Kamala Haasan: కాంగ్రెస్ అభ్యర్థుల ప్రచారానికి కమలహాసన్ ‘నో’
ABN, Publish Date - Mar 27 , 2024 | 01:47 PM
డీఎంకేతో పొత్తుపెట్టుకున్న మక్కల్ నీదిమయ్యం నాయకుడు కమలహాసన్(Kamala Haasan) కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయడానికి ససేమిరా కుదరదంటూ భీష్మించారు.
చెన్నై: డీఎంకేతో పొత్తుపెట్టుకున్న మక్కల్ నీదిమయ్యం నాయకుడు కమలహాసన్(Kamala Haasan) కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయడానికి ససేమిరా కుదరదంటూ భీష్మించారు. లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే కూటమిలో కాంగ్రెస్‌కు లభించే పది స్థానాల్లో ఒకట్రెండు స్థానాలు తమ పార్టీకి కేటాయిస్తారని మక్కల్ నీదిమయ్యం నేతలంతా ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ కావడానికి ముందు పార్టీ నిర్వాహకుల సమావేశంలో కాంగ్రెస్ తమ పార్టీకి ఒకటి లేదా రెండు సీట్లు కేటాయిస్తుందని భావించి రెండు రోజుల్లో అందరికీ శుభవార్త చెబుతానని ప్రకటించారు. ఆ తర్వాత డీఎంకే కూటమిలోని కాంగ్రెస్ సహా అన్ని మిత్రపక్షాలు సీట్లకేటాయింపులు పూర్తయ్యాయి. కానీ కాంగ్రెస్ తమకు కేటాయించిన పుదుచ్చేరి సహా పది సీట్లలో ఒకటి రెండు సీట్లను కమల్‌కి కేటాయించడం కుదరదంటూ తేల్చి చెప్పింది. దీంతో దిగ్ర్భాంతి చెందిన కమల్ ఒంటరి పోరుకు దిగుదామని అనుకుంటుండగా డీఎంకే అధిష్ఠానం నుంచి పిలుపురావటం, 2025లో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో ఒక సీటును మక్కల్ నీది మయ్యంకు కేటాయించేలా ఒప్పందం ఆగమేఘాలపై కుదిరింది. దీంతో సంతృప్తి చెందిన కమల్ కాంగ్రెస్ మినహా డీఎంకే కూటమిలోని అన్ని మిత్రపక్షాల అభ్యర్థులకు మాత్రమే ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఆ దిశగానే తన ప్రచార పర్యటన కార్యక్రమాలను కూడా రూపొందించుకున్నారు.
ప్రచారం ఇలా...
ఈనెల 29 నుంచి ఏప్రిల్ 16 వరకు ఆయన డీఎంకే, డీపీఐ, సీపీఐ, సీపీఎం, ఎండీఎంకే అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేయన్నారు. ఈనెల 29న ఈరోడ్‌లో డీఎంకే అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేస్తారు. 30న సేలంలో డీఎంకే అభ్యర్థికి మద్దతుగా, ఏప్రిల్ 2న తిరుచ్చిలో ఎండీఎంకే అభ్యర్థి దురై వైగోకు మద్దతుగా ప్రచారం చేయనున్నారు. ఏప్రిల్ 3న చిదంబరంలో డీపీఐ నేత తిరుమావళవన్‌కు మద్దతుగా, 6న చెన్నైలో డీఎంకే అభ్యర్థులకు మద్దతుగా, అదే రోజు శ్రీపెరుంబుదూరులో ప్రచారం చేస్తారు. ఏప్రిల్ 7న కూడా చెన్నైలోనే ప్రచారం చేస్తారు. ఏప్రిల్ 10న మదురైలో సీపీఎం అభ్యర్థికి మద్దతుగా, 11న తూత్తుకుడిలో డీఎంకే అభ్యర్థి కనిమొళి కోసం ప్రచారం చేస్తారు. ఏప్రిల్ 14న తిరుప్పూరులో, 15న కోయంబత్తూరులో, 16న పొల్లాచ్చిలో ప్రచారం చేయనున్నారు. ఈ 11 రోజుల ప్రచార పర్యటనలో ఎక్కడా కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేసే అవకాశమే లేదు. ఈ పరిస్థితులలో తమ పార్టీ అభ్యర్థులకు కమల్ ప్రచారం చేసేలా టీఎన్‌సీసీ నేతలు చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతగై, మాజీ అధ్యక్షుడు తంగబాలు తదితర నాయకులు కమల్‌ను కలుసుకుని కాంగ్రెస్ తరఫున కూడా ప్రచారం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ సందర్భంగా కమల్ హాసన్ కాంగ్రెస్ నేతలకు ప్రచారం చేస్తానని గానీ, ప్రచారం చేయనని గానీ చెప్పకుండా చిరునవ్వుతో కాంగ్రెస్ నేతలను సాగనంపారు.
కూటమి నేతలతో మారన్ వరుస భేటీలు
అడయార్: లోక్‌సభ ఎన్నికల్లో సెంట్రల్ చెన్నై నుంచి డీఎంకే అభ్యర్థిగా మరోమారు అదృష్టాన్ని పరీక్షించుకోనున్న దయానిధి మారన్.. విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇందులోభాగంగా, డీఎంకే భాగస్వామ్య పార్టీల నేతలతో ఆయన వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం సత్యమూర్తి భవన్‌లో టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుందగైతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేతలను కలుసుకుని మద్దతు కోరారు. అలాగే, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అధినేత ఖాదర్ మొహిద్దీన్‌ను కలిసి మద్దతు ఇవ్వాలని కోరారు.
Updated Date - Mar 27 , 2024 | 01:47 PM