Delhi : ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత
ABN, Publish Date - Aug 23 , 2024 | 04:18 AM
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్ జైలులో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మళ్లీ అస్వస్థతకు గురయ్యారు.
ఢిల్లీ ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు
న్యూఢిల్లీ, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్ జైలులో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. ఆమెకు గురువారం ఢిల్లీ ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు నిర్వహించి, తిరిగి జైలుకు తీసుకొచ్చారు. ఆమె కొంతకాలంగా గైనిక్ సమస్యలతో బాధపడుతున్నారు. దీనికి తోడు ఇటీవల వైరల్ జ్వరం బారినపడ్డారు.
జూలై 16న తొలిసారిగా కవితను ఢిల్లీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. రెండు రోజుల తర్వాత 18న ఆమెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టులో హాజరుపరచగా, తనకు ఎదురవుతున్న అనారోగ్య సమస్యలను జడ్జి కావేరి బవేజా దృష్టికి తీసుకెళ్లారు. కవిత విజ్ఞప్తి మేరకు ఢిల్లీ ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలకు అనుమతి ఇచ్చారు. అప్పటి నుంచి ఆమె ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడలేదు. జైలు వైద్యులే ఆమెకు వైద్యం అందిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఆమె మళ్లీ ఆమె అస్వస్థతకు గురైనట్టు తెలిసింది. జైలు వైద్యుల సూచన మేరకు గురువారం ఉదయం 10.30 గంటల సమయంలో అధికారులు ఆమెను ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
కవిత భర్త అనిల్ సమక్షంలో వైద్య పరీక్షలు చేశారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో తిరిగి జైలుకు తరలించారు. ఆమె సుమారు ఐదున్నర నెలల నుంచి జైలులోనే ఉన్నారు. జైలుకు వెళ్లిన తర్వాత ఆమె సుమారు 11 కేజీల బరువు తగ్గారు. బెయిల్ విషయంలో ట్రయల్ కోర్టుతో పాటు హైకోర్టులో కూడా ఆమెకు నిరాశే ఎదురైంది. ఈ నెల 27న ఆమె బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
Updated Date - Aug 23 , 2024 | 04:25 AM