మస్క్ రాకెట్.. ఇస్రో శాటిలైట్
ABN, Publish Date - Nov 17 , 2024 | 04:34 AM
వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఇస్రో వచ్చేవారం మరో వాణిజ్య ప్రయోగానికి సిద్ధమవుతోంది.
ఫాల్కన్-9తో జీశాట్-ఎన్2 ప్రయోగం
స్పేస్ ఎక్స్, ఇస్రో మధ్య కీలక ఒప్పందం
వచ్చే వారం అమెరికాలో ప్రయోగం
భారత్‌లో విమానంలో ఇంటర్నెట్ సేవలకే
న్యూఢిల్లీ, నవంబరు 16: వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఇస్రో వచ్చేవారం మరో వాణిజ్య ప్రయోగానికి సిద్ధమవుతోంది. అయితే ఈ ప్రయోగానికి అమెరికా బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ సంస్థ రూపొందించిన ఫాల్కన్-9 రాకెట్‌ను వినియోగించనుంది. ఈ మేరకు స్పేస్ ఎక్స్‌తో ఇస్రో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఇస్రో, స్పేస్ ఎక్స్ మధ్య వాణిజ్య ఒప్పందాల్లో ఇదే మొదటి ప్రయోగం. అలాగే డొనాల్డ్ ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఇరు సంస్థల మధ్య కుదిరిన మొదటి డీల్ కూడా ఇదే కావడం విశేషం. డొనాల్డ్ ట్రంప్‌తోపాటు, భారత ప్రధాని మోదీ కూడా గతంలో ఎలాన్ మస్క్‌ను ‘నా స్నేహితుడు’ అని పేర్కొంటూ.. ఆయనతో తమకున్న గొప్ప అనుంబంధాన్ని చాటుకున్న సంగతి తెలిసిందే. మస్క్ కూడా తాను మోదీ అభిమానినని గతంలో చెప్పారు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కేప్ కెనరెవాల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నారు.
జీశాట్-ఎన్2 లేదా జీశాట్-20గా పిలిచే ఈ ఉపగ్రహం భారత్‌లో ఇన్-ఫ్లైట్ ఇంటర్నెట్ సేవలను అందించనుంది. ప్రస్తుతానికి దేశంలో ఇన్-ఫ్లైట్ ఇంటర్నెట్ యాక్సె్‌సపై నిషేధం ఉంది. ఈ సేవలను అందిస్తున్న విమానయాన సంస్థలు కూడా భారత గగనతలం మీదుగా ప్రయాణించే సమయంలో వాటిని నిలిపివేయాలి. అయితే భారత గగనతలంపై 3,000 మీటర్ల ఎత్తుకు చేరుకున్న తర్వాత ప్రయాణికులు వైఫై ద్వారా ఇంటర్నెట్ సేవలను వినియోగించుకోవచ్చని పేర్కొంటూ ఈ నెల 4న ప్రభుత్వం నిబంధనలు సవరించింది. ఈ నేపథ్యంలో జీశాట్-ఎన్2 ఉపగ్రహాన్ని ప్రయోగిస్తే.. ఇన్-ఫ్లైట్ ఇంటర్నెట్ సేవలు కూడా పొందే అవకాశం ఉంటుంది. ఇస్రో ప్రయోగిస్తున్న ఈ శాటిలైట్ జీవితకాలం 14 సంవత్సరాలు. భారత్‌లోని మారుమూల ప్రాంతాల్లో సైతం అత్యాధునిక కమ్యూనికేషన్‌ను అందించడంలో ఇది కీలక పాత్ర పోషించనుంది. ఈ ప్రయోగం కోసం ఇస్రో దాదాపు రూ.590 కోట్లు చేస్తున్నట్టు అంచనా.
స్పేస్ ఎక్స్ రాకెట్ ఎందుకంటే..?
భారీ ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చాలంటే ఇస్రో.. తన సొంత ప్రయోగ వాహనం మార్క్-3 రాకెట్‌ను రంగంలోకి దించుతుంది. బాహుబలిగా పేరుగాంచిన ఈ రాకెట్ 4,000 కేజీల బరువున్న భారీ శాటిలైట్లను సైతం మోసుకెళ్లగలదు. అయితే ఇస్రో తాజాగా సిద్ధం చేసిన జీశాట్-ఎన్2 బరువు దాదాపు 4,700 కేజీలు. గతంలో ఇలాంటి భారీ ఉపగ్రహ ప్రయోగాల కోసం ఫ్రెంచ్ సంస్థ ఏరియన్ స్పేస్‌పై ఇస్రో ఆధారపడింది. ప్రస్తుతం ఆ కంపెనీ వద్ద ఇలాంటి ఆపరేషనల్ రాకెట్లు లేవు. అలాగే ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా రష్యా సేవలను పొందే అవకాశం కూడా లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో భారీ రాకెట్లను ప్రయోగించగల స్పేస్ ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్‌ను ఇస్రో ఎంచుకుంది.
Updated Date - Nov 17 , 2024 | 04:34 AM