BJP state president: అవినీతిపరులంతా జైలుకే.. అదే మోదీ గ్యారెంటీ!
ABN, Publish Date - Apr 12 , 2024 | 11:02 AM
రాష్ట్రంలో కుటుంబ పాలనను అంతమొందించి, అవినీతిపరులందరినీ జైలుకు తరలించడమే ప్రధాని మోదీ తమిళ ప్రజానీకానికి ఇస్తున్న ప్రత్యేక గ్యారెంటీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) అన్నారు.
- బీజేపీ నేత అన్నామలై
చెన్నై: రాష్ట్రంలో కుటుంబ పాలనను అంతమొందించి, అవినీతిపరులందరినీ జైలుకు తరలించడమే ప్రధాని మోదీ తమిళ ప్రజానీకానికి ఇస్తున్న ప్రత్యేక గ్యారెంటీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) అన్నారు. గురువారం మధ్యాహ్నం ఆయన కోయంబత్తూరులో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోడ్‌షో జరిపినంత మాత్రాన ఓట్లు పడవని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి విమర్శించడం గర్హనీయమన్నారు. దమ్ముంటే ఎడప్పాడి రోడ్‌షో జరపాలని డిమాండ్ చేశారు. బీజేపీ రోడ్‌షోలు ఓట్లు దండుకోవడం కోసం నిర్వహించడం లేదని, వాటిని ప్రజా సందర్శన యాత్రగానే భావిస్తోందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే ఘనవిజయం సాధించి మోదీ మూడోసారి ప్రధాని అవుతారని, రాష్ట్రంలో కుటుంబ పాలను అంతమొందిస్తామని, టాస్మాక్ మత్తునుండి, మాదక ద్రవ్యాల బారి నుండి తమిళులందరినీ కాపాడుతామనే మోదీ గ్యారెంటీ ఇస్తున్నారని అన్నామలై చెప్పారు. రాష్ట్రంలో ద్రావిడ పార్టీలు బీజేపీని ఉత్తరాదికి చెందిన ప్రాంతీయ పార్టీగా దుష్ప్రచారం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు.
రోలెక్స్ అని పేరు పెడతారా?
రాష్ట్ర యువజన సంక్షేమం క్రీడాభివృద్ధి శాఖల మంత్రి ఉదయనిధి ఇటీవల ఓ పసికందుకు ‘రోలెక్స్’ అనే పేరుపెట్టడం విడ్డూరంగా ఉందన్నామలై పేర్కొన్నారు. శిశువులకు అందమైన తమిళ పేర్లే పెట్టాలని శాసించే డీఎంకేకు చెందిన మంత్రి కమల్‌హాసన్ నటించిన విక్రమ్ సినిమాలో మాదకద్రవ్యాలా మాఫియా ముఠా నాయకుడి పేరు పెట్టడం సమంజసమేనా అని ప్రశ్నించారు. కొంగుమండలం తమ కంచుకోట అని డంబాలు పలికే డీఎంకేకి ఈ సారి ఆ మండలంలో ఘోర పరాభవం తప్పదన్నారు. జూన్ నాలుగు తర్వాత కొంగుమండలం ఏ పార్టీకి కంచుకోట అవుతుందో వేచి చూడాలన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించి తాను కేంద్ర మంత్రివర్గంలో చేరాలని భావించడం లేదని, తన ప్రధాన దృష్టి అంతా 2026లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని గెలిపించడమేనని అన్నామలై స్పష్టం చేశారు.
ఇదికూడా చదవండి: EPFO: ఈపీఎఫ్‌వో వేతన పరిమితి రూ.21 వేలకు!
Updated Date - Apr 12 , 2024 | 11:02 AM