J&K Assembly polls: ముస్లింలను విడగొట్టేందుకే ఇంజనీర్ రషీద్ విడుదల
ABN, Publish Date - Sep 15 , 2024 | 03:49 PM
మరికొద్ది రోజుల్లో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానుంది. అలాంటి వేళ.. బారాముల్లా ఎంపీ ఇంజనీర్ రషీద్ బెయిల్ పై విడుదల కావడంతో మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా స్పందించారు.
శ్రీనగర్, సెప్టెంబర్ 15: బారాముల్లా ఎంపీ ఇంజనీర్ రషీద్ జైలు నుంచి విడుదల కావడంతో మోదీ ప్రభుత్వంపై నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్, జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ముస్లింలను విడుగొట్టేందుకే అసెంబ్లీ ఎన్నికల ముందు ఇంజనీర్ రషీద్‌ను జైలు నుంచి విడుదల చేశారని ఆరోపించారు. ఒకప్పుడు పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినదించిన వారే.. ప్రస్తుతం ఆ పార్టీతో జత కట్టారని మండిపడ్డారు.
Serilingampally MLA: అరెకపూడి గాంధీ నివాసానికి భారీగా చేరుకున్న పోలీసులు
గతంలో అంటే 1987లో జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలను ఈ సందర్భంగా మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా గుర్తు చేశారు. ఆ సమయంలో పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినదించిన వారితోనే నేడు కలిశారంటూ బీజేపీపై ఆయన నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీతో జత కట్టిన నేషనల్ కాన్ఫరెన్స్ రేపు రాష్ట్రంలో అధికారంలోకి వస్తే.. కాశ్మీర్ లోయలో ఉగ్రవాదం మళ్లీ పేట్రేగిపోతుందంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై సైతం ఆయన స్పందించారు.
2019లో ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. ఈ అయిదేళ్లలో రాష్ట్రంలో ఉగ్రవాద కార్యకలాపాలు ఇంకా కొనసాగుతున్నాయని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేశారు. ఉగ్రవాదుల చేతికి ఆయుధాలు ఎలా వస్తున్నాయని మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా సందేహం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇంజనీర్ రషీద్ జైలు నుంచి విడుదలవుతున్నారంటే.. అతడు బీజేపీ, ఆర్ఎస్‌ఎస్‌లకు చెందిన వ్యక్తి అని ఆయన స్పష్టం చేశారు.
శనివారం జమ్మూ కశ్మీర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పీపుల్స్ డెమెక్రటిక్ పార్టీ, కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలపై ఆయన విమర్శలు గుప్పించారు. ఈ మూడు పార్టీల పాలనలో జమ్మూ కశ్మీర్ రాష్ట్రం తీవ్రంగా నష్టం పోయిందంటూ ప్రధాని మోదీ ఆరోపించిన సంగతి తెలిసిందే.
ఉగ్రవాదులకు నిధులు అందిస్తున్నారనే ఆరోపణలపై ఇంజనీర్ రషీద్‌ను గతంలో ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. నాటి నుంచి ఆయన ఢిల్లీలోని తీహాడ్ జైల్లో ఉన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బారాముల్లా లోక్‌సభ స్థానం నుంచి ఆయన ఎన్నికల బరిలో దిగారు. ఆయన ప్రత్యర్థి, నేషనల్ కాన్ఫరెన్స్ ఉపాధ్యక్షుడు, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లాపై ఇంజనీర్ రషీద్ భారీ అధిక్యంతో గెలుపొందిన విషయం విధితమే.
జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల వేళ.. తీహాడ్ జైలు నుంచి బెయిల్‌పై ఇంజనీర్ రషీద్ ఇటీవలే విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 5వ తేదీన మూడు దశల్లో జరగనున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అక్టోబర్ 8వ తేదీన వెలువడనున్నాయి.
For More National NewsandTelugu News
Updated Date - Sep 15 , 2024 | 03:49 PM