Share News

Sub urban Trains: గుడ్ న్యూస్.. త్వరలో మరో 250 సబ్‌అర్బన్ రైళ్లు

ABN , Publish Date - Jul 25 , 2024 | 08:23 AM

రాబోయే ఐదేళ్లలో మహారాష్ట్ర రాజధాని ముంబయి(Mumbai) కోసం భారతీయ రైల్వే ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ముంబయికి 250 కొత్త సబర్బన్ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది.

Sub urban Trains: గుడ్ న్యూస్.. త్వరలో మరో 250 సబ్‌అర్బన్ రైళ్లు

ముంబయి: రాబోయే ఐదేళ్లలో మహారాష్ట్ర రాజధాని ముంబయి(Mumbai) కోసం భారతీయ రైల్వే ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ముంబయికి 250 కొత్త సబర్బన్ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది. వీటితోపాటు రైలు నెట్‌వర్క్‌ను పునరుద్ధరించడం, ప్రయాణాన్ని సులభతరం చేయడానికి కొత్త మెగా టెర్మినల్‌లను నిర్మించనున్నారు. ముంబయితోపాటు నగర చుట్టుపక్కల ప్రాంతాల్లో రవాణాను మెరుగుపరిచే ప్రయత్నాలలో భాగంగా రైళ్ల క్రాస్ మూవ్‌మెంట్‌ను తగ్గించడానికి సబర్బన్ నెట్‌వర్క్‌ను రీడిజైన్ చేయాలని భావిస్తున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.

ఇక రెండు రైళ్ల మధ్య దూరాన్ని ప్రస్తుతం ఉన్న 180 సెకన్ల నుంచి 150 సెకన్లకు తగ్గించేందుకు కొత్త టెక్నాలజీని అమలు చేయాలని చూస్తున్నట్లు మంత్రి తెలిపారు. సబర్బన్, సుదూర రైలు సర్వీసులను వేరు చేయడంపై దృష్టిసారించినట్లు తెలిపారు.


ముంబయి సబర్బన్ వ్యవస్థ ప్రతిరోజూ 3,200 సర్వీసులను నడుపుతోంది. 75 లక్షల మంది ఇందులో ప్రయాణిస్తున్నారు. ముంబయిలోని కోస్టల్ రోడ్డు అభివృద్ధి, మెట్రో రైలు పనులను దశలవారీగా అమలు చేసి దేశ ఆర్థిక రాజధానిలో రవాణాను మరింత సులభతరం చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.

వీటితోపాటు నవీ ముంబయిలోని పన్వెల్-కలాంబోలి వద్ద కొత్త కోచింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారు. ఇది సుదూర రైళ్లకు టెర్మినల్‌గా ఉపయోగపడుతుంది. పూణే రైల్వే స్టేషన్‌లో రద్దీని తగ్గించే లక్ష్యంతో హడప్‌సర్, ఉరులి, ఖడ్కీ, శివాజీనగర్‌లలో కొత్త టెర్మినళ్ల నిర్మాణాలను కూడా రైల్వే మంత్రి వైష్ణవ్ ప్రస్తావించారు.


రూ.2,62,200 కోట్ల కేటాయింపు..

రైల్వే బడ్జెట్‌లో కొత్త లైన్ల నిర్మాణానికి రికార్డు స్థాయిలో రూ. 2,62,200 కోట్లు కేటాయించారు. ఇందులో రూ. 1,08,000 కోట్లు భద్రతా సంబంధిత పనులకు కేటాయించారు. కేంద్ర బడ్జెట్‌లో మహారాష్ట్రలోని రైల్వే ప్రాజెక్టులకు రూ.15,940 కోట్లు ఇచ్చినట్లు రైల్వే మంత్రి వైష్ణవ్ ప్రకటించారు. రాష్ట్రంలో ప్రస్తుతం రూ.81,000 కోట్ల విలువైన పనులు కొనసాగుతున్నాయని, రైలు నెట్‌వర్క్‌ పూర్తి విద్యుదీకరణ సాధించామని ఆయన వెల్లడించారు. అమృత్ భారత్ స్టేషన్ చొరవ కింద, మహారాష్ట్ర అంతటా 128 స్టేషన్లను బాగు చేస్తోంది.


వివిధ రాష్ట్రాల్లో రైల్వే పనులకు ఇలా..

ఉత్తరప్రదేశ్: రూ. 19,848 కోట్లు

మధ్యప్రదేశ్: రూ. 14,738 కోట్లు

పశ్చిమ బెంగాల్: రూ. 13,941 కోట్లు

బీహార్: రూ.10,033 కోట్లు

జార్ఖండ్: రూ.7,302 కోట్లు

For Latest News and National News click here

Updated Date - Jul 25 , 2024 | 08:23 AM