Money Laundering Case: సీఎం కూతురిపై ఈడీ కొరడా.. మనీ లాండరింగ్ కేసు నమోదు
ABN, Publish Date - Mar 27 , 2024 | 05:26 PM
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్ , ఆమె ఐటీ కంపెనీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కొరడా ఝళిపించింది. మనీ లాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసినట్టు సమాచారం.
న్యూఢిల్లీ: కేరళ (Kerala) ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Pinarayi Vijayan) కుమార్తె వీణా విజయన్ (Veena Vijayan), ఆమె ఐటీ కంపెనీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కొరడా ఝళిపించింది. మనీ లాండరింగ్ చట్టం (PMLA) కింద కేసు నమోదు చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. వీణా విజయన్ సంస్థకు ఒక మినరల్ కంపెనీ అక్రమంగా చెల్లింపులు జరిపిందంటూ 'సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టికేషన్ ఆఫీస్' చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈడీ ఈ కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది.
ఈడీ వర్గాల సమాచారం ప్రకారం, కొచ్చికి చెందిన సంస్థ 'కొచిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్' (సీఎంఆర్ఎల్) అనే ప్రైవేటు సంస్థ 2017, 2018లో వీణా విజయన్‌కు చెందిన ఎక్సలాజిగ్ సొల్యూషన్ సంస్థకు రూ.1.72 కోట్లు చెల్లించింది. ఎలాంటి సర్వీసు తీసుకోకుండానే ఈ చెల్లింపులు జరిపిననట్టు ఈడీ వర్గాల ఆరోపణగా ఉంది. ఒక ప్రముఖ వ్యక్తితో వీణా విజయన్‌కు సత్సంబంధాలున్నందునే ఎలాంటి సర్వీసు లేకుండానే ఎక్సలాజిక్‌కు సీఎంఆర్ఎల్ నెలవారీ చెల్లింపులను జరిపేదని చెబుతోంది.
దీనికి ముందు, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ చేసిన దర్యాప్తుకు వ్యతిరేకంగా ఎక్సలాజిక్ కంపెనీ కర్ణాటక హైకోర్టుకు వెళ్లింది. అయితే, ఆ పిటిషన్‌ను కోర్టు గత నెలలో తోసిపుచ్చింది. కాగా, గత జనవరిలో కేరళ అసెంబ్లీలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాట్లాడుతూ, తన భార్య రిటైర్‌మెంట్ ప్రయోజనాలతో తన కుమార్తె ఐటీ కంపెనీ పెట్టిందని, ఆమె పైన, తన కుటుంబం పైన చేస్తున్న ఆరోపణల్లో ఎంతమాత్రం నిజం లేదని చెప్పారు.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Mar 27 , 2024 | 05:52 PM