Share News

Landslides : ఎక్కడ చూసినా విషాదమే

ABN , Publish Date - Aug 01 , 2024 | 06:19 AM

టీవీ ముందు.. సోఫాలో కూర్చున్న ఐదుగురు కుటుంబ సభ్యులు.. కొండచరియల ధాటికి.. అదే సోఫాలో విగతజీవులుగా మారిపోయారు..! భారీ వర్షం, చలిని తాళలేక.. రెండుమూడు బెడ్‌షీట్లు కప్పుకొని పడుకున్నవారు.. ఆ దుప్పట్ల కిందే మృతదేహాలుగా కనిపించారు..! కొండచరియలు పెళపెళా విరిగిపడుతున్న శబ్దాలు విని.. బయటకు పరుగులు తీయాలనే

Landslides : ఎక్కడ చూసినా విషాదమే
వయనాడ్‌ జిల్లా చురుల్‌మలలో వరదను దాటుతున్న బాధితులు

వయనాడ్‌లో మృత్యువు విలయ తాండవం

సోఫాలో కూర్చునే మరణించిన ఓ కుటుంబం

పరుగెడుతూ.. బురదలో ఇరుక్కుని మరికొందరి మృతి

శునకాలు గుర్తించినా.. మృతదేహాల

వెలికితీతకు బండరాళ్ల అడ్డంకులు

భారీ వర్షాలతో మరిన్ని ఆటంకాలు

1000 మందిని కాపాడిన సైన్యం

వారం క్రితమే హెచ్చరించాం: అమిత్‌ షా

అంతా అబద్ధం.. రాజకీయాలకు సమయం కాదు: కేరళ సీఎం పినరయి

వయనాడ్‌, జూలై 31: టీవీ ముందు.. సోఫాలో కూర్చున్న ఐదుగురు కుటుంబ సభ్యులు.. కొండచరియల ధాటికి.. అదే సోఫాలో విగతజీవులుగా మారిపోయారు..! భారీ వర్షం, చలిని తాళలేక.. రెండుమూడు బెడ్‌షీట్లు కప్పుకొని పడుకున్నవారు.. ఆ దుప్పట్ల కిందే మృతదేహాలుగా కనిపించారు..! కొండచరియలు పెళపెళా విరిగిపడుతున్న శబ్దాలు విని.. బయటకు పరుగులు తీయాలనే ప్రయత్నంలో ఉన్నవారు.. అదే భంగిమలో బురదలో కూరుకుపోయి చనిపోయారు..! ఘటన జరిగిన సమయంలో వారి ఆందోళన.. భయాన్ని, నిస్సహాయతను స్పష్టంగా చెబుతున్నాయా? అన్నట్లుగా ఉన్న ఆ మృతదేహాల కళ్లు..! ఇవీ కొండచరియలు బీభత్సం సృష్టించిన కేరళలోని వయనాడ్‌ జిల్లా.. ముండక్కై, చురుల్‌మలలో సహాయక సిబ్బందికి బుధవారం ఎదురైన దృశ్యాలు..! వయనాడ్‌ విషాదంలో మృతుల సంఖ్య 270కు పెరిగినట్లు, మరో 240 మంది జాడను ఇంకా గుర్తించాల్సి ఉందని కేరళ మీడియా వెల్లడించింది. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని పేర్కొంది. అయితే.. భారీ వర్షాలు, దట్టమైన పొగమంచు కారణంగా.. సహాయక చర్యలను బుధవారం మధ్యాహ్నం 3 గంటలకే నిలిపివేయాల్సి వచ్చిందని విపత్తు నివారణ అధికారులు వెల్లడించారు. బుధవారం సాయంత్రానికి 143 మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయినట్లు తెలిపారు. వీరిలో 89 మందిని గుర్తించినట్లు పేర్కొన్నారు. 148 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.

ఎక్కడ చూసినా మృతదేహాలే..

బుధవారం ఉదయం సహాయక చర్యలు ప్రారంభమయ్యాక.. ఎక్కడ చూసినా మృతదేహాలు కనిపించాయని సైన్యం, ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ బృందాలు తెలిపాయి. చలియార్‌ నదిలో కొట్టుకొచ్చిన మృతదేహాల సంఖ్య 52గా ఉన్నట్లు వెల్లడించాయి. ముండక్కై, అట్టమల, చురుల్‌మలలో 72 వరకు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు, వేర్వేరు ప్రాంతాల్లో 1000 మందిని కాపాడి, సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు పేర్కొన్నాయి. ‘‘ఆర్మీ శునకాలు మృతదేహాలను గుర్తించడంలో కీలకంగా ఉపయోగపడుతున్నాయి. అయితే, బురద, భారీ బండరాళ్ల కారణంగా వాటిని వెలికితీయలేకపోయాం. ఎక్స్‌కవేటర్‌లు వస్తే గానీ, బండరాళ్లను, కుప్పకూలిన కాంక్రీట్‌ దిబ్బలను తొలగించలేం’’ అని ఓ అధికారి జాతీయ మీడియాకు వివరించారు. ముండక్కైలో 150 వరకు ఇళ్లు ఉండగా.. వాటిల్లో 65 పూర్తిస్థాయిలో నేలమట్టమైనట్లు తెలిపారు. శిథిలాలను తొలగిస్తేగానీ లోపల ఎంత మంది ఉన్నారనేది తెలియదని పేర్కొన్నారు. చురుల్‌మలలో కూడా నదికి సమీపంలో ఉన్న ఇళ్లు నేలమట్టమైనట్లు వెల్లడించారు. కాగా, వయనాడ్‌ ఘటనపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌(ఎన్‌జీటీ) స్పందించింది. ఈ విపత్తుపై సుమోటోగా కేసును స్వీకరించింది. మరోవైపు, వయనాడ్‌లోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడే ప్రమాదముందంటూ అధికారులు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేశారు. ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. హెచ్చరికలు జారీ చేసినట్లుగానే.. కన్నడిపుళ, విలంగాడు, చురుల్‌మల ప్రాంతాల్లో మధ్యాహ్నం కొండచరియలు విరిగిపడ్డాయి. ముందు జాగ్రత్త చర్యల వల్ల ప్రాణనష్టం జరగలేదని అధికారులు పేర్కొన్నారు.

