Ex-PM Sheikh Hasina : బంగ్లాలో అధికార మార్పునకు అమెరికా కుట్ర
ABN, Publish Date - Aug 12 , 2024 | 04:51 AM
బంగ్లాదేశ్‌లో అధికార మార్పునకు అమెరికా కుట్ర పన్నిందని ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా తీవ్ర ఆరోపణలు చేశారు. బంగ్లాలో తిరుగుబాటు, అల్లర్ల వెనుక కూడా అగ్రరాజ్యం హస్తం ఉందన్నారు.
మాజీ ప్రధాని షేక్ హసీనా తీవ్ర ఆరోపణలు
న్యూఢిల్లీ, ఆగస్టు 11: బంగ్లాదేశ్‌లో అధికార మార్పునకు అమెరికా కుట్ర పన్నిందని ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా తీవ్ర ఆరోపణలు చేశారు. బంగ్లాలో తిరుగుబాటు, అల్లర్ల వెనుక కూడా అగ్రరాజ్యం హస్తం ఉందన్నారు. ప్రధాని పదవికి రాజీనామా చేసి ఢాకాలోని నివాసం నుంచి వెళ్లే ముందు జాతినుద్దేశించి ఈ అంశంపై ప్రసంగించాలని ఆమె భావించారు. అయితే ఆమెకు ఆ అవకాశం రాలేదు.
ప్రస్తుతం భారత్‌లో ఉన్న ఆమె.. తన సన్నిహితులతో పంచుకున్న ఆ ప్రసంగ పాఠాన్ని ఓ జాతీయ మీడియా చానెల్ బహిర్గతం చేసింది. ‘‘మృతదేహాల ఊరేగింపు చూడాల్సిన అవసరం రాకూడదనే రాజీనామా చేశాను. విద్యార్థుల మృతదేహాలపై వారు అధికారంలోకి రావాలనుకున్నారు.
అందుకు నేను అనుమతించలేదు.సెయింట్ మార్టిన్ ద్వీపంపై సార్వభౌమత్వాన్ని అప్పగించి బంగాళాఖాతంపై అమెరికా ఆధిపత్యాన్ని చెలాయించడానికి అనుమతించి ఉంటే ఆధికారంలో కొనసాగి ఉండేదాన్ని. దయచేసి రాడికల్స్ చేతిలో మోసపోవద్దు’ అని దేశ ప్రజలను ఆమె వేడుకున్నారు.
‘ఒకవేళ నేను బంగ్లాదేశ్‌లోనే ఉండి ఉంటే మరింతమంది ప్రాణాలు పోయి ఉండేవి. మరిన్ని వనరులు ధ్వంసమయ్యేవి. అందుకే నా అంత నేనే రాజీనామా చేశా. మీరే నా బలం. మీరు వద్దనుకున్నారు కాబట్టి వెళ్లిపోతున్నాను’ అని బంగ్లా ప్రజలను ఉద్దేశించి హసీనా పేర్కొన్నారు. త్వరలోనే తాను బంగ్లాదేశ్‌కు వెళ్తానని స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ క్షేమం కోసం భగవంతుడిని ప్రార్థిస్తానని చెప్పారు. నిరసనలో ఉన్న విద్యార్థులను రజాకార్లు అని తానెప్పుడూ సంబోధించలేదన్నారు.
అల్ కాయిదా శుభాకాంక్షలు
షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చివేసినందుకు బంగ్లాదేశ్ ప్రజలను అభినందిస్తూ అల్ కాయిదా ఉగ్రవాద సంస్థ తాజాగా 12 పేజీల ప్రకటన విడుదల చేసింది. దీన్ని ఈ ప్రాంతంలో ఇస్లామిస్టులు, జిహాదిస్టుల విజయంగా అభివర్ణించింది. ఇస్లామిస్టులు కొత్త ప్రభుత్వంలో భాగస్వాములయ్యే బదులు దేశంలో పూర్తి షరియా పాలన తీసుకొచ్చేందుకు ప్రయత్నించాలని ఏక్యూఐఎ్‌స(అల్ కాయిదా భారత ఉపఖండం) చీఫ్ ఒసామా మసూద్ సూచించారు.
మరోవైపు... గ్రామీణ టెలికాం కార్మికులు, ఉద్యోగుల సంక్షేమ నిధిని దుర్వినియోగం చేసినట్లు అవినీతి నిరోధక కమిషన్ ఇదివరకు దాఖలు చేసిన కేసు నుంచి బంగ్లా ప్రభుత్వ ప్రధాన సలహాదారు మొహమ్మద్ యూన్‌సకు విముక్తి లభించింది. ఇదిలా ఉండగా, బంగ్లాదేశ్ నుంచి భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన 11 మందిని బీఎ్‌సఎఫ్ అదుపులోకి తీసుకుంది. పశ్చిమబెంగాల్‌లో ఇద్దరిని, త్రిపురలో ఇద్దరిని, మేఘాలయలో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.
Updated Date - Aug 12 , 2024 | 04:51 AM