Heavy Rains: మళ్ళీ వర్షబీభత్సం.. ప్రమాద స్థాయిలో జలాశయాలు
ABN, Publish Date - Dec 13 , 2024 | 11:12 AM
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మన్నార్ జలసంధి తీరం వైపు దూసుకురావటంతో రాష్ట్రమంతటా బుధవారం అర్ధరాత్రి నుండి గురువారం సాయంత్రం వరకూ భారీ వర్షం కురిసింది.
- 7 జిల్లాలకు వరద హెచ్చరిక
చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మన్నార్ జలసంధి తీరం వైపు దూసుకురావటంతో రాష్ట్రమంతటా బుధవారం అర్ధరాత్రి నుండి గురువారం సాయంత్రం వరకూ భారీ వర్షం కురిసింది. బలపడిన అల్పపీడనం ప్రభావంతో ఈశాన్య రుతుపవనాలు తీవ్ర రూపం దాల్చటంతో రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం ఓ మోస్తరుగా వర్షాలు కురవనున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న తూర్పు హిందూ మహాసముద్రంలో మంగళవారం ఏర్పడిన అల్పపీడనం, బుధవారం బలపడి నైరుతి, ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా తీవ్ర అల్పపీడనంగా మారింది.
ఈ వార్తను కూడా చదవండి: IMD: త్వరలో మరో 2 అల్పపీడనాలు..
ఇది నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక - తమిళ తీరంమీదుగా పయనించి గురువారం పశ్చిమ వాయువ్య దిశగా తీరం వైపు దూసుకువస్తుండటంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లోనూ, పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాల్లో ఉదయం నుంచే వర్షాలు కురిశాయి. కడలూరు, మైలాడుదురై, నాగపట్టినం(Kadalore, Mylapore, Nagapattinam), తంజావూరు, తిరువారూరు, పుదుకోట జిల్లాల్లో కొన్ని చోట్ల, కారైక్కాల్ ప్రాంతాల్లోనూ కొన్ని చోట్ల భారీగాను, మరికొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. శివగంగ, రామనాథపురం, తిరుచ్చి, పెరంబలూరు, అరియలూరు, కళ్ళకురిచ్చి, విల్లుపురం, చెంగల్పట్టు, కాంచీపురం, చెన్నై, తిరువళ్లూరు జల్లాల్లో కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిశాయి. రాజధాని నగరం చెన్నైలో బుధవారం సాయంత్రం తేలికపాటి జల్లులతో ప్రారంభమైన వర్షం రాత్రి తొమ్మిది గంటల తర్వాత ఊపందుకుంది. నగరంలో పలుచోట్ల అర్ధరాత్రి నుండి భారీ వర్షాలు కురిశాయి.
బలపడిన అల్పపీడనం
బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం కారణంగా ఏడు జిల్లాల్లో వరద పరిస్థితులు నెలకొంటాయని భారత వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. ఆ మేరకు చెన్నై, కాంచీపురం, తిరువల్లూరు, విల్లుపురం, వేలూరు, కళ్ళకురిచ్చి, నాగపట్టినం జిల్లాల్లో కుండపోతగా కురిసిన వర్షాలకు ప్రధాన జలాశయాల్లో నీటిమట్టం ప్రమాద స్థాయికి చేరుకోనుండటంతో వరదలు సంభవించనున్నాయన్నారు. అంతే కాకుండా పల్లపు ప్రాంతాలన్నీ నీట మునిగి దీవులను తలపిస్తాయన్నారు. 20 జిల్లాల్లో శుక్రవారం భారీగా, ఓ మోస్తరుగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఆ మేరకు చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్పట్టు, విల్లుపురం, కడలూరు, మైలాడుదురై, తేని, మదురై, శివగంగ విరుదునగర్, రామనాథపురం, కన్నియాకుమారి, తిరువారూరు, నాగపట్టినం, తంజావూరు, పుదుకోట సహా మొత్తం 20 జిల్లాల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వివరించారు.
15 విమాన సర్వీసులకు అంతరాయం..
భారీ వర్షాల కారణంగా చెన్నై విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సిన మూడు విమానాలు, వివిధ నగరాల నుండి రావాల్సిన మరో మూడు విమానాలు మొత్తం ఆరు విమాన సర్వీసులు రద్దయ్యాయి. చెన్నై నుంచి తిరువనంతపురం, కొల్‌కతా, సిలిగురికి వెళ్లాల్సిన విమానాలు వర్షాల కారణంగా రద్దు చేశారు. అదే విధంగా చెన్నై రావాల్సిన మూడు విమానాలు కూడా రద్దయ్యాయి. షార్జా, దుబాయ్, శ్రీలంక, సింగపూరు తదితర దేశాలకు వెళ్ళాల్సిన అంతర్జాతీయ విమానాలు, అండమాన్, ఢిల్లీ ముంబయి, తిరుచ్చి, కోయంబత్తూరు, కొచ్చిన్ వెళ్ళాల్సిన విమానాలు సహా మొత్తం 15 విమానాలు ఆలస్యంగా బయలుదేరాయి.
