Exit polls: 'ఎగ్జిట్ పోల్స్ డిబేట్'పై కాంగ్రెస్ సంచలన నిర్ణయం
ABN, Publish Date - May 31 , 2024 | 08:35 PM
లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ఘట్టం చివరి దశకు వచ్చింది. జూన్ 1వ తేదీన జరిగే ఏడో విడత పోలింగ్‌తో ఎన్నికల ప్రక్రియ ముగియగానే అందరి దృష్టి ఎగ్జిట్ పోల్ ఫలితాలపై పడనుంది. టీవీ ఛానెల్స్ పోటీపడి చర్చా కార్యక్రమాలు జరుపుతాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. 'ఎగ్జిట్ పోల్స్ డిబేట్'లో తమ పార్టీ పాల్గొనేది లేదని శుక్రవారంనాడు ప్రకటించింది.
న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections) పోలింగ్ ఘట్టం చివరి దశకు వచ్చింది. జూన్ 1వ తేదీన జరిగే ఏడో విడత పోలింగ్‌తో ఎన్నికల ప్రక్రియ ముగియగానే అందరి దృష్టి ఎగ్జిట్ పోల్ ఫలితాలపై పడనుంది. టీవీ ఛానెల్స్ పోటీపడి చర్చా కార్యక్రమాలు జరుపుతాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. 'ఎగ్జిట్ పోల్స్ డిబేట్'లో తమ పార్టీ పాల్గొనేది లేదని శుక్రవారంనాడు ప్రకటించింది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడడానికి ముందే ఎలాంటి ఊహాగానాలకు, వాదోపవాదాలకు తావీయరాదని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్టు ఆ పార్టీ ప్రతినిధి పవన్ ఖేరా (Pawan Khera) తెలిపారు.
''ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తీర్పు పదిలంగా ఉంది. జూన్ 4న ఫలితాలు వెలువడతాయి. దీనికి ముందే టీఆర్‌పీ కోసం ఊహాగానాలు, వాదోపవాదాలకు తావీయాల్సిన అవసరం కనిపించడం లేదు. ఎగ్జిట్ పోల్స్‌పై జరిగే చర్చల్లో కాంగ్రెస్ పాల్గొనడం లేదు. 4వ తేదీ నుంచి ఏ డిబేట్‌లో పాల్గొనేందుకైనా మేము సిద్ధం'' అని పవన్ ఖేరా సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపారు.
ఊహాగానాలెందుకు?
కాగా, ఎగ్జిట్స్ పోల్స్ పేరుతో ఊహాగానాల అవసరం ఏముందని పవన్ ఖేరా మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నించారు. ఛానెల్స్ టీఆర్‌పీ పెంచడం కోసం అర్ధం లేని ఊహాగానాలు చేయాల్సిన పనేముంది? అని ప్రశ్నించారు. కొన్ని శక్తులకు బెట్టింగ్‌తో ప్రమేయం ఉంటుందని, అందులో తాము పాలుపంచుకోవాలని అనుకోవడం లేదని చెప్పారు. ప్రతి ఒక్కరికీ తాము ఎవరికి ఓటు వేశామో తెలుసునని, జూన్ 4న తమకు ఎన్ని ఓట్లు పోలయ్యాయో పార్టీలకు తెలుస్తుందని, దీనిపై ఊహాగానాలకు ఎందుకని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో తాము గెలవబోతున్నామని, జూన్ 4 తర్వాత 'ఇండియా' కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జూన్ 1వ తేదీ సాయంత్రం 6.30 వరకూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలపై ఎన్నికల కమిషన్ నిషేధం ఉంది. ఆ గడవు పూర్తికాగానే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను పలు స్వంతంత్ర, మీడియా సంస్థలు ప్రకటిస్తాయి. చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తాయి. 1957 నుంచి ఇండియాలో ఎగ్జిట్ పోల్స్ ప్రారంభమయ్యాయి. అయితే, ఎగ్జిట్ పోల్స్ డిబేట్‌కు దూరంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం మాత్రం ఇదే మొదటిసారి.
Updated Date - May 31 , 2024 | 08:35 PM