Railways: సీనియర్ సిటిజన్లకు శుభవార్త.. మీ కోసం కొత్త రూల్స్.. ఇకపై రైళ్లలో మీరు..
ABN, Publish Date - Sep 30 , 2024 | 04:24 PM
భారతీయ రైల్వే సీనియర్ సిటిజన్ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. లోయర్ బెర్త్‌ల రిజర్వేషన్ కోసం ప్రత్యేక నిబంధనలు రూపొందించింది. దీని వల్ల 60ఏళ్లు పైబడిన పురుషులు, 45 ఏళ్లు పైబడిన మహిళలు ప్రయాణించేందుకు మార్గం సుగుమం చేసింది.
హైదరాబాద్: భారతదేశంలో రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. రోజుకు లక్షల మంది ప్రయాణం చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా మహా నగరాలకు, పుణ్యక్షేత్రాలకు, పర్యాటక, ఇతర రాష్ట్రాల్లో నివసించే వారు స్వగ్రామాలకు రైళ్లలో వెళ్లేందుకు ఇష్టపడతారు. తక్కువ ఛార్జీతో ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం ఉండటమే ఇందుకు కారణం. అయితే వారికి సీట్లు దొరకడం అనేది పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి. పండగల సమయంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. ఇక వృద్ధుల గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. దూరం ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చి లోయర్ బెర్త్ దొరకకపోతే వారికి నరకం కనిపిస్తుంది. అయితే వారి సమస్యను తీర్చేందుకు రైల్వే శాఖ ముందుకొచ్చింది.
నయా రూల్స్..
భారతీయ రైల్వే సీనియర్ సిటిజన్ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. లోయర్ బెర్త్‌ల రిజర్వేషన్ కోసం ప్రత్యేక నిబంధనలు రూపొందించింది. దీని వల్ల 60ఏళ్లు పైబడిన పురుషులు, 45 ఏళ్లు పైబడిన మహిళలు ప్రయాణించేందుకు మార్గం సుగుమం చేసింది. ఇన్నాళ్లూ దిగువ బెర్త్ దొరకక వారి పడిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నయా రూల్స్ తెచ్చింది. సీనియర్ సిటిజన్ ఒంటరిగా లేదా మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి ప్రయాణించే సమయంలో లోయర్ బెర్త్ పొందే అవకాశం కల్పించింది. అలాగే ఓ వృద్ధుడు మధ్య లేదా ఎగువ బెర్త్ పొంది దిగువ బెర్త్ అందుబాటులో ఉంటే టికెట్ కలెక్టర్‌ను సంప్రదించి బదిలీ చేసుకోవచ్చని తెలిపింది. అయితే ఇద్దరి కంటే ఎక్కువ మందితో కలిసి ప్రయాణించేటప్పుడు దిగువ బెర్త్ పొందేందుకు ఈ అవకాశం లేదు. అయితే అలా పొందేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
లోయర్ బెర్త్- ఇవి పాటిస్తే చాలు..
సాధారణ సమయం సహా పండగల వేళ్లల్లో టికెట్ బుకింగ్ చేసేటప్పుడు సరైన నియమాలు పాటిస్తే వృద్ధులకు లోయర్ బెర్త్ పొందే అవకాశాలు ఉంటాయి. బుకింగ్ చేసే సమయంలో ఎలాంటి పొరపాట్లు చేయవద్దు. అలా చేస్తే సీనియర్ సిటిజన్లు సరైన సీటు పొందలేరు. బుకింగ్ చేసేటప్పుడు అన్ని విషయాలపై అప్రమత్తంగా ఉండటం అవసరం.
టికెట్ బుక్ చేసే సమయంలో తప్పుకుండా మీరు సీనియర్ సిటిజన్ కోటా ఎంచుకోవాల్సి ఉంటుంది. మీరు IRCTC వెబ్‌సైట్ లేదా ఇతర ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల్లో రిజర్వేషన్ చేసే సమయంలో తప్పకుండా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఈ కోటా కింద వృద్ధులకు లోయర్ బెర్త్‌లు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
కొత్త నిబంధనల ప్రకారం వృద్ధులు ఒంటరిగా ప్రయణించకుండా లేదా ఇద్దరి కంటే ఎక్కువ మందితో ప్రయాణిస్తే లోయర్ బెర్త్ అవకాశం ఉండదు. అప్పుడు ఏ చేయాలంటే.. ఎక్కువ మందితో ప్రయాణించాల్సి వస్తే సీనియర్ సిటిజన్ టికెట్‌ను విడిగా బుక్ చేయడం మంచిది. దీని వల్ల వారు లోయర్ బెర్త్ పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులతో ప్రయాణించేటప్పుడు విడిగా బుక్ చేసుకోవడం మర్చిపోవద్దు.
టికెట్ బుకింగ్ సమయంలో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూసుకోండి. ముఖ్యంగా వృద్ధుల వయస్సును పూరించేటప్పుడు తప్పుగా నమోదు చేయెుద్దు. వారి నిజమైన వయస్సును మాత్రమే తెలపండి. తద్వారా లోయర్ బెర్త్ దొరికే అవకాశాలు ఉంటాయి. తప్పుగా నమోదు చేస్తే మీరు అవకాశాన్ని చేజేతులారా వదులుకున్నట్లే.
పండగల వేళ రైళ్లలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రిజర్వేషన్ తెరిచిన వెంటనే బుక్ చేసుకోవడం ఉత్తమం. తద్వారా అందరి కంటే ముందే సీట్లు దొరికే అవకాశం ఉంటుంది. లోయర్ బెర్త్ కాకపోయినా కనీసం కన్ఫర్మ్ చేసిన బెర్త్ పొందే అవకాశాలైనా ఉంటాయి. ఏసీ క్లాస్ కంటే స్లీపర్ క్లాస్‌లో ఎక్కువ బెర్త్‌లు ఉంటాయి. కాబట్టి స్లీపర్ క్లాసులో బుక్ చేసుకోవడం వల్ల సీటు పొందడం సులభం అవుతుంది. అందుకే వీలైనంత ఎక్కువ బెర్త్‌లు ఉన్న చోటే రిజర్వేషన్ చేసుకోండి.
Updated Date - Sep 30 , 2024 | 05:24 PM