Arvind Kejriwal: కేజ్రీవాల్ అరెస్టుపై సీబీఐకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు
ABN, Publish Date - Jul 02 , 2024 | 03:51 PM
ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ అరెస్టును వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు తాజాగా దర్యాప్తు సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. కేజ్రీవాల్ అరెస్టుపై సమగ్రమైన సమాధానం ఇవ్వాలంటూ సీబీఐకి హైకోర్టు మంగళవారంనాడు నోటీసులు ఇచ్చింది.
న్యూఢిల్లీ: ఎక్సైజ్ పాలసీ (Excise policy) కేసులో సీబీఐ అరెస్టును వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) వేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు (Delhi High court) తాజాగా దర్యాప్తు సంస్థకు ఆదేశాలు జారీ చేసింది. కేజ్రీవాల్ అరెస్టుపై సమగ్రమైన సమాధానం ఇవ్వాలంటూ సీబీఐకి హైకోర్టు మంగళవారంనాడు నోటీసులు ఇచ్చింది. రిజాయిండర్ ఏదైనా ఉంటే రెండ్రోజుల్లోను, సమగ్ర సమాధానం 7 రోజుల్లోనూ తమకు సమర్పించాలని జస్టిస్ నీనా బన్సాల్ కృష్ణతో కూడిన హైకోర్టు బెంచ్ ఆదేశించింది. తదుపరి విచారణను జూలై 17వ తేదీకి వాయిదా వేసింది.
కాగా, విచారణ సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి తన వాదనను వినిపిస్తూ, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్‌ను సీబీఐ అరెస్టు చేయాల్సిన అవసరమేమీ లేదని అన్నారు. సీబీఐ 2022 ఆగస్టులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిందని, 2023 ఏప్రిల్‌లో సమన్లు పంపి 9 గంటల సేపు ప్రశ్నించిందని, అప్పట్నించీ సీబీఐ చేసిందేమీ లేదని, ఎప్పుడో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇప్పుడు అరెస్టు చేసిందన్నారు. అరెస్టు మెమో ఆంటే కనీసం కొన్ని కారణాలైనా ఉండాలని, ఏ కారణంతో చర్య తీసుకుంటున్నారనేది ఉండాలని వాదించారు. నిందితుడు ఉగ్రవాది అయినా, పరారయ్యే అవకాశం ఉన్నా అరెస్టు చేయవచ్చని అన్నారు. ఎక్సైజ్ పాలసీ కేసులో తన క్లయింట్ జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నందున ఆయనను అరెస్టు చేయాల్సిన అవసరం లేదని సింఘ్వి వాదించారు. అరెస్టు మెమో సైతం కేవలం ఒక పేరాలో, అది కూడా నాలుగు లైన్లలో ఉందని కోర్టు దృష్టికి తెచ్చారు.
Salman Khan: సల్మాన్ ఖాన్ హత్యకు కుట్ర.. ఛార్జ్‌షీట్‌లో సంచలన విషయాలు..
ఇంతకుముందు, అరవింద్ కేజ్రీవాల్‌ను కోర్టురూములో ప్రశ్నించేందుకు ఢిల్లీ కోర్టు అనుమతించడంతో జూన్ 26న ఆయనను సీబీఐ అరెస్టు చేసింది. అయితే, అప్పటికే ఎక్సైజ్ పాలసీ కేసులో ఈడీ దర్యాప్తునకు సంబంధించి కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. మార్చి 21న ఆయనను ఈడీ అరెస్టు చేసింది. లోక్‌సభ ఎన్నికల కారణంగా 21 రోజుల పాటు ఆయనను సుప్రీంకోర్టు ఇటీవల విడుదల చేసింది. జూన్ 2న ఆయన తిరిగి తీహార్ జైలుకు లొంగిపోయారు. ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ కోర్టు గత నేలలో కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వగా, దిగువ కోర్టు ఆదేశాలపై ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చింది.
For More National News and Telugu News..
Updated Date - Jul 02 , 2024 | 03:53 PM