Rajya Sabha: ఖర్గే, ధన్‌ఖడ్ మధ్య సరదా సంభాషణ.. పెద్దల సభలో నవ్వులే నవ్వులు...
ABN, Publish Date - Jul 01 , 2024 | 04:10 PM
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో భాగంగా రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మధ్య వాడివేడి సంభాషణ జరిగిన రెండ్రోజులకే వారి మధ్య సరదా సంభాషణ చోటుచేసుకుంది. దీంతో సభలో నవ్వులు వెల్లివిరిసాయి.
న్యూఢిల్లీ: పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో భాగంగా రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ (Jagdeep Dhankar), కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) మధ్య వాడివేడి సంభాషణ జరిగిన రెండ్రోజులకే వారి మధ్య సరదా సంభాషణ చోటుచేసుకుంది. దీంతో సభలో నవ్వులు వెల్లివిరిసాయి. రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై ఖర్గే ప్రసంగం సందర్భంగా రాజ్యసభలో సోమవారం ఈ సరదా సంభాషణ చోటుచేసుకుంది.
Rajya Sabha: మాది సామాన్యూడి మాట, మోదీది మనసులో మాట: ఖర్గే
ధన్యవాద తీర్మానంపై చర్చకు ఖర్గే ఉపక్రమిస్తూ, మోకాళ్ల నొప్పుల కారణంగా ఎక్కువ సేపు నిలబడలేకపోతున్నానని, చైర్మన్ అనుమతిస్తే కూర్చుని మాట్లాడతానని విజ్ఞప్తి చేశారు. ఇందుకు ధన్‌ఖడ్ సుముఖత వ్యక్తం చేశారు. సభలో ప్రసంగించేటప్పుడు సౌకర్యవంతంగా ఉండేలా చూసుకోండని, ఇబ్బంది అనిపిస్తే కూర్చుని మాట్లాడవచ్చని, నిర్ణయం మీదేనని అన్నారు. ఖర్గే తిరిగి స్పందిస్తూ, కూర్చుని మాట్లాడితే నిలబడి మాట్లాడినంత పట్టుగా ఉండదని అన్నారు. ఆయన మాటలతో చైర్మన్ ఏకీభవిస్తూ, ఈ విషయంలో మీకు నేను సాయం చేస్తానని అన్నారు. దీనికి వెంటనే ఖర్గే బదులిస్తూ, కొన్ని సార్లు మీరు (చైర్మన్) మాకు సహకరిస్తుంటారని, దాన్ని తాము ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటామని చెప్పడంతో సభలో నవ్వులు వెల్లివిరిసాయి. దీంతో ఖర్గే తిరిగి స్పందిస్తూ.. ''వాళ్లు ఎందుకు నవ్వుతున్నారు? తమ నవ్వులతో సభ్యులు నన్ను తప్పుదారి పట్టిస్తున్నారు. వారికి చైర్మన్ కూడా తోడయ్యారు'' అని వ్యాఖ్యానించారు. ధన్‌ఖడ్ ఎక్కడా తగ్గకుండా, తాను కూడా ఒక్కోసారి అలాగే మాట్లాడుతుంటానని చమత్కరించారు. ఇద్దరు నాయకుల మధ్య సరదా సంభాషణ చూసి సభలోనే ఉన్న సోనియాగాంధీ సైతం చిరునవ్వులు చిందించారు. దీంతో సభలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.
మరిన్ని జాతీయ వార్తల కోెసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Jul 01 , 2024 | 04:11 PM