Calcutta High Court : : బెంగాల్ సర్కారు వైఫల్యం వల్లే..
ABN, Publish Date - Aug 17 , 2024 | 04:28 AM
ఆర్జీ కర్ వైద్యకళాశాల, ఆస్పత్రిపై బుధవారం అర్ధరాత్రి దుండగులు పాల్పడిన దాడి ఘటనపై కలకత్తా హైకోర్టు శుక్రవారం తీవ్రంగా స్పందించింది.
7వేల మంది గుమిగూడితే ఇంటెలిజెన్స్ ఏంచేస్తోంది.. ఆర్జీ కర్ ఆస్పత్రిపై దాడి ఘటనపై కలకత్తా హైకోర్టు వ్యాఖ్య
హత్యాచారం జరిగిన ఫ్లోర్‌లోనే అర్జెంటుగా మరమ్మతులేమిటని ప్రశ్న
ఆస్పత్రిని మూసేయిస్తామని హెచ్చరిక
కోల్‌కతా, న్యూఢిల్లీ, ఆగస్టు 16: ఆర్జీ కర్ వైద్యకళాశాల, ఆస్పత్రిపై బుధవారం అర్ధరాత్రి దుండగులు పాల్పడిన దాడి ఘటనపై కలకత్తా హైకోర్టు శుక్రవారం తీవ్రంగా స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ హింసాత్మక దాడి జరిగిందని చీఫ్ జస్టిస్ టీఎస్ శివగణం, హిరణ్మయి భట్టాచార్య ఆధ్వర్యంలోని ద్విసభ్య ధర్మాసనం తీవ్రంగా ఆక్షేపించింది.
పోలీసులకంటూ ఓ ఇంటెలిజెన్స్ విభాగం ఉంటుందని.. ఆస్పత్రి వద్ద భారీ సంఖ్యలో 7వేల మంది గుమిగూడితే ఆ విభాగానికి తెలియదనుకోవాలా? కచ్ఛితంగా ‘రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం వైఫ్యలం వల్లే జరిగిన దాడి ఇది’ అని వ్యాఖ్యానించింది. జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటనకు నిరసనగా దాదాపు 7వేల మంది ఆస్పత్రి ప్రాంగణం వద్ద గుమిగూడారని రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది చెప్పడంతో హైకోర్టు పైవిధంగా వ్యాఖ్యానించింది. ఆస్పత్రిపై దుండగుల దాడి వెనుక కారణం ఏమిటనేది తేల్చాలని ఆదేశించింది.
విధ్వంసకర, హింసాత్మక చర్యల ద్వారా దుండగులు సృష్టించిన బీభత్సం ఆస్పత్రిలో నిరసన వ్యక్తం చేస్తున్న వైద్యులను భయాందోళనల్లోకి నెట్టిందని.. ఆస్పత్రిలో పనిచేస్తున్న వైద్యులకు భద్రత కల్పించాలని నిర్దేశించింది. లేదంటే వారు అక్కడ వైద్య సేవలు అందించే పరిస్థితి ఉండదని పేర్కొంది.
జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం జరిగిన ఆస్పత్రిలోని నాలుగో అంతస్తులోనే నవీకరణ పనులు చేపట్టినట్లుగా దృష్టికి రావడంతో కోర్టు విస్మయం వ్యక్తం చేసింది. నేరం జరిగిన ఫ్లోర్‌లోనే అంత అర్జెంటుగా మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అని ప్రశ్నించింది.
తాము అనుకుంటే ఆస్పత్రిని మూసివేయాలని, రోగులను ఇతర ప్రభుత్వాస్పత్రులకు తరలించాలని ఆదేశాలివ్వగలమని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆస్పత్రిపై దాడి, అనంతర పరిణామల పట్ల వేర్వేరుగా అఫిడవిట్లు దాఖలు చేయాలని పోలీసులు, ఆస్పత్రి వర్గాలను ఆదేశించింది. హత్యాచారం కేసులో మధ్యంతర నివేదిక సమర్పించాలని సీబీఐని కోరింది. కాగా ఆర్జీ కర్ ఆస్పత్రిపై దాడిలో ఇప్పటిదాకా 19మందిని అరెస్టు చేశారు.
ఇక.. జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటన, ఆర్జీ కర్ ఆస్పత్రిపై గూండాల దాడికి నిరసనగా దేశవ్యాప్తంగా అన్ని ఆస్పత్రుల్లోనూ శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి 24 గంటలపాటు ‘నాన్ ఎమర్జెన్సీ’ సేవలను నిలిపిస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఐఎంఏ) ప్రకటించింది.
హత్యాచార ఘటనలో వైద్యులూ
జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటనలో నిందితుడు సంజయ్ రాయ్‌ని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. అయితే ఇందులో ఒకరికి మించి నిందితులున్నారంటూ వాదిస్తున్న హతురాలి తల్లిదండ్రులు తమకు అనుమానం ఉన్న, ఆర్జీ కర్ ఆస్పత్రిలోనే పనిచేస్తున్న కొందరు వైద్యుల పేర్లను అందజేశారని సీబీఐ అధికారులు వెల్లడించారు. ఆ పేర్ల ఆధారంగా తాము 30 మంది వైద్యులను గుర్తించామని.. కేసులో భాగంగా వారిని విచారిస్తామని చెప్పారు. కాగా ఘటన జరిగిన రోజు.. విధుల్లో ఉన్న ఓ వైద్యుడు, ఇద్దరు జూనియర్ వైద్యులకు సీబీఐ అధికారులు శుక్రవారం సమన్లు జారీ చేశారు.
దాడి జరిగిన 6గంటల్లోపు ఎఫ్‌ఐఆర్
జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటనకు నిరసనగా ఆందోళనలు హింసాత్మకంగా మారడం.. ఆర్జీ కర్ ఆస్పత్రిపై దుండగుల దాడి నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ సీరియస్ అయింది. ఆస్పత్రిపైన, వైద్యులపైన దాడి జరిగిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించింది.
హింసాత్మక ఘటనలపై ఆరు గంటల్లోపు ఎఫ్‌ఐఆర్ నమోదయ్యేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాస్పత్రుల చీఫ్‌లదేనని స్పష్టం చేసింది.
ఈ మేరకు ఎయిమ్స్ సహా దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రులకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (డీజీహెచ్‌ఎస్) డాక్టర్ అతుల్ గోయల్ ఆదేశాలు జారీ చేశారు. కాగా వైద్యసిబ్బంది ఎలాంటి భయాందోళనలు లేకుండా సురక్షితంగా పని చేసుకోగలమన్న భరోసా కలిగేందుకుగాను ఎయిర్‌పోర్టుల మాదిరిగా దేశవ్యాప్తంగా అన్ని ఆస్పత్రులు సేఫ్ జోన్‌లో ఉన్నట్లు ప్రకటించాలని ఐఎంఏ చీఫ్ ఆర్వీ అశోకన్ పేర్కొన్నారు. మూడంచెల భద్రతతో ఎయిర్‌పోర్టులు సేఫ్‌జోన్‌లో ఉన్నాయని.. కనీసం ప్రధాన ఆస్పత్రుల్లో సెక్యూరిటీ ప్రొటొకాల్ ఉండాలన్నారు.
Updated Date - Aug 17 , 2024 | 04:28 AM