు.. కేంద్రం ఇచ్చేవి కావా?
న్యూఢిల్లీ, జూలై 26 (ఆంధ్రజ్యోతి): తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నిధులివ్వలేదంటూ కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్దకు వస్తే కేంద్రం నిధులు ఇచ్చినట్లు తాము నిరూపిస్తామని, వారిద్దరూ ముక్కు నేలకు రాస్తారా? అని సవాల్ విసిరారు.
ఈ మేరకు రఘునందన్‌రావు శుక్రవారం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్, రేవంత్‌రెడ్డిల పాలనలో తేడా ఏమీ లేదని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ రూ.20 కోట్లకు కొంటే.. తాము బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను రూ.5 కోట్లకే కొంటున్నామని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌లో చెప్పారని గుర్తు చేశారు. మూసీ ప్రక్షాళనకు కేంద్రం నిధులివ్వలేదని సీఎం చెబుతున్నారని, కానీ. డీపీఆర్ ఇవ్వకుండానే నిధులెలా వస్తాయని ప్రశ్నించారు.
తెలంగాణ బడ్జెట్‌లోనే కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా రూ.26వేల కోట్లు, గ్రాంట్ల రూపంలో మరో రూ.21వేల కోట్లు చూపించారని గుర్తుచేశారు. ఈ రెండూ కలిపి సుమారు 50వేల కోట్లు అవుతాయని, ఇవి కేంద్రం నుంచి వచ్చేవి కావా? అని ప్రశ్నించారు. రాష్ట్ర బడ్జెట్‌లో మైనారిటీల పండుగలకు రూ.33 కోట్లు కేటాయించిన విషయాన్ని రఘునందన్‌రావు గుర్తు చేస్తూ.. రాష్ట్రంలో హిందువులు లేరా? హిందూ పండుగలు లేవా? అని ప్రశ్నించారు. కొడంగల్‌కు డిగ్రీ కాలేజీ, నర్సింగ్ కాలేజీలు వచ్చాయని, రాష్ట్రంలో మిగిలిన 118 నియోజకవర్గాలు కనిపించలేదా?అని నిలదీశారు. తెలంగాణ అభివృద్థికి ప్రధాని నరేంద్రమోదీ కట్టుబడి ఉన్నారని తెలిపారు.
Updated Date - Jul 27 , 2024 | 02:53 AM