కెనడాలో ఇళ్ల సంక్షోభం
ABN , Publish Date - Jul 08 , 2024 | 05:10 AM
విద్యార్థులు, వృత్తి నిపుణులకు గమ్యస్థానంగా ఉన్న కెనడాలో ఇళ్ల సంక్షోభం తలెత్తింది. ఇళ్ల అద్దెలతోపాటు లీజుల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. పోనీ ఒక ఇల్లు కొనేద్దాంలే! అనుకున్నా అవి కూడా అలానే ఉన్నాయి. దీంతో విద్యార్థులు, వలసదారులు కెనడా శివారు ప్రాంతాలకు తరలిపోతున్నారు. మరికొందరు ఈ అద్దెల ధరలు భరించలేక దేశాన్నే
భారీగా పెరిగిన అద్దెలు
కొందామన్నా.. అదేమోత
మరోవైపు పెరిగిన నిరుద్యోగం
న్యూఢిల్లీ, జూలై 7: విద్యార్థులు, వృత్తి నిపుణులకు గమ్యస్థానంగా ఉన్న కెనడాలో ఇళ్ల సంక్షోభం తలెత్తింది. ఇళ్ల అద్దెలతోపాటు లీజుల ధరలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. పోనీ ఒక ఇల్లు కొనేద్దాంలే! అనుకున్నా అవి కూడా అలానే ఉన్నాయి. దీంతో విద్యార్థులు, వలసదారులు కెనడా శివారు ప్రాంతాలకు తరలిపోతున్నారు. మరికొందరు ఈ అద్దెల ధరలు భరించలేక దేశాన్నే విడిచిపెట్టేస్తున్నారు. ఎక్కువ మంది అల్‌బెర్టా ప్రావిన్స్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. మరికొందరు అమెరికాకు వలస పోతున్నారు. ఇళ్ల ధరలను భరించలేక కెనడాను వదిలేస్తున్న వారి సంఖ్య 28ు ఉందని ఆంగస్ రీడ్ ఇనిస్టిట్యూట్(ఏఆర్‌ఐ) తన నివేదికలో పేర్కొంది. ఫలితంగా కెనడా ప్రతిష్ఠ దెబ్బతింటోందని పేర్కొంది. ప్రధానంగా ఖరీదైన నగరాలుగా పేరున్న వాటిలో ఇళ్ల ధరలు, అద్దెలు కూడా నింగినంటాయి. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికం నాటికి ఇళ్ల అద్దెల ద్రవ్యోల్బణం 7.8 శాతానికి చేరింది. ఎన్నో ఆశలతో కెనడాకు వస్తున్న వలసదారులు ఇక్కడ నివసించేందుకు సౌకర్యవంతమైన పరిస్థితి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నివేదికలోని కీలక అంశాలు ఇవీ..
ప్రస్తుతం ఉన్న ఇళ్ల అద్దెలు పెరగడంతో వాటిని ఖాళీ చేయాలని 28ు మంది నిర్ణయించుకున్నారు.
గత పదేళ్లుగా కెనడాలోనే ఉంటున్నవారిలో 39ు మంది ఇతర ప్రాంతాలకు తరలిపోయారు.
ప్రతి 10 మంది కెనడా వాసుల్లో ముగ్గురు ఇళ్ల ధరలు పెరిగిపోవడంపై ఆందోళనగా ఉన్నారు.
కెనడాకు వలసదారులు పెరిగిపోయిన కారణంగా ఇళ్ల సంక్షోభం ఏర్పడిందని 44.5ు మంది కెనడియన్లు అభిప్రాయపడుతున్నారు.
కెనడాలో 2013 నాటికి 32,828 మంది ఉన్న భారతీయుల సంఖ్య పదేళ్లలో 2023 నాటికి 1,39,715కి చేరింది. అంటే.. 326 శాతం పెరిగింది.
29 నెలల గరిష్ఠానికి నిరుద్యోగం
కెనడా ఉద్యోగ కల్పన ఒడిదుడుకుల్లో పడింది. గత నెల జూన్‌లో 1400 మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఇదేసమయంలో నిరుద్యోగ సూచి 29 నెలల గరిష్ఠాన్ని(6.4ు) నమోదు చేసింది. వాస్తవానికి మే నెలలోనే మార్కెట్ నిపుణులు నిరుద్యోగం 6.3 శాతానికి పెరుగుతుందని అంచనా వేశారు. కానీ, వారి అంచనాలు దాటి మరీ నిరుద్యోగం నమోదైంది. యువతలో నిరుద్యోగ రేటు 0.9ు నుంచి 13.5 శాతానికి చేరిందని విశ్లేషకులు తెలిపారు. ఉద్యోగుల వేతనాల పెంపు.. నియామకాలపై ప్రభావం చూపుతోందని అంటున్నారు. ఈ ఏడాది మేలో గంటల ప్రాతిపదికన ఉద్యోగుల వేతనాన్ని 5.2ు నుంచి 5.6 శాతానికి పెంచారు. ఈ వేతనాల పెంపు నియామకాలపై ప్రభావం చూపిందని చెబుతున్నారు.