Justice Sanjiv Khanna: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా
ABN, Publish Date - Nov 11 , 2024 | 10:50 AM
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ సంజీవ్ ఖన్నాను నియమిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్‌ను జారీ చేసిన విషయం తెలిసిందే. 51వ ప్రధాన న్యాయమూర్తిగా సంజీవ్ ఖన్నా ఇవాళ( నవంబరు 11)న బాధ్యతలు చేపట్టారు.
ఢిల్లీ: సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులయ్యారు. సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా ఇవాళ(సోమవారం) ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిస్ సంజీవ్ ఖన్నాతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, మాజీ సీజేఐ ఎన్వీరమణ తదితరులు పాల్గొన్నారు. వచ్చే ఏడాది మే 13వ తేదీ వరకు సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా కొనసాగనున్నారు. ఎన్నికల బాండ్లు, ఈవీఎంలు, ఆర్టికల్ 370 తదితర కేసుల్లో జస్టిస్ సంజీవ్ ఖన్నా కీలక తీర్పులిచ్చారు.
న్యాయ వ్యవస్థలో శిఖరాగ్రస్థానానికి సంజీవ్ ఖన్నా
జస్టిస్ సంజీవ్ ఖన్నా... న్యాయ వ్యవస్థలో శిఖరాగ్రస్థానానికి చేరుకున్నారు. జిల్లా కోర్టులో న్యాయవాదిగా జీవితాన్ని ప్రారంభించిన ఆయన భారత ప్రధాన న్యాయమూర్తిగా కర్తవ్యాన్ని నిర్వహించనున్నారు. సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా (సీజేఐ) సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ పదవీ కాలం ఆదివారం ముగియడంతో సంజీవ్ ఖన్నా పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన అక్కడి నుంచి నేరుగా సుప్రీంకోర్టుకు చేరుకుంటారు. కోర్టు నంబర్-1లో సీజేఐ హోదాలో కేసుల విచారణను ప్రారంభిస్తారు. ఆయన దాదాపు ఆరు నెలల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. వచ్చే ఏడాది మే 13న తన 65వ పుట్టినరోజుకు ఒకరోజు ముందు పదవీ విరమణ చేయనున్నారు. భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో జస్టిస్ ఖన్నా తన అలవాట్లను మార్చుకోనున్నారు. తనకెంతో ఇష్టమైన మార్నింగ్ వాక్‌కు విరామం ఇవ్వనున్నారు. ఇప్పటి వరకు ఆయన ప్రతి రోజూ లోధి గార్డెన్ వద్ద ఒంటరిగా మార్నింగ్ వాక్ చేసేవారు. ఇప్పుడు తనను అందరూ గుర్తుపట్టే అవకాశం ఉండటం, భద్రత కారణాల రీత్యా ఉదయపు నడకకు విరామం ప్రకటించినట్లు సమాచారం.
సంజీవ్ ఖన్నా కుటుంబ నేపథ్యం ఇది..
జస్టిస్ సంజీవ్ ఖన్నా న్యాయమూర్తుల కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తండ్రి జస్టిస్ దేవరాజ్ ఖన్నా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. చిన్నాన్న జస్టిస్ హన్సరాజ్ ఖన్నా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వ్యవహరించారు. ఢిల్లీలోని బరాఖంబా రోడ్‌లోని మోడరన్ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తిచేసిన జస్టిస్ సంజీవ్ ఖన్నా 1980లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ పట్టా తీసుకున్నారు. అదే యూనివర్సిటీలో న్యాయవిద్యను అభ్యసించారు. 1983లో ఢిల్లీ బార్ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరును నమోదు చేసుకున్నారు. తీస్ హజారీ కాంప్లెక్స్‌లోని జిల్లా న్యాయస్థానంలో తొలుత ప్రాక్టీస్ చేశారు. 2004లో ఢిల్లీ ప్రభుత్వం తరఫున నేషనల్ క్యాపిటల్ టెరిటరీకి స్టాండింగ్ కౌన్సెల్‌గా నియమితులయ్యారు. 2005లో ఢిల్లీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2006లో శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2019 జనవరి 18న సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి పొందారు. సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, తన చిన్నాన్న జస్టిస్ హెచ్.ఆర్.ఖన్నా కూర్చొన్న కోర్టు గది నుంచి తన మొదటి రోజును ప్రారంభించారు. ప్రస్తుతం నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా సేవలు అందిస్తున్నారు.
Updated Date - Nov 11 , 2024 | 12:06 PM