Farmers Protest: ఢిల్లీ వైపు కొనసాగుతున్న రైతుల నిరసన.. మళ్లీ అడ్డుకుంటున్న పోలీసులు
ABN, Publish Date - Dec 08 , 2024 | 01:32 PM
ఇవాళ మళ్లీ పంజాబ్ రైతుల బృందం తమ డిమాండ్లతో ఢిల్లీకి పాదయాత్ర చేస్తోంది. ఈ క్రమంలో రైతులను ఢిల్లీ వైపు రాకుండా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ఢిల్లీ-హర్యానా శంభు సరిహద్దు వద్ద ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది.
ఈరోజు కూడా దేశ రాజధాని ఢిల్లీ (Delhi) వైపు రైతుల పాదయాత్ర ప్రారంభమైంది. 101 మంది రైతుల బృందం శంభు సరిహద్దు నుంచి బయలుదేరినప్పుడు, వారు భద్రతా దళాలను ఎదుర్కొన్నారు. ఆ క్రమంలో రైతులు, భద్రతా దళాల మధ్య పరిస్థితి ఆందోళకరంగా మారింది. రైతుల గుర్తింపు కార్డులు చూపించాలని హర్యానా పోలీసులు కోరారు. 101 మంది రైతులు ఢిల్లీ వెళ్ళేందుకు అభ్యంతరం లేదు. కానీ ఢిల్లీ వెళ్లే రైతులు కాకుండా ఎక్కువమంది వెళ్తున్నారని పేర్కొన్నారు. ఆ క్రమంలో అనేక మంది ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు. దీంతో శంభు సరిహద్దు వద్ద పరిస్థితి చాలా ఉద్రిక్తంగా మారిపోయింది.
డిమాండ్లు ఇవే
హర్యానా భద్రతా సిబ్బంది టియర్ గ్యాస్ షెల్స్ కారణంగా 16 మంది రైతులు గాయపడ్డారని రైతు నేతలు పేర్కొన్నారు. వారిలో ఒకరు వినికిడి శక్తి కోల్పోయారని అన్నారు. పంటల మద్దతు ధరకు చట్టబద్ధత, రైతు రుణమాఫీ, రైతులకు, రైతు కులీలకు పెన్షన్లు, విద్యుత్ చార్జీల పెంపు నిలుపుదల వంటి డిమాండ్లను రైతులు కోరుతున్నారు. దీంతోపాటు భూసేకరణ చట్టంలో మార్పులు, 2021 లఖిమ్ పూర్ ఖేరి ఘటనలో మృతి చెందిన రైతులకు పరిహారం ఇవ్వాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో తమ సమస్యల పరిష్కారానికి చర్చలు ప్రారంభించాలని రైతు నేతలు కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నారు.
కేంద్రం స్పందించదా..
పంజాబ్ భగవంత్ మాన్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కుమ్మక్కయ్యిందని ఈ సందర్భంగా రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ అన్నారు. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ రావాలని, ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. మరోవైపు కిసాన్ మజ్దూర్ మోర్చా, సంయుక్త కిసాన్ మోర్చా చేపట్టిన నిరసన 300వ రోజుకు చేరింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఇంకా చర్చలకు సిద్ధంగా లేదని పంధేర్ వెల్లడించారు. రైతుల నిరసన నేపథ్యంలో శంభు సరిహద్దు, NH 44 వద్ద హర్యానా, పంజాబ్ పోలీసులు అదనపు బలగాలను మోహరించారు.
ఇనుప బారిగేట్ల ఏర్పాటు
దీంతోపాటు అంబాల జిల్లాల్లో బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 163 విధించారు. 101 మంది రైతుల బృందం ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ వైపు పాదయాత్రను ప్రారంభించింది. శంభు సరిహద్దు వద్ద రైతులను అడ్డుకునేందుకు కాంక్రీట్ దిమ్మలు, ఇనుప బారిగేట్లను ఇప్పటికే ఏర్పాటు చేయించారు. ఢిల్లీ వైపు నిరసనకు అనుమతి లేకపోవడంతో పోలీసులు, నిరసనకారుల మధ్య వాగ్వాదం మొదలై, క్రమంగా టియర్ గ్యాస్ ప్రయోగించే స్థాయికి చేరుకుంది. ఈ పరిస్థితి క్రమంగా పెరుగుతోంది.
ఇవి కూడా చదవండి:
Personal Finance: నెలకు రూ. 5 వేలు సేవ్ చేస్తే.. రూ. 2 కోట్ల కోసం ఎన్నేళ్లు కట్టాలి..
Personal Finance: మీ అప్పులను ఈ 7 మార్గాల ద్వారా ఈజీగా తీర్చుకోండి..
Bitcoin Investment: ఇది కదా లక్కంటే.. అప్పటి 100 రూపాయల పెట్టుబడి, ఇప్పుడు 1.7 కోట్లు
Bank Holidays: ఈ నెలలో 17 రోజులు బ్యాంకులు క్లోజ్.. ఎప్పుడెప్పుడంటే..
Read More National News and Latest Telugu News
Updated Date - Dec 08 , 2024 | 01:52 PM