Crime News: లవర్ కోసం వెళ్లి చివరికి వారి చేతిలో చిక్కింది.. ఇలాంటి పరిస్థితి ఎవ్వరికీ రావొద్దు..
ABN, Publish Date - Oct 29 , 2024 | 06:49 PM
జబల్‌పూర్ ప్రాంతానికి చెందిన ఓ బాలిక తన ప్రేమికుడు రాహుల్‌తో కలిసి గతంలో ఇంటి నుంచి పారిపోయింది. అయితే ఆ సమయంలో చిన్నారి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెను రక్షించి, యువకుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
మధ్యప్రదేశ్: మధ్యప్రదేశ్ రాష్ట్రం తికమ్‌ఘర్ ప్రాంతంలో దారుణ ఘటన వెలుగు చూసింది. ప్రేమికుడి కోసం ఇంటి నుంచి పారిపోయిన బాలికపై 35 సార్లు అత్యాచారం జరిగిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. లవర్ స్నేహితుడే ఆమెను అక్రమ రవాణా ముఠాకు అప్పగించి సొమ్ము చేసుకున్నాడు. చివరికి ప్రియుడిని కలవకుండానే దుండగుల చేతిలో చిన్నారి బలైపోయింది. 15 ఏళ్ల బాలికను 35 ఏళ్ల వ్యక్తి కొనుగోలు చేసిన దారుణ ఉదంతం ఇది. ముఠా చేతుల నుంచి తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. చివరికి తండ్రి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు మానవ అక్రమ రవాణా ముఠాను అరెస్టు చేసి బాలికను రక్షించారు.
జబల్‌పూర్ ప్రాంతానికి చెందిన ఓ బాలిక తన ప్రేమికుడు రాహుల్‌తో కలిసి గతంలో ఇంటి నుంచి పారిపోయింది. అయితే ఆ సమయంలో చిన్నారి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెను రక్షించి, యువకుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. అరెస్టయిన రెండు వారాల తర్వాత ఆమె ప్రియుడు జైలు నుంచి విడుదలయ్యాడు. అప్పట్నుంచీ రాహుల్ ఆమెకు దూరంగా ఉంటూ వచ్చాడు. అయితే సెప్టెంబర్ 12న బాలిక ఆ యువకుడిని కలిసేందుకు మళ్లీ ఇంటి నుంచి పారిపోయింది. ఈసారి పరిస్థితులు గతానికి భిన్నంగా మారిపోయాయి. భేదాఘాట్ ప్రాంతానికి చేరుకున్న బాలిక రాహుల్‌కు ఫోన్ చేసింది. అయితే ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో అతని స్నేహితుడు రాజాకు ఫోన్ చేసింది. రాహుల్ భయపడ్డాడని, ఇక నిన్ను కలవడని రాజా చెప్పాడు. బాలికకు ఏం చేయాలో అర్థం కాక తాను తిరిగి ఇంటికి వెళ్లలేనని చెప్పింది. దీంతో రాజా ఆమెకు ఆశ్రయం కల్పించాడు.
అయితే తన వద్ద బాలిక ఉందనే విషయాన్ని మానవ అక్రమ రవాణా ముఠాకు చెందిన భార్యభర్తలు శశి, పూరాణ్‌లకు రాజా చెప్పాడు. ఆమెను వారికి అప్పగించాడు. సెప్టెంబరు 21న బాలికను చూసేందుకు ఓ వ్యక్తిని శశి, పురాణ్ తీసుకువచ్చారు. అక్కడ ఏం జరుగుతోందో ఆమెకు అర్థం కాలేదు. అనంతరం ఆ రోజు రాత్రి తికమ్‌ఘర్‌కు చెందిన ఓ వ్యక్తి చిన్నారిని కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు శశి తన భర్త పూరన్, సూరజ్, రాజాతో చెప్పింది. ఈ విషయాన్ని బాలిక చాటుగా విన్నది. వెంటనే అక్కడ్నుంచి పారిపోవాలని ప్లాన్ చేసింది. సమయం లేకపోవడంతో ఆమె ప్రయత్నాలు ఫలించలేదు. మరుసటి రోజే (సెప్టెంబర్ 22) ఆమెను సూరజ్, రాజా, శశి, పురాణ్‌లు తికమ్‌ఘర్‌కు చెందిన ప్రకాశ్‌కు రూ.95వేలకు అమ్మేశారు. అనంతరం వారంతా కలిసి బాలికను ఇష్టం లేకపోయినా గ్రామ దేవాలయంలో అతనితో వివాహం జరిపించారు.
నిందితుడు ప్రకాశ్ బాలికను తీసుకుని తికమ్‌ఘర్‌కు వెళ్లిపోయాడు. అనంతరం ఆమెపై మద్యం మత్తులో 35 సార్లు అత్యాచారం చేశాడు. అత్యాచారం చేసిన తర్వాత ఓసారి అతను మత్తులో నిద్రలోకి జారుకున్నాడు. దీంతో బాలిక తన ఫోన్ నుంచి తండ్రికి కాల్ చేసింది. జరిగిన విషయం మెుత్తం చెప్పింది. చిన్నారి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను నిందితుడి నుంచి రక్షించారు. ప్రకాశ్‌తోపాటు శశి, పురాణ్, రాజా, సూరజ్‌లను అరెస్టు చేశారు. అయితే కేసు దర్యాప్తులో పోలీసులు సంచలన విషయాలు గుర్తించారు. వీరంతా ఇప్పటివరకూ 15మందికి పైగా బాలికలను కిడ్నాప్ చేశారని కనిపెట్టారు. వారిని డబ్బులకు పలువురికి అమ్మేశారని విచారణలో తేల్చారు. దీంతో మిగిలిన బాలికలను రక్షించేందుకు, నిందితులను అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
Updated Date - Oct 29 , 2024 | 06:50 PM