Delhi : యూపీఎస్సీ చైర్మన్ రాజీనామా
ABN, Publish Date - Jul 21 , 2024 | 04:46 AM
యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. మరో ఐదేళ్లు పదవీ కాలం ఉండగానే ఆయన బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. వ్యక్తిగత కారణాలతో పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
పూజ ఉదంతంతో సంబంధం
లేదని యూపీఎస్సీ ప్రకటన
న్యూఢిల్లీ, జూలై 20: యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనీ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. మరో ఐదేళ్లు పదవీ కాలం ఉండగానే ఆయన బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. వ్యక్తిగత కారణాలతో పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నకిలీ పత్రాలతో ఉద్యోగానికి ఎంపికైనట్లుగా మహారాష్ట్రకు చెందిన ప్రొబేషనరీ ఐఏఎస్ పూజా ఖేద్కర్‌పై పెద్దఎత్తున ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో.. మనోజ్ సోనీ రాజీనామా చర్చనీయాంశం అయింది.
అయితే, పూజా ఉదంతంతో చైర్మన్ నిర్ణయానికి ఏ సంబంధమూ లేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. మనోజ్ 15 రోజుల కిందటనే నిర్ణయం తీసుకున్నారని, రాష్ట్రపతికి రాజీనామా లేఖ పంపారని, అది ఇంకా ఆమోదం పొందలేదని చెప్పాయి. 59 ఏళ్ల సోనీకి ప్రముఖ విద్యావేత్తగా పేరుంది. 2005-08 మధ్యన గుజరాత్ బరోడాలోని మహరాజా శాయాజీరావ్ యూనివర్సిటీకి, 2009-15 కాలంలో అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి ఉప కులపతిగా వ్యవహరించారు. దేశంలో అత్యంత చిన్న వయసులో ఉప కులపతి అయిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు.
2017లో యూపీఎస్సీ సభ్యుడిగా నియమితులయ్యారు. గత ఏడాది మే 16న చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. అయితే, సోనీ బాధ్యతల పట్ల సంతృప్తిగా లేరని, తనను రిలీవ్ చేయాలని కోరినట్లు సమాచారం. ఇకపై ఆయన సమాజ సేవ, ఆధ్యాత్మిక బాటలో పయనించాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. కానీ, వరుస కుంభకోణాలతో యూపీఎస్సీ ప్రతిష్ఠ దెబ్బతిన్నదని.. ఇటీవలి కుంభకోణాలలో కమిషన్ ప్రమేయం ఉండడంతో ఆయనను బలవంతంగా తప్పించారని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఆరోపించారు. సోనీ ఎప్పుడో రాజీనామా చేస్తే ఇప్పుడా బయటపెట్టేదని ప్రశ్నించారు.
Updated Date - Jul 21 , 2024 | 04:46 AM