బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై నిషేధం ఎత్తివేత
ABN, Publish Date - Sep 29 , 2024 | 04:49 AM
బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతులపై అమల్లో ఉన్న నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. అయితే టన్నుకు 490 డాలర్ల కనీస ఎగుమతి ధర (ఎంఈపీ)ను శనివారం విధించింది.
న్యూఢిల్లీ, సెప్టెంబరు 28: బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతులపై అమల్లో ఉన్న నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. అయితే టన్నుకు 490 డాలర్ల కనీస ఎగుమతి ధర (ఎంఈపీ)ను శనివారం విధించింది. అలాగే ఈ బియ్యంను ఎగుమతి సుంకం నుంచి మినహాయించింది. దేశీయంగా బియ్యం సరఫరాను పెంచడానికే కాకుండా ధరలను నియంత్రించే ఉద్దేశంతో గత ఏడాది జూలైలో బాస్మతీయేతర తెల్ల బియ్యంపై కేంద్రం నిషేధం విధించింది. తాజాగా బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేయడంతోపాటు కనీస ఎగుమతి ధరను విధిస్తూ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎ్‌ఫటీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. దేశంలోని గోదాముల్లో బియ్యం నిల్వలు పెరగడం, రిటైల్ ధరలు నియంత్రణలోనే ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. మరోవైపు పారాబాయిల్డ్ బియ్యంపై ఎగుమతి సుంకాన్ని 20 శాతం నుంచి 10 శాతానికి కేంద్రం తగ్గించింది. బ్రౌన్ రౌస్‌పై ఎగుమతి సుంకాన్ని 10శాతానికి తగ్గిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని రెవెన్యూ విభాగం ఓ నోటిఫికేషన్‌లో పేర్కొంది. బాస్మతీయేతర తెల్లబియ్యంపైనా ఎగుమతి సుంకం 20శాతం ఉండగా ఈ బియ్యాన్ని ఎగుమతి సుంకం నుంచి మినహాయించారు. తక్షణమే సుంకాల్లో మార్పు అమల్లోకి వస్తుందని నోటిఫికేషన్‌లో తెలిపారు.
Updated Date - Sep 29 , 2024 | 04:49 AM