మీడియా భేటీలపై కార్యదర్శులకు కేంద్రం కొత్త రూల్స్
ABN, Publish Date - Nov 06 , 2024 | 05:00 AM
ప్రసార మాధ్యమాల్లో తప్పుడు వార్తలు, సమాచారాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం కొత్త నిబంధనలు రూపొందించనుంది.
న్యూఢిల్లీ, నవంబరు 5: ప్రసార మాధ్యమాల్లో తప్పుడు వార్తలు, సమాచారాన్ని ఎదుర్కొనేందుకు కేంద్రం కొత్త నిబంధనలు రూపొందించనుంది. ఈ బాధ్యతను సమాచార ప్రసార శాఖకు అప్పగించింది. ఇటీవల పలువురు కేంద్ర కార్యదర్శులతో నిర్వహించిన సమావేశం అనంతరం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే మీడియాకు సమాచారం ఇచ్చే విషయంలో కార్యదర్శులు ఏం చేయాలి, ఏం చేయకూడదో నిర్దేశిస్తూ కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి వారికి లేఖ రాశారు. కేంద్రం నిర్ణయాలపై మీడియాలో చర్చలకు కార్యదర్శులు దూరంగా ఉండాలని ఆ లేఖలో స్పష్టం చేశారు. ప్రతిపాదన దశలో ఉన్న ప్రణాళికల వివరాలను మీడియాకు ఇవ్వొద్దని నిర్దేశించారు. ప్రభుత్వ నిర్ణయాలను సొంత గొప్పలు చెప్పుకోవడానికి వాడుకోవద్దని సూచించారు. మీడియా ప్రాయోజిత కార్యక్రమాల్లో పాల్గొనవద్దని, ఒకవేళ వెళ్లాలనుకుంటే సమాచార శాఖ అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు. ఇప్పటివరకు సంబంధిత మంత్రి అనుమతి ఉంటే సరిపోయేది.
Updated Date - Nov 06 , 2024 | 05:02 AM