మహాయుతిదే మహారాష్ట్ర?
ABN, Publish Date - Nov 21 , 2024 | 05:42 AM
దేశంలో అధికార, ప్రతిపక్ష కూటములు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించిన ‘మహా’ యుద్థానికి తెరపడింది. మహారాష్ట్రతోపాటు ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
బీజేపీ కూటమికే విజయావకాశాలు ఎక్కువ
ఝార్ఖండ్‌లోనూ ఎన్డీయేకే చాన్స్!.. పలు ఎగ్జిట్‌పోల్స్‌లో వెల్లడి
మహారాష్ట్రలో 58.22% పోలింగ్.. ఝార్ఖండ్ 67.59%.. ఎల్లుండి ఫలితాలు
న్యూఢిల్లీ, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): దేశంలో అధికార, ప్రతిపక్ష కూటములు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించిన ‘మహా’ యుద్థానికి తెరపడింది. మహారాష్ట్రతోపాటు ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటర్లు ఈవీఎంల్లో నిక్షిప్తం చేసిన తీర్పు శనివారం వెలువడనుంది. ఏ రాష్ట్రంలో అధికార పీఠం ఎవరిదో శనివారం మధ్యాహ్నానికే తేలిపోనుంది!! అయితే.. మరాఠా గడ్డపై బీజేపీకి అత్యధిక అసెంబ్లీ సీట్లు దక్కనున్నాయని, అక్కడ అధికార పీఠం మహాయుతి కూటమికే దక్కుతుందని.. కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాఢీ కూటమికి భంగపాటు తప్పదని.. అటు గనుల గడ్డ ఝార్ఖండ్‌లోనూ ఎన్డీయే కూటమిదే గెలుపని అత్యధిక సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైంది. మహారాష్ట్రలో మొత్తం 288 శాసనసభ నియోజకవర్గాలకు ఒకేసారి పోలింగ్ జరగ్గా.. 81 స్థానాలున్న ఝార్ఖండ్‌లో నవంబరు 13న 43 స్థానాలకు, రెండో దశలో భాగంగా 38 స్థానాలకు బుధవారం పోలింగ్ జరిగింది. కడపటి వార్తలందే సమయానికి మహారాష్ట్రలో 65.02%.. ఝార్ఖండ్‌లో 68.45% పోలింగ్ నమోదైంది. మహారాష్ట్రలో 2019 ఎన్నికల కంటే (61.6%) ఎక్కువ శాతం పోలింగ్ ఈసారి నమోదవుతుందని అధికారులుఅంచనా వేస్తున్నారు. ఆ రాష్ట్రంలో.. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ, నగర ప్రాంతాల్లో ఓటింగ్ శాతం చాలా తక్కువగా నమోదైంది.ముంబై (49%), పుణె (54.1%), ఠాణే (49.9%) వంటి నియోజకవర్గాలతో పోలిస్తే.. వామపక్ష తీవ్రవాద ప్రభావం ఎక్కువగా ఉన్న గడ్చిరోలి జిల్లాలో 69.6% పోలింగ్ నమోదు కావడం గమనార్హం.
అసెంబ్లీ ఎన్నికలతోపాటు.. నాందేడ్ లోక్‌సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కడపటి వార్తలందే సమయానికి 53.8ు పోలింగ్ నమోదైంది. మహారాష్ట్రలో గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత.. ప్రాంతీయ పార్టీలైన శివసేన, ఎన్సీపీ చీలిపోయి చెరో వర్గం బీజేపీ, కాంగ్రె్‌సతో జట్టు కట్టడంతో ఈ ఎన్నికలు రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. బీజేపీ, శివసేన(ఏక్‌నాథ్ షిండే), ఎన్‌సీపీ (అజిత్ పవార్) పార్టీలతో కూడిన మహాయుతి.. కాంగ్రెస్, శివసేన (ఉద్దవ్‌ఠాక్రే), ఎన్‌సీపీ(శరద్ పవార్) పార్టీలతో కూడిన మహా వికాస్ అఘాఢీ కూటములు నువ్వా నేనా అన్నట్టు తలపడ్డాయి.
