Himachal Pradesh: భారీ వర్షాలు.. ఒకరు మృతి, 32 మంది గల్లంతు
ABN, Publish Date - Aug 01 , 2024 | 09:45 AM
హిమాచల్ ప్రదేశ్‌లో కుంభవృష్టి వర్షాలతో వరద పోట్తెత్తింది. ఆ క్రమంలో సిమ్లా జిల్లాలోని రామ్‌పూర్‌లో సమేజ్ ఖాడ్ వద్దనున్న హైడ్రో ప్రాజెక్ట్ సమీపంలో ఆకస్మాత్తుగా కురిసిన భారీ వర్షంతో ఒకరు మృతి చెందగా.. 32 మంది గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సిమ్లా డిప్యూటీ కమిషనర్ అనుపమ్ కాశ్యప్ వెల్లడించారు.
సిమ్లా, ఆగస్ట్ 01: హిమాచల్ ప్రదేశ్‌లో కుంభవృష్టి వర్షాలతో వరద పోట్తెత్తింది. ఆ క్రమంలో సిమ్లా జిల్లాలోని రామ్‌పూర్‌లో సమేజ్ ఖాడ్ వద్దనున్న హైడ్రో ప్రాజెక్ట్ సమీపంలో ఆకస్మాత్తుగా కురిసిన భారీ వర్షంతో ఒకరు మృతి చెందగా.. 32 మంది గల్లంతయ్యారు. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు సిమ్లా డిప్యూటీ కమిషనర్ అనుపమ్ కాశ్యప్ వెల్లడించారు. అందుకోసం ఎన్డీఆర్ఎప్, ఎస్డీఆర్ఎఫ్, సీఐఎస్ఎఫ్ రంగంలోకి దింపామని వివరించారు. ఇక కూలులో ఈ రోజు తెల్లవారుజామున ఓ భవనం కుప్పకూలి.. పార్వతీ నదిలో కొట్టుకుపోయిందని తెలిపారు.
హిమాచల్‌ప్రదేశ్‌లో తాజా పరిస్థితులపై ఆ రాష్ట్ర సీఎం సుఖ్‌విందర్ సింగ్ సుక్కుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఫోన్ చేసి ఆరా తీశారు. హిమాచల్‌ప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందని ఈ సందర్భంగా సీఎంకు జేపీ నడ్డా భరోసా ఇచ్చారు. అలాగే రాష్ట్రంలో సహయక చర్యల్లో పాల్గొనాలని రాష్ట్ర బీజేపీ శ్రేణులకు జేపీ నడ్డా పిలుపు నిచ్చారు.
Also Read: ChandraBabu Govt: ఏపీఎండీసీ ఎండీ వెంకటరెడ్డిపై వేటు!
ఇక హిమాచల్‌ప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలో వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు సైతం పడే అవకాశముందని తెలిపింది. కూలు, సోలన్, సిమ్లా తదితర ప్రాంతాలతోపాటు కిన్నూరు జిల్లాలో కొండ చరియలు విరిగి పడే అవకాశాలున్నాయని హెచ్చరించింది. అలాగే బలమైన గాలులు వీస్తాయని.. దీంతో పంటలు, ఉద్యానవనాలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశాముందని చెప్పింది. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అవుతాయని పేర్కొంది.
Also Read: Wayanad Landslide: నేడు వయనాడ్‌లో పర్యటించనున్న రాహుల్, ప్రియాంక
దేశ రాజధాని ఢిల్లీలో..
మరోవైపు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కేరళ, ఢిల్లీలో సైతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం సాయంత్రం ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. దీంతో పలు ప్రాంతాలే కాదు.. పలు ముఖ్యమైన రహదారులు సైతం నీటిలో చిక్కుకు పోయాయి. ఇక వరద నీటిలో మునిగి ఇద్దరు మరణించారు. ఈ వర్షం కారణంగా ఢిల్లీ మహానగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ఆగస్ట్ 5 వరకు ఇదే తీరు..
అలాగే దేశ రాజధానిలోని స్కూళ్లకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో దాదాపు 10 విమానాలను ఢిల్లీ నుంచి ఇతర ప్రాంతాలకు మళ్లించారు. ఈ రోజు ఉదయం వరకు ఢిల్లీలో రెడ్ అలర్ట్‌ను వాతావరణ కేంద్రం జారీ చేసింది. అనంతరం మరో 24 గంటల పాటు అరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది. ఆగస్ట్ 5వ తేదీ వరకు న్యూఢిల్లీలో ఆడపాదడపా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
కేరళలో సైతం...
ఇంకోవైపు కేరళలో భారీ వర్షాల కారణంగా వయనాడ్ జిల్లాలో కొండ చరియలు విరిగి పడ్డాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య 170 దాటింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలుపుతున్నారు. అలాగే ఈ ఘటనలో గాయపడిన వారు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కేరళలో మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Read More National News and Latest Telugu News
Updated Date - Aug 01 , 2024 | 11:56 AM