Chief Minister: ప్రధానితో భేటీ సంతృప్తికరం..
ABN, Publish Date - Sep 28 , 2024 | 12:23 PM
ప్రధాని నరేంద్రమోదీతో జరిగిన సమావేశం సంతృప్తికరంగా, ఆహ్లాదకరమైన వాతావారణంలో కొనసాగిందని, నిర్ణీత సమయకంటే ఎక్కువ సేపు తామిద్దరం మాట్లాడుకున్నామని ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) తెలిపారు.
- ముఖ్యమైన 3 డిమాండ్లపై చర్యలు కోరాం
- ద్విభాషా విధానానికే కట్టుబడి ఉన్నాం
- ఢిల్లీలో స్టాలిన్
చెన్నై: ప్రధాని నరేంద్రమోదీతో జరిగిన సమావేశం సంతృప్తికరంగా, ఆహ్లాదకరమైన వాతావారణంలో కొనసాగిందని, నిర్ణీత సమయకంటే ఎక్కువ సేపు తామిద్దరం మాట్లాడుకున్నామని ముఖ్యమంత్రి స్టాలిన్(Chief Minister Stalin) తెలిపారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రానికి సంబంధించి ముఖ్యమైన మూడు సమస్యలను ఆయన పరిష్కరిస్తారని ఆశిస్తున్నట్లు సీఎం వ్యాఖ్యానించారు. గురువారం ఢిల్లీకి బయలుదేరి వెళ్లిన సీఎం తమిళనాడు హౌస్‌లో రాత్రి బసచేశారు. శుక్రవారం ఉదయం ఆయన ప్రధాని నరేంద్ర మోదీని ఆయన నివాసగృహంలో కలుసుకున్నారు. పావుగంట సేపు జరగాల్సిన వీరి సమావేశం ముప్పావు గంట సేపు కొనసాగింది.
ఇదికూడా చదవండి: Bhavika Mangalanandan: పాకిస్థాన్ సంగతి ప్రపంచానికి తెలుసు
ప్రధానికి వినతి పత్రం సమర్పించిన తర్వాత తమిళనాడు హౌస్(Tamil Nadu House)కు చేరుకున్న స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ... చెన్నై(Chennai)లో మొదటి విడత మెట్రోరైలు ప్రాజెక్టుకు కేటాయించినట్లే, రెండో విడత మెట్రోరైలు ప్రాజెక్టును కూడా కేంద్రప్రభుత్వం 50 శాతం నిధులు కేటాయించాలని కోరుతున్నామని, కొత్త ప్రాజెక్టుకు తప్పకుండా నిధులు కేటాయిస్తామని 2021-22 బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి ప్రకటించారని గుర్తు చేశారు. మెట్రో ప్రాజెక్టు పనులకు ఇప్పటివరకూ రూ.18,564 కోట్లకు పైగా ఖర్చు చేశామని, అయితే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపకపోవంతో కేంద్రం నుంచి యాభై శాతం నిధులు పొందలేని పరిస్థితి ఏర్పడిందన్నారు.
రాష్ట్రంలో ద్విభాషావిధానమే...
కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులతో ఉమ్మడిగా అమలు చేయాల్సిన విద్యావిధానం పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి కేటాయించాల్సిన రూ.2152 కోట్లలో మొదటి విడత నిధులు ఇంకా విడుదల చేయలేదని, ఈ విషయాన్ని కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్ళినట్లు చెప్పారు. ఈ పథకంకింద అవగాహన ఒప్పందంలో రాష్ట్ర ప్రభుత్వం సంతకం చేయకపోవడం వల్లే నిధులు విడుదలవలేదని కేంద్రప్రభుత్వం ప్రకటించడం గర్హనీయమన్నారు. జాతీయ విద్యావిధానంలో కొన్ని మంచి అంశాలు కూడా ఉన్నాయని, వాటిలో చాలా వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుండో అమలు చేస్తోందన్నారు.
అయితే జాతీయ విద్యా కమిటీ పేర్కొన్న నిబంధనల్లో ఒకటైన త్రిభాషా విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికీ అంగీకరించదని, ద్విభాషా విధానానికే కట్టుబడి ఉన్నామని, ఏ రాష్ట్రంపైనా ఏ భాషను నిర్బంధంగా అమలు చేసే ప్రసక్తే లేదంటూ కేంద్రం ఇచ్చిన భరోసా అవగాహన ఒప్పందంలో లేదని, కనుకనే ఒప్పందంలో మార్పులు చేయాలని కోరుతున్నామన్నారు. కేంద్రం నిధులు విడుదల చేయకపోవడంతో టీచర్లకు జీతాలు ఇవ్వలేకపోతున్నామనే విషయాన్ని కూడా ప్రధాని దృష్టికి తీసుకెళ్ళామని చెప్పారు.
ఇక మూడోది తమిళ జాలర్ల సమస్య అని, దీనిని పలుమార్లు ప్రధాని, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. తమిళ జాలర్లపై శ్రీలంక నావికాదళం దాడులను నిరోధించాలని, తమిళ జాలర్లు స్వేచ్ఛగా చేపలు పట్టుకునే పరిస్థితి కల్పించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశామన్నారు. శ్రీలంక నావికాదళం నిర్బంధంలో ఉన్న జాలర్లను వీలయినంత త్వరగా విడుదల చేయాలని డిమాండ్ చేశామని చెప్పారు.
వచ్చేనెల కొలంబోలో జరుగనున్న భారత్, శ్రీలంక దేశాల మధ్య జరుగనున్న ఉమ్మడి కమిటీ సమావేశంలో ఈ అంశంపై చర్చించి తక్షణ చర్యలు చేపట్టాలని ప్రధానిని కోరినట్లు స్టాలిన్ చెప్పారు. ప్రధానమైన ఈ మూడు కీలకమైన అంశాలను విన్న ప్రధాని తక్షణ చర్యలు చేపడతామంటూ హామీ ఇచ్చారని స్టాలిన్ తెలిపారు. ఢిల్లీ పర్యటన సాఫీగా జరిగిందని, సోనియాగాంధీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నానని ఆయన చెప్పారు.
ఇదికూడా చదవండి: హర్ష సాయి కేసులో కొత్త ట్విస్ట్..
ఇదికూడా చదవండి: కాంగ్రెస్‌కు పోయే కాలం దగ్గర పడింది..
ఇదికూడా చదవండి: మేము నిర్మిస్తే కాంగ్రెస్ కూల్చేస్తోంది: కేటీఆర్
ఇదికూడా చదవండి: పెద్ద వెంచర్లన్నీ పెండింగ్‌లోనే!
Read Latest Telangana News and National News
Updated Date - Sep 28 , 2024 | 12:23 PM