దేశ ఆర్థిక రాజధాని ముంబైని కలిగి ఉన్న మహారా్ట్రలో గెలుపును జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పోరాడాయి. ఈ క్రమంలో.. మహారాష్ట్రలో మహిళా ఓటర్లను ఆకర్షించడానికి మహాయుతి ప్రభుత్వం తెచ్చిన ‘లాడ్లీ బెహనా యోజన’ గేమ్ చేంజర్‌గా మారిందని... హిందూ ఓటర్లను ఏకం చేయడమే లక్ష్యంగా ‘బటేంగేతో కటేంగే.. ఏక్ రహేంగేతో నేక్ రహేంగే (విడిపోతే పడిపోతాం.. కలిసుంటే క్షేమంగా ఉంటాం)’ అంటూ విస్తృతంగా ప్రచారం చేసిన నినాదం పనిచేసిందని సర్వే సంస్థలు తెలిపాయి. మొత్తమ్మీద.. ఐదు నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో మహారాష్ట్ర ఓటర్లు భిన్నమైన తీర్పు ఇవ్వబోతున్నారని 3-4 సంస్థలు మినహా అన్ని ప్రముఖ సర్వే సంస్థలూ తేల్చి చెప్పాయి. చాలా సంస్థలు.. ఎక్కువ సీట్లు బీజేపీకి దక్కనున్నట్టు వెల్లడించాయి. లోక్‌షాహి మరాఠీ రుద్ర, దైనిక్ భాస్కర్ ఎగ్జిట్ పోల్స్ హంగ్ అసెంబ్లీ ఏర్పడే అవకాశం ఉందని తెలపగా.. ఎలక్టోరల్ ఎడ్జ్ సంస్థ 150 సీట్లతో మహా వికాస్ అఘాఢీ కూటమి విజయం సాధిస్తుందని పేర్కొనడం విశేషం.
గత ఎగ్జిట్ పోల్స్ ఇలా..
ఒకటి రెండు సర్వే సంస్థలు మినహా దాదాపు అన్ని సంస్థలూ ఈ ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ కూటమిదే గెలుపని ప్రకటించాయి సరే.. మరి 2019లో ఆయా సంస్థల సర్వేలు ఎంతవరకూ నిజమయ్యాయి? అంటే.. ఇండియా టుడే-యాక్సిస్ సంస్థ ఎగ్జిట్ పోల్స్ అసలు ఫలితాలకు దగ్గరగా వచ్చాయి. బీజేపీ శివసేన కూటమికి 166 నుంచి 194 సీట్లు వస్తాయని ఆ సంస్థ అంచనా వేయగా.. ఆ రెండు పార్టీలకూ కలిపి 161 సీట్లు వచ్చాయి! అలాగే.. కాంగ్రెస్, ఎన్సీపీ కూటమికి 72 నుంచి 90 సీట్లు వస్తాయని పేర్కొనగా 98 సీట్లు వచ్చాయి! మిగతా అన్ని సంస్థలూ ఎన్డీయే కూటమికి 200కు పైగా, యూపీఏ కూటమికి 70లోపు సీట్లు వస్తాయని వేసిన అంచనాలు వాస్తవ ఫలితాలతో సరిపోలలేదు. ఝార్ఖండ్ విషయానికి వస్తే 2019లో ఆ రాష్ట్రంలో యూపీఏ (కాంగ్రెస్, జేఎంఎం) కూటమికి 43 సీట్లు, బీజేపీకి 27 సీట్లు వస్తాయని ఇండియాటుడే-యాక్సిస్ సర్వే అంచనా వేయగా.. యూపీఏ కూటమికి 46 సీట్లు, బీజేపీకి 25 వచ్చాయి. టైమ్స్‌నౌ కూడా వాస్తవ ఫలితాలకు దగ్గరగానే తెలిపింది. యూపీఏ కూటమికి 44 సీట్లు, బీజేపీకి 28 వస్తాయని ఆ సంస్థ ఎగ్జిట్‌పోల్‌లో వెల్లడైంది.
ఝార్ఖండ్‌లోనూ..
ఝార్ఖండ్‌లో ఎన్డీయే ఈసారి హేమంత్ సొరెన్ ప్రభుత్వాన్ని ఓడించడం ఖాయమని యాక్సిస్ మై ఇండియా సర్వే సంస్థ తప్ప మినహా అన్ని సంస్థల ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడైంది. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్‌జేడీ, సీపీఐ(ఎంఎల్)తో కూడిన ‘ఇండియా’ కూటమి.. బీజేపీ, ఏజేఎ్‌సయూ, జేడీయూ, ఎల్‌జేపీతో కూడిన ఎన్డీయే కూటమి ఈ ఎన్నికల్లో పోటాపోటీగా తలపడ్డాయి. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపినట్లు పీపుల్స్ పల్స్ సంస్థ తెలిపింది. అదే సమయంలో.. 14 శాతానికి పైగా ఉన్న ముస్లింలు, 4 శాతానికి పైగా ఉన్న క్రైస్తవులు ఇండియా కూటమికి మద్దతు తెలిపినట్టు వెల్లడించింది.
Updated Date - Nov 21 , 2024 | 05:48 AM