ఇదిలా ఉండగా చెన్నై విమానాశ్రయం నుంచి ముంబయి వెళ్లే విమానంలో, కొచ్చిన్‌కు వెళ్లే విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. వేకువజాము 4.44 గంటలకు 160 మంది ప్రయాణికులు, 8 మంది సిబ్బందితో ముంబయికి బయలుదేరిన విమానం టేకాఫ్ చేస్తుండగా ఇంజన్‌లో సాంకేతిక లోపాన్ని గమనించిన పైలెట్ విమానాన్ని ఆపేశారు. మరమ్మతులు చేసిన తర్వాత ఆ విమానం ముంబయికి బయలుదేరింది. ఇదే విధంగా ఉదయం 6.30 గంటలకు కొచ్చిన్ బయల్దేరిన విమానం ఆకాశంలో ఉండగా యాంత్రిక లోపం ఏర్పడింది. పైలెట్ గమనించి కంట్రోలు రూమ్‌కు సమాచారం అందించి ఉదయం 7.15 గంటలకు అత్యవసరంగా ల్యాండింగ్ చేసి ప్రయాణికులను కాపాడారు. ఆ తర్వాత మరో విమానంలో ప్రయాణికులందరూ కొచ్చిన్ బయలుదేరారు.
డెల్టా జిల్లాల్లో కుంభవృష్టి...
కావేరి డెల్టా జిల్లాల్లోనూ గురువారం ఉదయం కుండ పోతగా వర్షాలు కురిశాయి. దీంలో ఆ జిల్లాల్లోని పంటలు నీటమునిగాయి. గురువారం వేకువజాము ఒంటి గంట నుంచి ఉదయం ఏడు గంటల వరకు ఈ జిల్లాల్లో భారీగా వర్షాలు కురిశాయి. తంజావూరు, తిరువారూరు, నాగపట్టినం, మైలాడుదురై తదితర జిల్లాల్లో కురిసిన వర్షాలకు జనజీవనం పూర్తిగా స్తంభించింది. తంజావూరు, తిరువారూరు జిల్లాలో కోతకు సిద్ధంగా ఉన్న వరిపంట నీట మునిగింది. చెరువులు, వాగులు నీటితో నిండి పొంగి ప్రవహిస్తున్నాయి. పల్లపు ప్రాంతాలు జలదిగ్బంధంలో కొట్టుమిట్టాడుతున్నాయి.
తీవ్రరూపం దాల్చిన రుతుపవనాలు..
బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం గురువారం మధ్యాహ్నం మన్నార్ జలసంధికి చేరువగా కదులుతుండటంతో రాష్ట్రమంతా విస్తారంగా వర్షాలు కురిశాయని భారత వాతావరణ పరిశోధన సంస్థ దక్షిణ మండల అధికారి బాలచంద్రన్ తెలిపారు. అల్పపీడనం కారణంగా ఈశాన్య రుతుపవనాలు తీవ్రరూపం దాల్చాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఈ రుతువపనాల ప్రభావంతో సాధారణ స్థాయికంటే 16 శాతం అధికంగా వర్షాలు కురిశాయని చెప్పారు. చెన్నై నుంగంబాక్కంలోని ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గురువారం ఉదయం కడలూరు జిల్లాల్లో 72 చోట్ల భారీ వర్షాలు కురిశాయని తిరునల్వేలి, తూత్తుకుడి తెన్‌కాశి, రాణిపేట, తిరువణ్ణామలై, కోయంబత్తూరు జిల్లాల్లోనూ ఓ మోస్తరు వర్షాలు కురిశాయని తెలిపారు.
రాజధాని నగరం చెన్నైకి సంబంధించినంతవరకు నెర్‌కుండ్రం వద్ద 10 సెం.మీ.లు, మీనంబాక్కంలో 8 సెం.మీలు, తరమణిలో 7 సెం.మీలు, పూందమల్లి 6 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు చెప్పారు. శుక్రవారం దక్షిణాది జిల్లాల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయన్నారు. బలపడిన అల్పపీడనం మన్నార్‌జలసంధి వద్ద తీరం వైపు కదులుతుండంతో సముద్రతీరం వైపు గంటకు 35 నుండి 45 కి.మీ.వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉండటంతో జాలర్ల మరో రెండు రోజులపాటు చేపలవేటకు వెళ్ళకూడదని హెచ్చరికలు జారీ చేసినట్లు బాలచంద్రన్ తెలిపారు.
ఈవార్తను కూడా చదవండి: Seethakka: చర్యలు తీసుకున్నా మీరు మారరా ?
ఈవార్తను కూడా చదవండి: సీఎం సారూ.. రుణమాఫీ చేసి ఆదుకోండి!
ఈవార్తను కూడా చదవండి: తెలంగాణ సంస్కృతిపై దాడి : బండి సంజయ్
ఈవార్తను కూడా చదవండి: అక్కా.. నేను చనిపోతున్నా
Read Latest Telangana News and National News
Updated Date - Dec 13 , 2024 | 11:12 AM