Central Government : యాపిల్ యూజర్లకు కేంద్రం ‘హై-రిస్క్’ అలర్ట్
ABN, Publish Date - Aug 05 , 2024 | 02:31 AM
యాపిల్ ఉత్పత్తుల వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం భద్రతాపరమైన హెచ్చరికలు జారీ చేసింది. ఐఫోన్, ఐప్యాడ్స్, మ్యాక్‌బుక్స్ సహా ఇతర యాపిల్ పరికరాలకు ‘హై రిస్క్’ అలర్ట్ ఇచ్చింది.
న్యూఢిల్లీ, ఆగస్టు 4: యాపిల్ ఉత్పత్తుల వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం భద్రతాపరమైన హెచ్చరికలు జారీ చేసింది. ఐఫోన్, ఐప్యాడ్స్, మ్యాక్‌బుక్స్ సహా ఇతర యాపిల్ పరికరాలకు ‘హై రిస్క్’ అలర్ట్ ఇచ్చింది. యాపిల్ ఉత్పత్తుల్లో గుర్తించిన కీలకమైన లోపాలు ఆయా పరికరాలపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీ ఏజెన్సీ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్-ఇన్) హెచ్చరికలు జారీచేసింది.
ఈ లోపాల వలన హ్యాకర్లు ఏకపక్షంగా కోడ్‌ను ఎగ్జిక్యూట్ చేసి డివైజ్‌లను రిమోట్‌గా ఆపరేట్ చేసే ముప్పు ఉందని హెచ్చరించింది. దీనివల్ల సున్నితమైన సమాచార భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొంది. కాబట్టి యాపిల్ యూజర్లు వెంటనే తమ ఉత్పత్తులను లేటెస్ట్ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్ వెర్షన్‌తో అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. దీనిపై యాపిల్ సంస్థ కూడా స్పందించింది.
యాపిల్ పరికరాలపై పెగాసస్ తరహాలో స్పైవేర్ దాడులు జరిగే అవకాశం ఉందని భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా 150 దేశాల్లో ఉన్న తన వినియోగదారులను అప్రమత్తం చేసింది. భారత్‌లో.. జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా కుమార్తె, మీడియా సలహాదారు ఇల్తిజా ముప్తీ, సమృద్ద భారత్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పుష్పరాజ్ దేశ్‌పాండే సహా పలువురు ప్రముఖులు ఈ హెచ్చరికలు అందుకున్నట్టు సమాచారం.
లోపాలు గుర్తించిన వెర్షన్లు ఇవే...
ఐఓఎస్, ఐప్యాడ్ ఓఎస్ 17.6, 16.7.9కు ముందు వెర్షన్లు ఫ ఐమ్యాక్ ఓఎస్ 14.6 (సొనోమా), 13.6.8 (వెంచురా), 12.7.6 (మోంటెరీ)కి ముందు వెర్షన్లు
ఐవాచ్ ఓఎస్ 10.6కు ముందు వెర్షన్లు
యాపిల్ టీవీ ఓఎస్ 17.6కు ముందు వెర్షన్లు
యాపిల్ విజన్ ఓఎస్ 1.3కు ముందు వెర్షన్లు
సఫారీ ఓఎస్ 17.6కు ముందు వెర్షన్లు
Updated Date - Aug 05 , 2024 | 02:31 AM