త్వరలో ‘కోల్ ఎక్స్ఛేంజ్’ ఏర్పాటు: కిషన్ రెడ్డి
ABN, Publish Date - Oct 22 , 2024 | 03:49 AM
బొగ్గు అమ్మకం, కొనుగోలుదార్లకు సౌకర్యంగా ఉండేందుకు త్వరలో కేంద్ర ప్రభుత్వం ‘కోల్ ఎక్స్ఛేంజ్’ను ఏర్పాటు చేయనుంది.
రష్యా నుంచి కోకింగ్ కోల్ దిగుమతి చేసుకునే యోచన
న్యూఢిల్లీ, అక్టోబరు 21: బొగ్గు అమ్మకం, కొనుగోలుదార్లకు సౌకర్యంగా ఉండేందుకు త్వరలో కేంద్ర ప్రభుత్వం ‘కోల్ ఎక్స్ఛేంజ్’ను ఏర్పాటు చేయనుంది. ఇతర ఖనిజాలకు కమాడిటీ ఎక్స్ఛేంజ్ ఉన్నట్టు విధంగానే బొగ్గు కోసం ప్రత్యేకంగా దీన్ని నెలకొల్పనుంది. ఈ విషయాన్ని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి సోమవారం వెల్లడించారు. ఇటీవల జరిగిన సమావేశంలో దీనిపై చర్చించినట్టు తెలిపారు. కోల్ ట్రేడింగ్ ఎక్స్ఛేంజ్ నెలకొల్పాలని 2024-25 ప్రణాళికలో బొగ్గు శాఖ ప్రతిపాదించింది. ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం ఏర్పాటుచేసి బొగ్గు అమ్మకాలు, కొనుగోళ్లు, అనుమతులు పొందడం తదితర విషయాల్లో ఇబ్బందులు లేకుండా చూసేందుకు ఈ ఎక్స్ఛేంజ్ ఉండాలని నిర్ణయించింది. దీనిపై నోట్ రూపొందించి వివిధ మంత్రిత్వ శాఖల అభిప్రాయాలు తెలుసుకొంది. మంత్రివర్గం పరిశీలన కోసం పంపే తుది నోట్‌కు మంత్రి కిషన్‌రెడ్డి ఆమోదం తెలిపారు. ఇది కోల్ కంట్రోలర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పనిచేయనుంది. కాగా, అవసరమైతే రష్యా నుంచి కోకింగ్ కోల్‌ను దిగుమతి చేసుకుంటామని మంత్రి చెప్పారు.
Updated Date - Oct 22 , 2024 | 03:49 AM