Budget : కీలకం.. 9 రంగాలు
ABN, Publish Date - Jul 24 , 2024 | 04:40 AM
తొమ్మిది రంగాలకు ప్రాధాన్యం ఇస్తూ బడ్జెట్‌ను రూపొందించామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మంగళవారం పార్లమెంట్‌లో బడ్జెట్‌ను
మధ్యంతర బడ్జెట్‌లో చెప్పాం.. ఇప్పుడు ప్రణాళిక తీసుకొచ్చాం
‘అభివృద్ధి కేంద్రాలు’గా నగరాలను తీర్చిదిద్దుతాం
బడ్జెట్ ప్రసంగంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ, జూలై 23: తొమ్మిది రంగాలకు ప్రాధాన్యం ఇస్తూ బడ్జెట్‌ను రూపొందించామని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మంగళవారం పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా నిర్మల ఈ వివరాలు వెల్లడించారు. ‘వికసిత్ భారత్ కోసం సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తామని మధ్యంతర బడ్జెట్ సందర్భంగా మేం హామీ ఇచ్చాం. ఈ మేరకు అందరికీ అవకాశాలు కల్పన లక్ష్యంగా 9 రంగాలను ప్రాధాన్య రంగాలుగా గుర్తిస్తూ బడ్జెట్‌ను రూపొందించాం’ అని తెలిపారు. తదుపరి బడ్జెట్‌లన్నీ ఈ ప్రాధాన్య రంగాల ఆధారంగానే ఉంటాయన్నారు. ఉద్యోగావకాశాలను శీఘ్రగతిన పెంపొందించటానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని, విధానపరమైన లక్ష్యాల్లో ఇది కూడా ఒక ముఖ్యమైన అంశమని పేర్కొన్నారు.
మోదీ సారథ్యంపై ప్రజల నమ్మకం
ప్రపంచ ఆర్థిక రంగం విధానపరమైన అనిశ్చితి నుంచి ఇప్పటికీ బయటపడలేకపోతోందని నిర్మల పేర్కొన్నారు. భారత్‌లో మాత్రం ప్రజలు మోదీ సారథ్యంలోని ప్రభుత్వంపై తమ నమ్మకాన్ని మరోమారు చాటిచెప్పారని, వరుసగా మూడోసారి అధికారం అప్పగించారన్నారు. దేశంలో ద్రవ్యోల్బణం స్థిరంగా ఉందని, నిర్దారిత లక్ష్యమైన 4 శాతం వైపు వెళ్తోందని తెలిపారు. ఉద్యోగ వర్గాలకు బడ్జెట్‌లో ఊరట కల్పించామని, ఈ మేరకు నూతన పన్ను విధానంలో తీసుకొచ్చిన మార్పుల వల్ల వారికి సగటున రూ.17,500 వరకు అవుతుందని ఆర్థిక మంత్రి తెలిపారు. పింఛనర్లకు కూడా రాయితీ కల్పించామని గుర్తు చేశారు. ఈ నిర్ణయాల వల్ల నాలుగు కోట్ల మంది ఉద్యోగులు, పింఛనుదార్లకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. వ్యవసాయంలో ఉత్పాదకతను పెంచటానికి ప్రభుత్వం వ్యవసాయ పరిశోధన రంగాన్ని సమగ్రంగా సమీక్షించనుందన్నారు. వాతావరణ పరిస్థితులను తట్టుకొనే వంగడాల అభివృద్ధిపై దృష్టి పెడతామన్నారు. నగరాలు, పట్టణాలను అభివృద్ధి కేంద్రాలుగా మల్చటానికి రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పని చేస్తామని తెలిపారు. కాగా, తాజా బడ్జెట్‌తో కలిపి నిర్మల వరుసగా ఏడుసార్లు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. తద్వారా, గతంలో ఆరుసార్లు వరుసగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన మొరార్జీ దేశాయ్ రికార్డును అధిగమించారు.
నిర్మల చెప్పిన 9 రంగాలివే..
సాగురంగంలో ఉత్పాదకత
ఉద్యోగాలు-నైపుణ్య శిక్షణ
మానవ వనరుల అభివృద్ధి-
సామాజిక న్యాయం
తయారీరంగం-సేవలు
పట్టాణాభివృద్ధి
ఇంధన భద్రత
మౌలిక సదుపాయాలు
ఆవిష్కరణలు
సంస్కరణలు
Updated Date - Jul 24 , 2024 | 04:40 AM