రూ. 25 వేల కోట్ల స్కాంలో సునేత్రకు క్లీన్‌చిట్
ABN, Publish Date - Apr 25 , 2024 | 06:15 AM
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి లోక్‌సభ స్థానం ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్‌కు రూ.25వేల కోట్ల కుంభకోణంలో ముంబై పోలీసులు క్లీన్‌చిట్ ఇచ్చారు.
ముంబై, ఏప్రిల్ 24: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి లోక్‌సభ స్థానం ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్‌కు రూ.25వేల కోట్ల కుంభకోణంలో ముంబై పోలీసులు క్లీన్‌చిట్ ఇచ్చారు. మహారాష్ట్ర స్టేట్ కో ఆపరేటివ్ బ్యాంకు (ఎంఎ్‌ససీబీ)లో చోటుచేసుకున్న స్కాంకు సంబంధించిన కేసులో దర్యాప్తు చేపట్టిన ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) ఈ ఏడాది జనవరిలోనే తుది నివేదికను సమర్పించింది. అందులోని వివరాలు తాజాగా బయటికొచ్చాయి.
ఇందులో సునేత్ర పవార్, ఆమె భర్త అజిత్‌కు సంబంధించిన లావాదేవీల్లో ఎలాంటి అవకతవకలు జరగలేదని గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఎలాంటి క్రిమినల్ నేరం జరగలేదని.. అజిత్‌కు చెందిన జరందేశ్వర్ షుగర్ మిల్లుకు జారీ చేసిన రుణాల విషయంలో బ్యాంకుకు ఎలాంటి నష్టం జరగలేదని నివేదికలో తెలిపారు. ప్రస్తుతం ఎన్‌సీపీ చీఫ్‌గా ఉన్న అజిత్ పవార్.. గతేడాది తన వర్గంతో బీజేపీ, శివసేన (ఏక్‌నాథ్ షిండే వర్గం) అధికార కూటమిలో చేరి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు.
కాగా సార్వత్రిక ఎన్నికల వేళ సునేత్రకు క్లీన్‌చిట్ ఇస్తూ నివేదిక బయటికిరావడంతో మహారాష్ట్ర సర్కారు, బీజేపీపై విపక్షాలు విరుచుకుపడ్డాయి. ‘బీజేపీ వాషింగ్‌మెషీన్’ అంటూ విపక్షాలు చేస్తున్న వ్యాఖ్యలు సమంజసమేనని.. పోలీసుల చర్యే ఇందుకు నిదర్శమని శివసేన (యూబీటీ) నేత ఆనంద్ దూబే అన్నారు.
‘రూ.25 వేల కోట్ల కుంభకోణం గురించి గతంలో ప్రధాని మాట్లాడుతూ పవార్ కుటుంబీకులందరూ అవినీతిపరులేనని ఊగిపోయారు. ఇప్పుడు వారు బీజేపీతో కలిసిపోగానే సునేత్రకు క్లీన్‌చిట్ ఇచ్చారు. ప్రతిపక్షాలు అంటున్నట్లు ‘బీజేపీ వాషింగ్ పౌడర్’ వ్యాఖ్యలు నిజమేనని రుజువైంది’ అన్నారు.
Updated Date - Apr 25 , 2024 | 06:15 AM