CBI : అడిషనల్ చార్జ్‌షీట్‌లో తప్పులు లేవు
ABN, Publish Date - Jul 13 , 2024 | 02:54 AM
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత పాత్రపై దాఖలు చేసిన అడిషనల్ చార్జ్‌షీట్‌లో తప్పులేమీ లేవని న్యాయస్థానానికి సీబీఐ తెలిపింది. ఈ కేసులో అరెస్టయి తిహాడ్ జైలులో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత పాత్రపై ......
మద్యం కుంభకోణం కేసులో సీబీఐ వాదన
చార్జ్‌షీట్‌లో తప్పులు.. బెయిల్ ఇవ్వండి
కోర్టులో కవిత తరఫు న్యాయవాది వాదన
న్యూఢిల్లీ, జూలై 12 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత పాత్రపై దాఖలు చేసిన అడిషనల్ చార్జ్‌షీట్‌లో తప్పులేమీ లేవని న్యాయస్థానానికి సీబీఐ తెలిపింది. ఈ కేసులో అరెస్టయి తిహాడ్ జైలులో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత పాత్రపై సీబీఐ అడిషనల్ చార్జ్‌షీట్ దాఖలు చేసింది. అయితే, చార్జ్‌షీటే సరిగాలేదని, అందులో తప్పులు ఉన్నాయని, అందువల్ల తనకు బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్ దాఖలు చేశారు. చార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశం, కవిత బెయిల్ పిటిషన్.. రెండింటిపైనా శుక్రవారం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. కవిత తరఫున సీనియర్ న్యాయవాది నితేష్ రాణా వాదనలు వినిపించారు. సీబీఐ చార్జ్‌షీట్‌లో తప్పులు ఉన్నాయని ఆరోపించారు.
దీనిపై సీబీఐ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. తప్పులు ఉన్నాయన్న వాదనలో వాస్తవం లేదని, నిబంధనల ప్రకారమే ఫైల్ చేశామని వెల్లడించారు. అయితే చార్జ్‌షీట్‌లో తప్పులు, కవిత బెయిల్ పిటిషన్ అంశాలపై సమగ్ర విచారణ జరిగే వరకూ చార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకోవద్దని నితేష్ రాణా కోరారు. దీనికి సీబీఐ తరఫు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. కవిత బెయిల్ పిటిషన్‌కు, చార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకోవడానికి సంబంధం లేదని వాదించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం.. కవిత బెయిల్ పిటిషన్, చార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకునే అంశంపై ఈ నెల 22న విచారణ చేపడతామని స్పష్టం చేసింది.
Updated Date - Jul 13 , 2024 | 02:54 AM