Rajya Sabha: సర్వత్రా ఉత్కంఠ.. ముగిసిన ఎన్నికలు.. కాసేపట్లో ఫలితాలు..
ABN , Publish Date - Feb 27 , 2024 | 06:13 PM
రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు ముగిశాయి. దీంతో వెంటనే ఓట్ల కౌంటింగ్ ప్రారంభమైంది. ఈ ఏడాది ఏప్రిల్ 2 నాటికి రిటైర్ అవుతున్న 52 మంది సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు.
రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు ముగిశాయి. దీంతో వెంటనే ఓట్ల కౌంటింగ్ ప్రారంభమైంది. ఈ ఏడాది ఏప్రిల్ 2 నాటికి రిటైర్ అవుతున్న 52 మంది సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. 15 రాష్ట్రాల్లో 52 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవగా 3 రాష్ట్రాల్లోని 15 స్థానాలకు మినహా మిగిలిన అన్ని చోట్లా ఏకగ్రీవమయ్యాయి. కర్ణాటక, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ లలో 15 స్థానాలకు ఈరోజు పోలింగ్ జరిగింది. రాజ్యసభ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల ఎమ్మెల్యేలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. 12 రాష్ట్రాల్లో 41 స్థానాలకు ఏకగ్రీవంగా అభ్యర్థుల ఎంపిక జరగగా అందులో ఏపీ, తెలంగాణలో ఆరు స్థానాలు ఉండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ క్రమంలో కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్ లోని 15 రాజ్యసభ స్థానాలకు జరిగిన పోలింగ్ రసవత్తరంగా సాగింది. కాగా.. కొందరు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. హిమాచల్ లో 9 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడి కాంగ్రెస్ అభ్యర్ధి అభిషేక్ మను సింఘ్వీకికి బదులుగా బీజేపీ అభ్యర్ధి హర్ష్ మహాజన్ కు ఓటేసినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ ఎస్పీ ఎమ్మెల్యేలు బీజేపీకి, కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లు అనుమానం వ్యక్తమవుతోంది. ఈ మేరకు కాసేపట్లో విడుదలయ్యే ఫలితాలపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది.
ప్రతి రెండేళ్లకు కనీసం 33 శాతం రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. 15 రాష్ట్రాల నుంచి 56 మంది రాజ్యసభ ఎంపీల ఎంపికకు కూడా ఫిబ్రవరి 27నే ఎంచుకున్నారు. అయితే 12 రాష్ట్రాల నుంచి చాలా సీట్లు ఖాళీగా ఉండటంతో అంతే సంఖ్యలో అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేశారు. అలాంటి పరిస్థితుల్లో 12 రాష్ట్రాల నుంచి 41 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా రాజ్యసభ ఎంపీలు అయ్యారు. ఇప్పుడు మూడు రాష్ట్రాలకు ఎన్నికలు జరిగాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.