ముందే హెచ్చరించాం: అమిత్‌షా

కేరళలో కొండచరియలు విరిగిపడే ప్రమాదముందని ముందే హెచ్చరించినట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా పార్లమెంట్‌లో వెల్లడించారు. ‘‘ఈ ముప్పు గురించి జూలై 23నే అప్రమత్తం చేశామన్నారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం పౌరులను సకాలంలో తరలించలేదు. వయనాడ్‌ విషాదాన్ని ఎదుర్కొనేందుకు నరేంద్ర మోదీ ప్రభుత్వం బాసటగా నిలుస్తుంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు వయనాడ్‌ ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించాలని కాంగ్రెస్‌ ఎంపీ కేసీ వేణుగోపాల్‌ కోరారు. దీనిపై అమిత్‌షా స్పందించలేదు. మరోవైపు లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌ గాంధీ కూడా వయనాడ్‌ బాధితులకు సాయం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గురువారం రాహుల్‌, ఆయన సోదరి ప్రియాంక వయనాడ్‌లో పర్యటించనున్నారు.


ప్రముఖుల సాయం

వయనాడ్‌ విపత్తుపై ప్రముఖ వ్యాపారవేత్తలు స్పందించారు. సీఎంఆర్‌ఎ్‌ఫకు రూ.5 కోట్ల చొప్పున విరాళాలు ఇస్తామని లులూ గ్రూప్‌ చైర్మన్‌ ఎంఏ యూసుఫ్‌ అలీ, రవి పిళ్లై, కల్యాణ్‌ జ్యువెల్లర్స్‌ యజమాని కల్యాణరామన్‌, విజింజం పోర్ట్‌ అదానీ గ్రూప్‌ ప్రకటించాయి. తమిళ నటుడు విక్రమ్‌ రూ.20 లక్షల సాయాన్ని ప్రకటించారు. ఒమన్‌ సుల్తాన్‌ పాలకుడు సుల్తాన్‌ హైతం-బిన్‌-తారీఖ్‌ వయనాడ్‌ ఘటనపై ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. రాష్ట్రపతి ముర్ము కూడా కొండచరియలు విరిగిపడి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన ఘటనపై దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

అంతా అబద్ధం: విజయన్‌

లోక్‌సభలో అమిత్‌షా చేసిన ప్రకటనను కేరళ సీఎం విజయన్‌ ఖండించారు. బుధవారం ఆయన తిరువనంతపురంలో విలేకరులతో మాట్లాడారు. ‘‘ప్రమాదం జరిగిన రోజు తెల్లవారుజామున మాత్రమే రెడ్‌ అలెర్ట్‌ జారీ అయ్యింది. అమిత్‌షా చెప్పిన దాంట్లో వాస్తవం లేదు. ఇది ఒకరిపై మరొకరు నిందలు వేసుకునే సాయం కాదు. కేంద్ర ప్రభుత్వం వారం రోజుల నుంచి వయనాడ్‌కు ఆరెంజ్‌ అలెర్ట్‌ మాత్రమే జారీ చేసింది. కానీ, భారీ వర్షాలు కురిశాయి. మంగళవారం ఉదయానికి (గడిచిన 48 గంటల్లో) 57.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది’’ అని పినరయి వ్యాఖ్యానించారు.

సాయం కోసం బేలీ వంతెనలు

వయనాడ్‌లో బురద ప్రవాహంలో చిక్కుకుపోయినవారిని రక్షించేందుకు, రోడ్డు మార్గాలు పూర్తిగా ధ్వంసమైన చోట బాధితులకు సహాయం అందించేందుకు సహయక బృందాలు ఉక్కుతో నిర్మించే తాత్కాలిక వంతెనలను ఉపయోగిస్తున్నాయి. వీటిని బేలీ వంతెనలు అంటారు. వరదలు సంభవించినప్పుడు ప్రాణనష్టాన్ని తగ్గించడంలో ఇవి చాలా కీలకంగా మారాయి. ఈ వంతెనలను చిన్న, తేలికైన వస్తువులతో వేగంగా నిర్మించవచ్చు. వయనా డ్‌లో ఈ బ్రిడ్జిల నిర్మాణానికి పరికరాలను ఢిల్లీ, బెంగళూరు నుంచి తరలించారు. వీటికి బ్రిటన్‌ సివిల్‌ సర్వెంట్‌ డొనాల్డ్‌ బేలీ రూపకల్పన చేశారు. ఆయన పేరు మీదుగానే వీటికి బేలీ బ్రిడ్జి అని పేరు వచ్చింది. ఈ తరహా వంతెనలను బ్రిటిష్‌ సైనికులు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఉపయోగించడం విశేషం.

Updated Date - Aug 01 , 2024 | 06:52 AM