Bengaluru: రూ. 20 కోసం ఆటో డ్రైవర్ గొడవ.. కట్ చేస్తే రూ. 30 వేలు లాస్..!
ABN, Publish Date - Sep 08 , 2024 | 10:00 PM
నగరానికి చెందిన ఓ మహిళ, ఆమె స్నేహితుడు ఓలాలో రెండు ఆటోలను బుక్ చేశారు. పీక్ అవర్ కావడంతో చెరో మొబైల్‌లో ఆటో బుక్ చేశారు. ఆమె స్నేహితుడు బుక్ చేసిన ఆటో ముందుగా వచ్చింది. దీంతో మహిళ తన మొబైల్‌లో చేసిన రైడ్‌ని క్యాన్సిల్ చేసింది. అప్పటికే ఆ ఆటో డ్రైవర్ ముత్తురాజ్ సదరు మహిళను సమీపించాడు.
బెంగళూరు, సెప్టెంబర్ 08: నగరానికి చెందిన ఓ మహిళ, ఆమె స్నేహితుడు ఓలాలో రెండు ఆటోలను బుక్ చేశారు. పీక్ అవర్ కావడంతో చెరో మొబైల్‌లో ఆటో బుక్ చేశారు. ఆమె స్నేహితుడు బుక్ చేసిన ఆటో ముందుగా వచ్చింది. దీంతో మహిళ తన మొబైల్‌లో చేసిన రైడ్‌ని క్యాన్సిల్ చేసింది. అప్పటికే ఆ ఆటో డ్రైవర్ ముత్తురాజ్ సదరు మహిళను సమీపించాడు. వారిద్దరూ వేరే ఆటో ఎక్కి వెళ్తుండగా గమనించాడు. వెంటనే వారిని వెంబడించి.. అడ్డుకున్నాడు. బుకింగ్ ఎందుకు క్యాన్సిల్ చేశావ్ అంటూ మహిళ పట్ల దుర్భాషలాడాడు. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. రైడ్ క్యాన్సిల్ చేస్తే డబ్బులు మీ అయ్య ఇస్తాడా? అంటూ రెచ్చిపోయాడు. దీంతో తాను పోలీస్ కంప్లైంట్ ఇస్తానంటూ మహిళ బెదిరించింది. డ్రైవర్ ముత్తురాజ్ మరింత రెచ్చిపోయాడు. ఆమె నుదిటన కొట్టి.. ఆమె ఫోన్‌ను లాక్కోపోయాడు. దీంతో బాధిత మహిళ డ్రైవర్ ముత్తురాజ్‌పై మాగడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. భారతీయ శిక్షాస్మృతి (భారతీయ న్యాయ సంహిత)లోని సెక్షన్ 74, 352 కింద 46 ఏళ్ల ఆటో డ్రైవర్ ఆర్ ముత్తురాజ్‌పై కేసు నమోదు చేశారు. అతన్ని కోర్టులో ప్రవేశపెట్టగా.. కీలక తీర్పునిచ్చింది. ఆటో డ్రైవర్‌కు నాలుగు రోజుల జైలు శిక్ష విధిస్తూ కోర్టు ఆదేశించింది. ఇక లాయర్ ఖర్చులు, బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు సుమారు రూ.30 వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. రూ. 20 కోసం పంచాయతీ.. రూ. 30 వేలు ఖర్చు తెచ్చిపెట్టింది. పైగా కేసు, జైలు శిక్ష, డ్రైవింగ్ లైసెన్స్ కూడా రద్దు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అరెస్టయిన ఓలా డ్రైవర్ ముత్తురాజ్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి సోమవారం వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. అతనికి బెయిల్ వచ్చినా.. ప్రక్రియ పూర్తయ్యే వరకు అంటే బుధవారం వరకు వేచి ఉండాల్సి ఉంటుంది. పైగా చట్టపరమైన ప్రక్రియ పూర్తయ్యే వరకు డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేశారు.
Updated Date - Sep 08 , 2024 | 10:00 PM